Maha Shivaratri 2023 । బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు గొప్ప? మహా శివరాత్రి ప్రత్యేక కథనం!
16 February 2023, 18:27 IST
- Maha Shivaratri 2023: బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు గొప్ప? శివుడిని లింగాకారంలో ఎందుకు పూజిస్తారు? మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక కథనం ఇక్కడ చదవండి.
Maha Shivaratri 2023:
Maha Shivaratri 2023: మాఘ మాసం కృష్ణ పక్ష చతుర్దశి రోజున వచ్చే శివరాత్రిని మహా శివరాత్రిగా ప్రాశస్త్యం పొందింది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివ పురాణంలో ఉంది. అసలు శివుడు లింగాకారంగా ఎందుకు ఆవిర్భవించాడు. త్రిమూర్తులలో శివుడు, విష్ణువులనే పూజిస్తారు, బ్రహ్మకు ఎందుకు గుళ్లు లేవు, పూజలు జరగవు? వీటన్నింటికి పురాణాల్లో చాలా కథనాలు వ్యాప్తిలో ఉన్నాయి. అష్టాదశ పురాణాలలో లింగోద్భవం ఎలా జరిగిందో వివరించే కథనాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త, బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు. ఆ కథ ఇక్కడ చదవండి..
బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు గొప్ప అనే వాదము బ్రహ్మ, విష్ణువులలో ఏర్పడింది. క్రమక్రమంగా ఆ వాదన తీవ్రతరం కావడం చూసి, దేవతలందరూ శివుడిని వద్దకు వెళ్లి ఈ వివాదం పరిష్కరించమని వేడుకుంటారు. అప్పుడు బ్రహ్మ, విష్ణువుల మధ్య మిరుమిట్లు గొలిపే తేజస్సుతో ఒక స్తంభంలా పెద్ద లింగం ఏర్పడింది. ఆ లింగంలోని శివుడు బయల్వెడలి ఈ లింగం ఆది, అంతాలను ఎవరైతే కనుగొంటారో, వారిని గొప్ప అని నిర్ణయిస్తాను అన్నాడు. దానికి సరేనంటూ బ్రహ్మ హంస వాహనారూఢుడై ఊర్ధ్వముఖంగా పైభాగం వైపు బయల్దేరుతాడు. విష్ణువు శ్వేత వరాహరూపంలో ఆ మహాలింగం మూలం తెలుసుకొనేందుకు అధోముఖంగా క్రింది వైపునకు బయల్దేరతాడు. వారిద్దరూ ఎంత ప్రయాణించినా ఆ లింగం ఆది, అంతాలను తెలుసుకోలేక పోయారు. ఆ సమయంలో బ్రహ్మ శివలింగపు పైభాగం నుండి రాలుతున్న కేతకీ (మొగలి) పుష్పాన్ని చూశాడు. అప్పుడు బ్రహ్మ కేతకీ పుష్పముతో 'నువ్వు పైనుండే వస్తున్నావు కదా! నాకొక సాయం చేయాలి. నేను శివలింగం చివరి భాగాన్ని చూశానని సాక్ష్యం చెప్పాలి' అన్నాడు. దానికి కేతకీ పుష్పం సరే అన్నది. ఇద్దరూ కలసి క్రిందికి వస్తుండగా మార్గమధ్యంలో ఒక గోవు బ్రహ్మకు దర్శనమిస్తుంది. 'నేను శివలింగపు చివర కనుక్కోగలిగానని సాక్ష్యం చెప్పాలి' అని బ్రహ్మ గోవును అడుగుతాడు. ఆయన మాట తీసివేయలేక గోమాత సరేనంటుంది.
లింగం అంతం ఎక్కడ ఉందో నువ్వు కనుక్కున్నావా అని బ్రహ్మను శివుడు అడగగా 'నేను ఆ లింగం అంతం ఎక్కడ ఉందో కనుగొన్నాను. దానికి ఈ కేతకీ పుష్పము, గోమాతలే సాక్ష్యం' అంటాడు. శివుడు కేతకీ పుష్పాన్ని ప్రశ్నిస్తే అవును బ్రహ్మ చూశాడని చెబుతుంది. అదే విషయం గోమాతను అడుగగా అవునని అబద్దం చెబుతూ తల ఊపుతుంది, లేదని చెబుతూ తోకను అడ్డగా ఊపుతుంది. దాంతో శివుడు ఆగ్రహించి బ్రహ్మకు భూలోకంలో ఎక్కడా గుడి కానీ, పూజలు కానీ ఉండవని శపిస్తాడు. అబద్ధం చెప్పినందుకు కేతకీ పుష్పానికి పూజార్హత ఉండదని శపిస్తాడు. గోమాత తలతో అబద్ధం చెప్పినందున ఎవరైనా తెల్లవారగానే గోవు ముఖాన్ని చూస్తే పాపం తగులుతుందని, పృష్ట భాగాన్ని చూస్తే పాపపరిహారం జరుగుతుందని శపిస్తాడు.
తిరిగి వచ్చిన విష్ణువు, తాను లింగం ఆదిని చూడలేకపోయానని నిజం చెబుతాడు. విష్ణువు నిజాయితీకి మెచ్చిన శివుడు విశ్వ సర్వ వ్యాపకత్వమును విష్ణువుకి అనుగ్రహిస్తాడు. అంతేకాక బ్రహ్మ ద్వారా సృష్టించబడిన ప్రాణికోటిని రక్షించే భారము, భోగ, మోక్షములనిచ్చు అధికారాన్ని వరంగా ఇస్తాడు.
అనంతరం బ్రహ్మ కూడా శివుడిని సహ్యాద్రి పర్వతాలలో లింగ రూపంలోనే ఉంటావని శపిస్తాడు. ఆ సహ్యాద్రి పర్వతములలోని శివ లింగమే త్రయంబకేశ్వరుడు. ఇదీ లింగోద్భవ కథనం. అష్టాదశ పురాణాలలోని కూర్మ, వాయు, శివ పురాణాలలో ఈ కథ చెప్పడమైనది.
* వాస్తవికతలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరికందరూ ఒకే రూపము అయినప్పటికీ, శివ రూపమే సనాతనము. ఇదియే సకల రూపములకు మూలము. శ్రీహరి మహాదేవుని వామ భాగము నుండి, బ్రహ్మ, దక్షిణ భాగము నుండి ప్రకటితమయ్యెను. సాక్షాత్తు శివుడు గుణములలో భిన్నుడు, ప్రకృతి పురుషులకు అతీతుడు, నిత్యుడు, అద్వితీయుడు, అనంతుడు, పూర్ణుడు, నిరంజనుడు, పరబ్రహ్మ పరమాత్మ శివుడే. 'శివ' అంటే శుభం, ఆనందం, మంగళం, కైవల్యం, శ్రేయం అని అర్థాలు. 'శ' అంటే శివుడని, 'వ' అంటే శక్తి అని 'శివపదమణిమాల' చెబుతోంది.
- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,
మొబైల్: 9494981000.