తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ayyappa Deeksha: కార్తీకమాసంలోనే అయ్యప్ప దీక్ష ఎందుకు చేపడతారు? దీని వెనుక ఉన్న పరమార్థం ఏంటి?

Ayyappa deeksha: కార్తీకమాసంలోనే అయ్యప్ప దీక్ష ఎందుకు చేపడతారు? దీని వెనుక ఉన్న పరమార్థం ఏంటి?

Gunti Soundarya HT Telugu

17 October 2024, 11:06 IST

google News
    • Ayyappa deeksha: మరికొద్ది రోజుల్లో కార్తీకమాసం ప్రారంభం కాబోతుంది. ఈ మాసం రాగానే చాలా మంది అయ్యప్ప దీక్ష చేపడతారు. అయితే కార్తీకమాసంలోనే అయ్యప్ప మాల ధరించడానికి కారణం ఏంటి? దీని వెనుక ఉన్న పరమార్థం ఏంటి? మాల ధరించడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం. 
ఇరుముడితో అయ్యప్ప భక్తులు
ఇరుముడితో అయ్యప్ప భక్తులు

ఇరుముడితో అయ్యప్ప భక్తులు

కార్తీకమాసం ప్రారంభం కాగానే చాలా మంది అయ్యప్ప దీక్షలు చేపడతారు. కొంతమంది మండల దీక్ష, మరికొందరు అర్థ మండల దీక్ష చేపడతారు. 41 రోజుల పాటు దీక్ష చేపట్టి శబరిమల వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకుని మాల విరమిస్తారు.

సంవత్సరంలో పన్నెండు నెలలు ఉండగా ఎక్కువగా నవంబర్, డిసెంబర్ నెలలో అయ్యప్ప దీక్ష చేపడతారు. కార్తీకమాసం వచ్చిన తర్వాత ఈ మాల ధరిస్తారు. అయితే ఇదే మాసంలో ధరించడానికి వెనుక అటు మతపరంగా శాస్త్రీయపరంగా అనేక లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

కార్తీకమాసం చాలా చల్లగా ఉంటుంది. శరీరం చల్లదనం తట్టుకోవడం కాస్త కష్టంగా అనిపిస్తుంది. పొద్దున్నే నిద్రలేచి చన్నీటి స్నానం చేయడం వల్ల శరీరానికి చాలా మంచిది. అలాగే ఏక భుక్తం చేయడం మంచిది. చలికాలంలోనే ఎక్కువగా పండుగలు, ఉపవాసాలు ఉంటాయి. సాధారణంగా ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడు దుర్ముహూర్తం, వర్జ్యం వంటివి చూస్తారు. కానీ ఎటువంటి ముహూర్తాలు చూడకుండా చేపట్టే ఏకైక దీక్ష అయ్యప్ప దీక్ష అని పండితులు చెబుతున్నారు. చల్లటి వాతావరణంలో కఠినమైన ఉపవాసం ఆచరించడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందుకే ఇది సైంటిఫిక్ గా మంచిదని అంటారు.

ఒత్తిడి తగ్గుతుంది

అయ్యప్ప మాల ధరించిన వాళ్ళు మనసు, శరీరం మొత్తం దేవుడి మీద లగ్నం చేస్తారు. భక్తి శ్రద్ధలతో నిత్యం పూజలు చేస్తారు. దీని వల్ల ప్రాపంచిక కోరికలు ఉండవు. మనసు తేలికగా ఉంటుంది. భక్తి మార్గంలో పయనిస్తారు. నిత్యం ఎన్నో ఒత్తిడులతో నలిగిపోయే ప్రజలు మాల ధరించిన తర్వాత చన్నీటి స్నానం చేయడం వల్ల మెదడు మీద దాని ప్రభావం తగ్గిపోతుంది. అలాగే కఠినమైన ఆహార నియమాలు పాటిస్తారు. ఎటువంటి మసాలా ఆహారం తీసుకోరు. వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి వాటికి దూరంగా ఉంటారు.

ఆరోగ్యానికి మేలు

సాత్విక ఆహారం తీసుకుంటూ ఏక భుక్తం చేస్తారు. దీని వల్ల జీర్ణసమస్యలు తగ్గుతాయి. మితంగా ఆహారం తీసుకుంటారు. అది కూడా సమయానికి తింటారు. దీని వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అలాగే అయ్యప్ప మాల ధరించిన వాళ్ళు పాదాలకు చెప్పులు లేకుండా నడుస్తారు. దీని వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. భక్తులు తప్పనిసరిగా నేల మీద మాత్రమే నిద్రించాలి. శరీరం మొత్తం నేల మీద ఆనుకునే విధంగా పడుకోవడం చాలా మంచిది. నడుము నొప్పి వంటివి తగ్గుతాయి. నేల మీద నిద్రించడం వల్ల రక్త ప్రసరణ శరీరానికి బాగా జరుగుతుంది.

శరీరానికి వేడి ఇస్తుంది

అయ్యప్ప మాల ధరించిన వ్యక్తులు తప్పనిసరిగా నలుపు రంగు దుస్తులు ధరిస్తారు. చల్లటి వాతావరణంలో నలుపు రంగు దుస్తులు శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి. అలాగే మాల ధరించిన 41 రోజులు దాంపత్య జీవితానికి దూరంగా ఉంటూ మనసులోకి ఎటువంటి చెడు ఆలోచనలు రానివ్వకుండా ఉంటారు. నుదుటి మీద ఎప్పుడూ విభూది లేదా చందనం తిలకం ధరిస్తారు. ఇది రెండు కనుబొమ్మల మధ్య పెట్టుకుంటారు. జ్ఞాన కేంద్రంగా దీన్ని పరిగణిస్తారు. అలాగే చందనం శరీరాన్ని శాంతపరుస్తుంది.

ఇలా అయ్యప్ప దీక్ష సమయంలో అనుసరించే ప్రతి ఒక్క నియమం ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. ఇటు మనసును తేలిక పరుస్తుంది. ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది. అందుకే కార్తీకమాసంలో ఎంతో కఠిన నియమాలు ఆచరిస్తూ మాల ధరిస్తారు. ఇది ఆధ్యాత్మికంగా, శారీరకంగా ఎదిగేందుకు అవసరమైన జ్ఞానాన్ని అందజేస్తుంది.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

తదుపరి వ్యాసం