Garba dance: నవరాత్రుల సమయంలోనే గర్భా, దాండియా ఎందుకు ఆడతారు? ఇవి రెండూ ఒకటేనా?
08 October 2024, 10:00 IST
- Garba dance: నవరాత్రులు వచ్చాయంటే గుజరాత్ ప్రజలు ఎంతో ఉత్సాహంగా గర్భా, దాండియా ఆడుతూ ఆనందంగా గడుపుతారు. అసలు ఇవి నవరాత్రి సమయంలో మాత్రమే ఎందుకు ఆడతారు. ఈ రెండు నృత్యాలు ఒక్కటేనా? వీటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది తెలుసుకోండి.
నవరాత్రి సమయంలో గర్భా, దాండియా ఎందుకు ఆడతారు?
నవరాత్రి వేడుకలు అంటే దుర్గా పూజ, ఉపవాసం, రావణుడి దహనం మాత్రమే కాదు గర్భా నృత్యం, దాండియా కూడా ఉంటాయి. ఇవి లేకుండా నవరాత్రి ఉత్సవాలు అసంపూర్ణంగా అనిపిస్తాయి. గుజరాత్ లో శరన్నవరాత్రి ఉత్సవాల్లో తప్పనిసరిగా ఈ నృత్యాలు ఆడతారు.
గర్భా అనేది సంప్రదాయ జానపద నృత్యం. నవరాత్రి సమయంలో మాత్రమే ఎక్కువగా ఇది ఆడతారు. ప్రజలందరూ కలిసి ఎంతో సంతోషంగా ఈ నృత్యంలో పాలుపంచుకుంటారు. దుర్గాదేవి తొమ్మిది అవతారాలకు తమ నాట్యం ద్వారా కృతజ్ఞతలు తెలుపుతారు. గర్భా అనేది గుజరాతీ సంప్రదాయ నృత్యం. శక్తి దేవతకు అంకితం చేస్తూ దీన్ని చేస్తారు. అది మాత్రమే కాకుండా స్త్రీలు, సంతానోత్పత్తిని కీర్తిస్తూ ఈ నృత్యంలో పాల్గొంటారు. ఒక పెద్ద దీపం లేదా శక్తి విగ్రహం చుట్టూ గుండ్రంగా నిలబడి గార్భా ఆడతారు.
గర్భా అంటే గర్భం లేదా చిన్న మట్టి లాంతర్లు అని అర్థం. ఈ నృత్యానికి అందరూ ఆకర్షితులు అవుతారు. గుజరాత్ రాష్ట్రంలోని అత్యంత పవిత్రమైన, ప్రసిద్ధ నృత్య రూపాలలో ఒకటిగా ఉంటుంది. దుర్గా దేవి విజయాన్ని పురస్కరించుకుని ప్రజలు గర్బా దరువులకు నృత్యం చేయడం ప్రారంభించారు. ఈ నృత్య రూపం పురాతన కాలం నుండి ఆచారిస్తూ ఉంటారు. ఏ వయసు వారైనా ఇందులో ఉత్సాహంగా పాల్గొని కాలు కదుపుతారు. శక్తి దేవత ఆశీర్వాదాలు పొందేందుకు ఇది ఒక మార్గం.
నవరాత్రులలో గర్బా ప్రాముఖ్యత
ఈ నృత్యం ప్రత్యేకంగా నవరాత్రుల సమయంలోనే ఆడతారు. అది అప్పుడు మాత్రమే ఎందుకు చేస్తారు అనే అనుమానం చాలా మందికి ఉంటుంది. దుర్గా దేవి ఆశీర్వాదాలు పొందటం కోసం ఇది ఉత్తమమైన మార్గం. చెడుపై మంచి కోసం దుర్గాదేవి సాధించిన విజయాన్ని స్వాగతిస్తూ ఈ నృత్యం చేస్తారు.
అది మాత్రమే కాకుండా గర్భా జీవిత, మరణ చక్రాలను సూచిస్తుందని అంటారు. దైవిక స్త్రీ శక్తికి నివాళులు అర్పించే మార్గంగా చెప్తారు. రంగు రంగుల దుస్తులు ధరించి వేగంగా, లయబద్ధంగా నృత్యాలు చేస్తారు. గర్భా అనేది మహిళల గర్భాన్ని సూచిస్తుంది. అంటే మహిళల సంతానోత్పతి. దుర్గా దీవనెలు కోర స్త్రీలు గర్భా నృత్యంలో తప్పనిసరిగా పాల్గొంటారు.
దాండియా
అదే సమయంలో గర్భా తో పాటు దాండియా కూడా ఆడతారు. దుర్గాదేవి, మహిషాసురుడి మధ్య జరిగిన యుద్ధానికి ప్రతీకగా ఇది చేస్తారు. దాండియాలో ఉపయోగించే కర్రలు దుర్గాదేవి ఖడ్గంగా భావిస్తారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి చిహ్నంగా పరిగణిస్తారు.
దాండియా గర్భా మధ్య తేడా ఏంటి?
దాండియా, గర్భా చూసేందుకు ఒక రకంగా అనిపిస్తాయి. కానీ ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది. గర్భా చేతులు, కాళ్ళు ఒకే విధంగా కదిలిస్తారు. దాండియా చెక్క కర్రలు ఉపయోగిస్తూ నృత్యం చేస్తారు. దాండియా చేస్తున్నప్పుడు అందులో పాల్గొనే వాళ్ళు సరి సంఖ్యలో ఉంటారు. కానీ గర్భాకు మాత్రం అలాంటి పరిమితులు ఏమి లేవు. ఎంతమంది అయినా పాల్గొనవచ్చు. గర్బా ప్రదర్శించబడే పాటలు దుర్గాదేవి, ఆమె తొమ్మిది అవతారాలపై ఆధారపడి ఉంటాయి. అయితే దాండియా కృష్ణుడి సంగీత పాటలతో ఆడతారు. ఇది కృష్ణుడు తన రాధలతో రాసలీలలో ఆడినట్టు చెప్తారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.