Maha Kumbh Mela: 2025 లో మహా కుంభ మేళా ఎప్పుడు ప్రారంభం అవుతుంది? స్నాన తేదీల గురించి తెలుసుకోండి
05 November 2024, 15:15 IST
- Maha Kumbh Mela: మహా కుంభమేళా 2025లో నిర్వహించబడుతుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం మహాకుంభం ఎక్కడ జరుగుతుంది? ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే విషయాలు మీ కోసం.
మహా కుంభమేళా 2025
హిందూ మతంలో కుంభ మేళాకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కుంభ మేళా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా ప్రతి 6 సంవత్సరాలకు నిర్వహించబడుతుంది.
లేటెస్ట్ ఫోటోలు
ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా నిర్వహిస్తారు. 2025లో ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళా నిర్వహించనున్నారు. ఇది కాకుండా హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలో కుంభమేళా నిర్వహిస్తారు.
2025లో జరిగే మహాకుంభ మేళా జనవరి 13 నుండి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ సంవత్సరం మహాకుంభం మొదటి రోజున సిద్ధి యోగం ఏర్పడటం చాలా యాదృశ్చికంగా జరుగుతోంది. మహాకుంభ మేళా హిందూ మతంలో వచ్చే అతిపెద్ద పండుగ, జాతర. ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ఇందులో పాల్గొంటారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా నిర్వహించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు.
మహాకుంభ 2025 స్నానం తేదీలు
13 జనవరి 2025- పుష్య పూర్ణిమ
14 జనవరి 2025- మకర సంక్రాంతి
29 జనవరి 2025 - మౌని అమావాస్య
3 ఫిబ్రవరి 2025- వసంత పంచమి
4 ఫిబ్రవరి 2025- అచల నవమి
12 ఫిబ్రవరి 2025- మాఘ పూర్ణిమ
26 ఫిబ్రవరి 2025- మహా శివరాత్రి
మహా కుంభమేళా మూలానికి సంబంధించిన కథ
మహా కుంభమేళాకు సంబంధించి పురాణాల ప్రకారం ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. కథ దేవతలు, రాక్షసుల మధ్య సాగర మథనానికి సంబంధించినది. పురాణాల ప్రకారం సముద్ర మథనం సమయంలో అమృతం కుండ కోసం దేవతలు, రాక్షసుల మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది.
అమృతాన్ని పొందాలనే పోరాటంలో భూమిపై నాలుగు ప్రదేశాలలో - ప్రయాగరాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్ వద్ద కొన్ని అమృతపు బిందువులు పడ్డాయి. అందువల్ల ఈ ప్రదేశాలను పవిత్రంగా పరిగణిస్తారు. అందుకే ఈ ప్రదేశాలలో మాత్రమే కుంభమేళా నిర్వహిస్తారు.
దేవగురువు బృహస్పతి సంచారం
గ్రహాల కదలిక కూడా కుంభ మేళా నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దేవ గురువు బృహస్పతి వృషభ రాశిలో, గ్రహాల రాజు సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది. గురు, సూర్యుడు సింహ రాశిలో ఉన్నప్పుడు నాసిక్‌లో కుంభమేళా నిర్వహిస్తారు.
బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళా నిర్వహిస్తారు. సూర్యుడు మేష రాశిలో, బృహస్పతి కుంభ రాశిలో ఉన్నప్పుడు హరిద్వార్‌లో కుంభమేళా నిర్వహిస్తారు. బృహస్పతి, సూర్యుడు, చంద్రుడి స్థానాల ఆధారంగా కుంభ మేళా తేదీలు నిర్ణయించడం జరుగుతుంది. కుంభ మేళా సందర్భంగా వేలాది మంది భక్తులు పుణ్య స్నానం ఆచరించేందుకు వస్తారు.
ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.