Goddess durga: నవరాత్రుల్లో ఏ రోజు ఏ పువ్వులు సమర్పిస్తే దుర్గాదేవి ఆశీస్సులు లభిస్తాయో తెలుసా?
Goddess durga: నవరాత్రి పవిత్ర పండుగలో దుర్గామాత తొమ్మిది రూపాలను పూజిస్తారు. ఒక్కో రోజు ఒక్కో రంగు పూలతో అమ్మవారిని పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఏ రోజు ఏ రంగు పూలు సమర్పించాలో ఇక్కడ తెలుసుకోండి.
ఈ ఏడాది శారదీయ నవరాత్రులు అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. హిందూ మతంలో ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్రమైన పండుగలో దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజిస్తారు.
దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి తొమ్మిది రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. దీనితో పాటు అమ్మవారిని పూజించడానికి వివిధ రోజులలో వివిధ పుష్పాలను సమర్పించే సంప్రదాయం కూడా ఉంది. అమ్మవారి తొమ్మిది రూపాలు వివిధ రంగుల పువ్వులను ఇష్టపడతారు. తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పూలను సమర్పించడం వల్ల భక్తుల కోరికలన్నీ దుర్గాదేవి తీరుస్తుంది. అందువల్ల ఏ రోజు ఏ పువ్వులు సమర్పించాలో తెలుసుకుందాం.
మొదటి రోజు
శారదియ నవరాత్రుల మొదటి రోజు దుర్గాదేవి శైలపుత్రి రూపానికి అంకితం చేయబడింది. ఈ రోజున అమ్మ శైలపుత్రిని కలశ స్థాపనతో పాటు పూజిస్తారు. శైలపుత్రి తల్లికి గులాబీ, మల్లెపూలు అంటే చాలా ఇష్టమని చెబుతారు. కావున మీరు నవరాత్రి మొదటి రోజున తల్లి శైలపుత్రికి గులాబీ, మల్లెపూలను సమర్పించవచ్చు.
రెండో రోజు
నవరాత్రి రెండవ రోజు అమ్మవారి బ్రహ్మచారిణి స్వరూపానికి అంకితం చేయబడింది. కమలం, మల్లెలు మొదలైన తెల్లని రంగుల పువ్వులంటే వీరికి చాలా ఇష్టం. నవరాత్రి రెండవ రోజు మీరు బ్రహ్మచారిణి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి తామర లేదా మల్లెపూలను సమర్పించవచ్చు.
మూడో రోజు
శారదీయ నవరాత్రుల మూడవ రోజున మాతా రాణి చంద్రఘంట రూపాన్ని పూజిస్తారు. చంద్రఘంట తల్లికి ఎరుపు రంగు పూలు, మందార పువ్వులు అంటే చాలా ఇష్టం. అందుకే నవరాత్రి మూడవ రోజు దుర్గా పూజకు మందారం లేదా ఏదైనా ఎరుపు రంగు పువ్వును సమర్పించవచ్చు.
నాల్గవ రోజు
నవరాత్రులలో నాలుగో రోజు కూష్మాండ దేవిని పూజించాలనే నియమం ఉంది. ఆమెకు పసుపు బంతి పువ్వులంటే చాలా ఇష్టం. అందువల్ల నవరాత్రులలో నాల్గవ రోజున మాతా రాణి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి పసుపు బంతి పువ్వులను సమర్పిస్తారు.
ఐదవ రోజు
నవరాత్రులలో ఐదవ రోజు తల్లి స్కందమాతగా అమ్మవారిని పూజిస్తారు. స్కందమాత ఎరుపు, పసుపు పువ్వులను ఇష్టపడుతుంది. అందుకే నవరాత్రి ఐదవ రోజున ఎర్ర గులాబీలు, పసుపు బంతి పువ్వులను సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు.
ఆరవ రోజు
నవరాత్రులలో ఆరవ రోజున కాత్యాయని దేవిని పూజిస్తారు. ఆమె దుష్టులను నాశనం చేసే వ్యక్తిగా భావిస్తారు. వీరికి ఎర్రటి మందార పూలు అంటే చాలా ఇష్టం. అందుకే నవరాత్రులలో ఆరవ రోజున కాత్యాని దేవికి మందార పువ్వులు సమర్పించాలనే నియమం ఉంది. మందార పువ్వులు సమర్పించడం వల్ల ఆమెకు సంతోషం కలుగుతుందని, అన్ని రకాల దుఃఖాలు తీరిపోతాయని నమ్ముతారు.
ఏడవ రోజు
నవరాత్రులలో ఏడవ రోజు కాళరాత్రి దేవికి అంకితం చేయబడింది. కమలం, మల్లెపూలంటే అమ్మవారికి చాలా ఇష్టం. నవరాత్రులలో ఏడవ రోజున కాళరాత్రి దేవి పూజలో మల్లెపూలను సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు.
ఎనిమిదవ రోజు
నవరాత్రులలో ఎనిమిదవ రోజు మాత మహాగౌరీకి అంకితం చేశారు. ఈ రోజున మహాగౌరీని పూజిస్తారు. తెల్లటి పువ్వులంటే చాలా ఇష్టం. అందుకే పూజలో మల్లెపూలు, తెల్లటి పువ్వులు సమర్పించడం శుభప్రదం.
తొమ్మిదవ రోజు
నవరాత్రులలో తొమ్మిదవ రోజు తల్లి సిద్ధిదాత్రికి అంకితం. ఈ పూజలతో నవరాత్రుల 9వ రోజు ముగుస్తుంది. ఈ ప్రత్యేకమైన రోజున మందారం, గులాబీ పువ్వులను సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.