వట సావిత్రి వ్రతం.. తప్పక తెలుసుకోవాల్సిన కథ ఇది-know vata savitri vratha katha puja vidhi ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వట సావిత్రి వ్రతం.. తప్పక తెలుసుకోవాల్సిన కథ ఇది

వట సావిత్రి వ్రతం.. తప్పక తెలుసుకోవాల్సిన కథ ఇది

HT Telugu Desk HT Telugu
May 18, 2023 09:58 AM IST

జ్యేష్ట మాసంలో వచ్చే అమావాస్య రోజున వట సావిత్రి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజు శనీశ్వరుడి జయంతి కూడా.

వట సావిత్రి వ్రతం రోజు మర్రి చెట్టుకు పూజలు చేయాలి
వట సావిత్రి వ్రతం రోజు మర్రి చెట్టుకు పూజలు చేయాలి (By Aritro Mukherjee IN - Own work, CC BY-SA 4.0, https://commons.wikimedia.org/w/index.php?curid=113224036)

జ్యేష్ట మాసంలో వచ్చే అమావాస్య రోజున వట సావిత్రి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజు శనీశ్వరుడి జయంతి కూడా. వట సావిత్రి వ్రతం మే 19 శుక్రవారం రోజు రానుంది. ఉత్తరాదిన జ్యేష్ట అమావాస్య రోజున అంటే మే 19న, అలాగే తెలుగు రాష్ట్రాల్లో జ్యేష్ట శుద్ధ పౌర్ణమి రోజున ఈ వట సావిత్రి వ్రతాన్ని ఆచరిస్తారు.

ఈరోజున మర్రి చెట్టు పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మర్రి చెట్టు కింద కూర్చుని సావిత్రి, సత్యవంతుని కథ విని చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి పచ్చి నూలు కట్టాలి. వీటితో పాటు నూలును మెడలో కూడా వేసుకోవాలి. ఈ ఉపవాసం చేయడం వల్ల భర్త జీవితం సుదీర్ఘంగా ఉంటుందని నమ్ముతారు. వట సావిత్రి వ్రతం కథను మీరు కూడా చదవండి.

సావిత్రి, సత్యవంతుల కథ ఇదీ..

మద్ర దేశపు రాజర్షి అశ్వపతి ఏకైక సంతానం సావిత్రి.. ఆమె రాజు ద్యుమత్సేనుడి కుమారుడు సత్యవంతుడు గుణవంతుడని చెలికత్తెల ద్వారా తెలుసుకుంటుంది. కానీ ద్యుమత్సేనుడు కళ్లు కోల్పోయి, శత్రువల కారణంగా రాజ్యం కోల్పోయి అడవిలో నివసిస్తుంటాడు. అయితే సత్యవంతుడు అల్పాయుష్కుడని, వివాహం చేసుకున్న ఏడాదికే మరణిస్తాడని నారదుడు చెప్పినా సావిత్రి తన నిర్ణయాన్ని మార్చుకోకుండానే సత్యవంతుడిని పెళ్లి చేసుకుంటుంది.

సావిత్రి రాజభవనంలోని అన్ని సుఖాలను, వైభవాన్ని త్యజించి సత్యవంతుడికి, అతడి కుటుంబానికి సేవ చేస్తూ అడవిలో నివసించడం ప్రారంభించింది. సంవత్సరం గడవడానికి ఇంకా నాలుగు రోజులే ఉంటుంది. సావిత్రి అప్పుడు ఉపవాస దీక్ష ప్రారంభిస్తుంది. నాలుగో రోజు సత్యవంతుడు కట్టెలు కొట్టడానికి అడవికి వెళతాడు. అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతాడు. అదే సమయంలో సత్యవంతుడి ప్రాణాలు తీసుకుపోవడానికి యమధర్మరాజు వస్తాడు.

మూడు రోజులుగా ఆహారం తీసుకోకుండా ఉన్న సావిత్రికి ఏం జరుగుతుందో తెలుసుకాబట్టి సత్యవంతుడి ప్రాణాలు తీసుకెళ్లొద్దని యమరాజును ప్రార్థిస్తుంది. కానీ యమరాజు ఒప్పుకోలేదు. అప్పుడు సావిత్రి అతడిని అనుసరించడం ప్రారంభిస్తుంది. ఎన్నిసార్లు నిరాకరించినా ఆమె ఒప్పుకోకపోవడంతో సావిత్రి ధైర్యసాహసాలకు, త్యాగానికి ముగ్దుడైన యమరాజు మూడు వరాలు ప్రసాదిస్తాడు.

సావిత్రి సత్యవంతుడి అంధ తల్లిదండ్రులకు కళ్లకు వెలుగును ప్రసాదించమని కోరుకుంటుంది. కోల్పోయిన తమ రాజ్యాన్ని కోరుతుంది. అలాగే తనకు 100 కుమారుల వరం కోరింది. ఈమాట చెప్పాక సావిత్రి భర్తను వెంట తీసుకెళ్లడం అసాధ్యమైన యమధర్మరాజుకు అర్థమైంది. అందువల్ల సావిత్రికి తిరుగులేని అదృష్టాన్ని ప్రసాదించి సత్యవంతుడిని వదిలి అక్కడి నుంచి మాయమవుతాడు. ఆ సమయంలో సావిత్రి భర్తతో కలిసి మర్రిచెట్టు కింద కూర్చుంటుంది.

అందుకే ఈరోజున స్త్రీలు తమ కుటుంబం, జీవిత భాగస్వామి దీర్ఘాయుష్షును కాంక్షిస్తూ మర్రిచెట్టుకు భోగాన్ని సమర్పించి దానిపై దారాన్ని చుట్టి పూజిస్తారు. మర్రిచెట్టుకు పూలు, గాజులు, పసుపుతో పూజిస్తారు. ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. ఐదుగురు ముత్తైదువులకు పండ్లు తాంబూలం దానం చేస్తారు.

Whats_app_banner