Lord shiva: శివుడిని పూజించడానికి ఉత్తమమైన సమయం ఏది? శివారాధన ఎలా చేయాలి?
07 June 2024, 18:48 IST
- Lord shiva: శివుడిని పూజించడానికి ఉత్తమమైన సమయం ఏది? కార్తీక మాసం, శ్రావణ మాసం, ఆరుద్ర నక్షత్ర యుక్త మార్గశిరం, మహా శివరాత్రిలో ఏది ఉత్తమం? అనే వివరాల గురించి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
శివారాధన ఎప్పుడు చేయాలి?
Lord shiva: భారతీయ సనాతన ధర్మంలో వేదాలు సనాతన ధర్మానికి మూలాలు. వేద మంత్రాలన్నీ కూడ శివారాధన సూచిస్తున్నాయి. శివారాధన చేయడానికి ఈ సమయం అనేటువంటి నియమం లేదు. శివారాధన భక్తిశ్రద్ధలతో ఉదయం మధ్యాహ్నం, సాయంత్రం, అర్థరాత్రి ఎలాంటి సమయంలోనైనా ప్రతి నిత్యం ఆచరించుకోవడం మంచిదని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
యధార్థమునకు ప్రతి రోజు శివారాధన చేయడం ఉత్తమం. అందులోనూ ప్రదోష కాలం అనగా సాయంత్ర సమయం, అలాగే ఉదయం శివారాధన చేయడం చాలా విశేషం. ఇలా కుదరదని వారికి ప్రతి వారంలో కనీసం సోమవారం శివారాధన చేయడం ఉత్తమమని చిలకమర్తి తెలిపారు. అది కూడా కుదరని పక్షంలో ప్రతి మాసంలో కృష్ణ పక్ష చతుర్దశి రోజు, మాస శివరాత్రి రోజున శివారాధన చేయడం ఉత్తమం. ఇది కూడా కుదరని వారికి సంవత్సరంలో వచ్చేటువంటి శ్రావణ మాసం, కార్తీక మాసాలలో శివారాధన చేయడం అత్యంత శుభఫలం.
ఇది కూడా కుదరని వారికి సంవత్సరంలో వచ్చేటువంటి మాఘ మాస కృష్ణ పక్ష చతుర్ధశి రోజున, మహా శివరాత్రి రోజున శివారాధన చేయడం ఉత్తమం. ఏ కారణం చేతైన మహా శివరాత్రి రోజు శివారాధన చేయలేనటువంటి వారికి మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రంలో శివుడిని ఆరాధించడం అత్యంత ఉత్తమమని చిలకమర్తి తెలిపారు.
నిత్యం శివారాధన చేసుకోలేకపోతున్నామని బాధపడే వారికి మహా శివరాత్రి రోజు కానీ మార్గశిర ఆరుద్ర నక్షత్రంలో చేసే శివపూజకు గాని ప్రత్యేకమైన పుణ్యఫలం ఉంటుందని చిలకమర్తి వెల్లడించారు. ఈ ప్రత్యేక దినాలలో శివుడిని అభిషేకించడం, దర్శించడం, పూజించడం వల్ల సంవత్సరం మొత్తం శివారాధన చేసిన ఫలితం లభిస్తుందని చిలకమర్తి తెలిపారు.
శివుడికి ఇష్టమైన నక్షత్రం ఆరుద్ర. మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రంలో చేసే శివారాధన అత్యంత పవిత్రమైనదని, విశేషమైనదని చిలకమర్తి తెలిపారు. శివారాధన చేసేటప్పుడు భక్తిశ్రద్ధలతో అభిషేకాలు చేసుకోవడం ఉత్తమం. శివాభిషేకాన్ని లేదా రుద్రాభిషేకాన్ని శివాలయాలలో, పుణ్యక్షేత్రాలలో, గోశాలలో లేదా స్వగృహమునందు ఆచరించడం ఉత్తమం.
పరమేశ్వరుడిని పంచామృతాలలో రుద్రనమక చమకాలతో, బిల్వ పత్రాలతో ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.