తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ratha Saptami 2024: రథసప్తమి విశిష్టత ఏమిటి? ఆ రోజు ఆచరించాల్సిన నియమాలు ఏంటి?

Ratha saptami 2024: రథసప్తమి విశిష్టత ఏమిటి? ఆ రోజు ఆచరించాల్సిన నియమాలు ఏంటి?

HT Telugu Desk HT Telugu

11 February 2024, 12:00 IST

google News
    • Ratha sapthami 2024: రథసప్తమి రోజు సూర్యుని ఆరాధించడం వల్ల ఏడేడు జన్మల పాపాలు తొలగిపోతాయని అంటారు. రథసప్తమి రోజు ఎటువంటి పనులు చేయాలో పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. 
రథసప్తమి విశిష్టత
రథసప్తమి విశిష్టత

రథసప్తమి విశిష్టత

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం మాఘ మాస శుక్ల పక్ష సప్తమి అనగా 16 ఫిబ్రవరి 2024 శుక్రవారం రథసప్తమి రోజుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

హిందువులు మాఘ శుద్ధ సప్తమి రోజు రథసప్తమి పండుగ జరుపుకుంటారు. సూర్యభగవానుడు వేరు సూర్యగ్రహము వేరు. సూర్యభగవానుడు కశ్యప మహాముని కుమారుడు. తేజోవంతుడు, దేవతామూర్తి. లోకసాక్షి అయిన ఆ సూర్య భగవానుని అర్చించి ఆయన కరుణా కటాక్షాలను పొందే సుదినమే మాఘ శుద్ధ సప్తమి. అదే ఆయన జన్మతిథి... రథసప్తమి.

రథసప్తమి విశిష్టత

రథసప్తమినాడు సూర్యోదయానికి పూర్వమే స్నానాదికాలు చేసి, సూర్యోదయానంతరము దానాలు చేయాలి. ఈ రోజు సూర్యభగవానుని ఎదుట ముగ్గువేసి, ఆవు పిడకలపై ఆవుపాలతో పొంగలి చేసి చిక్కుడు ఆకులపై ఆ పొంగలిని ఉంచి ఆయనకు నివేదన ఇవ్వాలి. ఇతర మాసములలోని సప్తమి తిథుల కన్నా మాఘమాసమందలి సప్తమి తిథి బాగా విశిష్టమైనది. సూర్యుని గమనం ఏడు గుర్రములు పూన్చిన బంగారు రథము మీద సాగుతుందని వేదము 'హిరణ్యయేన సవితా రథేన” అని తెలుపుతుంది.

సూర్య గమనం ప్రకారము ఉత్తరాయన(ణ)ము, దక్షిణాయనము అని రెండు విధములు. అషాఢ మాసము నుంచి పుష్యమాసము వరకు దక్షిణాయనము, సూర్యరథము దక్షిణాయనములో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకర రాశి ప్రవేశముతో ఉత్తరాయన ప్రారంభమవుతుంది. అందుకే ఆరోజు పవిత్ర దినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. 'భా” అంటే సూర్యకాంతి. “కతి" అంటే సూర్యుడు. కావున సూర్యుని ఆరాధించువారందరూ భారతీయులు. 'భారతీ” అంటే వేదమాత. వేదమాతను ఆరాధించువారు భారతీయులే అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

రథసప్తమి రోజు ఇలా చేయండి

మాఘ శుద్ధ సప్తమి సూర్యగ్రహణంతో సమానము. ఆ రోజు అరుణోదయవేళ స్నాన, జప, అర్ఘ్య ప్రదాన, తర్పణ, దానాదులు చేస్తే అనేక కోట్ల రెట్ల పుణ్యఫలములను, ఆయురారోగ్య సంపదలను ఇస్తాయి. సప్తమినాడు షష్టి తిథి కూడా ఉంటే షష్టీ సప్తమి తిథుల యోగమునకు ‘పద్మము’ అని పేరు. ఈ యోగము సూర్యునికి అత్యంత ప్రీతికరము. ఆ సమయాన ఏడు జిల్లేడు అకులను ధరించి నదీస్నానము చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము అని చిలకమర్తి తెలియచేసారు.

జిల్లేడు ఆకుకు '“అర్మపత్రము' అని పేరు. సూర్యునికి 'అర్మః అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగులు ప్రీతి. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే కాక ఏడు జన్మములలో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ జన్మలోను, జన్మాంతరంలోను (రెండు), మానసిక, వాచిక, శారీరక (మూడు), తెలిసి చేసేవి, తెలియక చేసేవి (రెండు) కలిపి మొత్తం ఏడు పాపములు నేడు రోగాలకు కారణములు.

రథసప్తమినాడు బంగారముతోగాని, వెండితోగాని, రాగితో గాని రథమును చేయించి, కుంకుమాదులు, దీపముతో అలంకరించి అందులో ఎర్రని రంగు గల సూర్యుని ప్రతిమను ఉంచి పూజించి గురువునకు ఆ రథాన్ని దానం ఇవ్వాలి. ఆరోజు ఉపవాసము ఉండి సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమములను చూచుచు కాలక్షేపం చేయాలని, ఇలా రథసప్తమీ వ్రతం చేస్తే సూర్యభగవానుని అనుగ్రహము వలన ఆయురారోగ్యాది సకల సంపదలు చేకూరుతాయని పురాణ ప్రబోధము. రథసప్తమి వ్రతం మన సంప్రదాయమున నిలిచి ఉండు భారతీయతకు చిహ్నమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

సూర్యజయంతి రోజు ఆచరించాల్సిన నియమాలు

మాఘశుద్ధ సప్తమి సూర్య జయంతి నాడు ఆదిత్యార్చన అద్భుత శక్తి దాయిని. మాఘశుద్ధ సప్తమి రోజున ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో గల అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించి, సేవించడం ద్వారా రోగ, శోక, దారిద్రాలు పోతాయని భక్తుల విశ్వాసం. రథసప్తమి రోజున అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి నిజరూప దర్శనం చేసుకొని, మహాక్షీరాభిషేకం సేవలో పాల్గొని తరిస్తారు.

రథసప్తమి రోజు ఉదయం 8 గంటల లోపు వాకిట్లో పొయ్యిని పెట్టి కొత్తబెల్లం, కొత్త బియ్యం, చెరకు, అవుపాలతో పాయసం చేసి స్వామికి నివేదించి ఆ ప్రసాదాన్ని భక్తులు తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధి తగ్గుతుంది. రథసప్తమి రోజున నదులు, చెరువుల్లో తలపై దీపం పెట్టి వదలివేస్తే మరుజన్మ ఉండదని భక్తుల విశ్వాసం. జిల్లేడు ఆకులు శిరస్సున, రెండు భుజాలపైన రేగుపళ్ళు పెట్టుకొని స్నానం చేస్తే ఏడు జన్మాల రోగాలు పోయి మనస్సు, నవరంధ్రాలు, పంచేంద్రియాలు సుషుష్తావస్థ నుంచి జాగ్రదావస్థలోనికి వస్తాయని చెబుతారు.

రథసప్తమి రోజున అరసవల్లిలో స్వామి నిజరూప దర్శనం వల్ల అభిషేకం చేసిన అరుణశిల కిరణాల స్పర్శతో భక్తులకు రోగ నివారణ కలుగుతుందని నమ్ముతారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం