Vastu Tips for Bedroom: బెడ్ రూంలో ఈ ఏడు వస్తువులు ఉండకూడదని వాస్తు శాస్త్రం చెప్పడానికి కారణమేంటి?
22 November 2024, 9:18 IST
- Vastu Tips for Bedroom: బెడ్ రూంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొనడానికి, చక్కటి నిద్ర కలగడానికి పడకగదిలో ఉండే కొన్ని వస్తువులు ఆటంకం కలిగిస్తాయట. వాస్తు నియమాల ప్రకారం, శరీరానికి విశ్రాంతి కలగనీయని ఆ వస్తువులేంటో చూడండి.
బెడ్ రూం వాస్తు సలహాలు
వందల సంవత్సరాలుగా భారతీయ సంప్రదాయాలలో పేరెన్నిగన్నది వాస్తు శాస్త్రం. ఎంతో విలువైన, ప్రముఖమైన ఈ శాస్త్రాన్ని నిర్లక్ష్యపెట్టి నష్టపోయిన వారు నిత్య జీవితంలో చాలా సందర్భాల్లో తారసపడుతుంటారు. ఆ పొరబాటు మీరు కూడా చేస్తున్నారా.. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇంటి నిర్మాణ సమయంలోనే కాదు, ఇంట్లో నివాసం ఉండే ప్రతి రోజు వాస్తు వర్తిస్తుంది. ఇంటి మూలల్లో, గదుల నిర్మాణంలో, ప్రవేశ ద్వారాల్లోనే కాకుండా బెడ్ రూంలో కూడా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోకపోతే దారుణంగా నష్టపోతాం.
కడుపుకు తిండి, కంటికి నిద్ర ఈ రెంటి కోసమే కదా మన ప్రయాణం. అటువంటిది వాస్తు లోపంతో బెడ్ రూం ఉంచుకుని చక్కటి నిద్ర పోవాలని అనుకుంటే సరిపోతుందా..? వాటిని అధిగమిస్తేనే కదా! మంచిగా నిద్ర పట్టి మనసుకు ప్రశాంతత కలుగుతుంది. అదే మరుసటి రోజు కొత్త ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. ఆ వాస్తులోపాలను సరి చేసుకోవడానికి ముఖ్యంగా ఈ ఏడు వస్తువులు మీ బెడ్ రూంలో లేకుండా చూసుకోండి.
అద్దాలు
బెడ్ రూంలో నెగెటివ్ ఎనర్జీ లేకుండా ఉండాలంటే అద్దాలను తీసేయండి. బెడ్ రూంలో చాలా వరకూ అద్దం పెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. అటువంటి వారు రాత్రి సమయాల్లో అద్దాన్ని కప్పి ఉంచుకోవాలి. తద్వారా నెగెటివ్ ఎనర్జీ ఇంట్లోకి వ్యాపించదు. ఒకవేళ అలా జరిగితే మీరు పూర్తిగా నిద్రపోకుండా, స్పృహలోనే ఉన్నట్లుగా అనిపిస్తుంది. మరో ప్రత్యేక సందర్భంలో అద్దం బెడ్ రూంలో ఉంచుకోవచ్చు. అదెప్పుడంటే, నేచురల్ లైట్ పడి బెడ్ రూంను కాంతివంతంగా చేసే ప్రదేశంలో అద్దం ఉంటే అది మంచిది కూడా.
ఎలక్ట్రానిక్ పరికరాలు:
ప్రస్తుత జనరేషన్‌లో చాలా మందికి నిద్రపోయే సమయంలో ఫోన్ చూడటం అలవాటు. అలా చూస్తూనే పక్కలో పెట్టుకుని నిద్రపోయే వాళ్లు కూడా ఉన్నారు. ఈ విషయం పట్ల సైన్స్‌తో పాటు వాస్తు శాస్త్రం కూడా హెచ్చరిస్తుంది. ఇవే కాదు, మీ బెడ్ రూంలో టీవీలు, కంప్యూటర్లు, గేమింగ్ కోసం వినియోగించే ఎలక్ట్రానిక్ పరికరాలు ఉండకూడదని సూచిస్తుంది. ఇవన్నీ రేడియేషన్‌ను వ్యాపింపజేసి నిద్రను పాడు చేస్తాయట. వీటికి బదులుగా ప్రశాంతమైన నిద్రకు దోహదపడే మ్యూజిక్ ప్లేయర్ ఉంచుకోవడం ఉత్తమం. లేదా ఏదైనా మంచి పుస్తకాలు పెట్టుకోండి.
పదునైన వస్తువులు, ఆయుధాలు:
కొందరు తమ ఇళ్లలో చూపించుకునే దర్పం హాల్ వరకే పరిమితం కాదు. పూర్వీకులు ఇచ్చారనే సెంటిమెంట్‌తో బెడ్ రూంలోకి కూడా తెచ్చేసుకుంటుంటారు. కానీ, ఇవి మనిషిలో ఆవేశం, ఆందోళన వంటి భావాలను రేకెత్తిస్తాయి. ఇటువంటి దుష్ప్రభావాలకు లోనుకాకుండా ఉండేందుకు కత్తులు, కత్తెరలు, అగ్ని ప్రమాదం కలిగే వస్తువులు బెడ్ రూంలోకి రానివ్వద్దని వాస్తు శాస్త్రం చెబుతుంది.
అక్వేరియం:
మనిషిలోని ఆందోళన, మానసిక ప్రశాంతతను కలుగు జేసే అక్వేరియంను బెడ్ రూంలోకి మాత్రం తీసుకురాకూడదు. దీనిని తీసుకురావడం వల్ల గది మొత్తం తేమ, స్తబ్దతకు కారణం అవుతుంది. వాస్తు శాస్త్రం బెడ్ రూంలోకి అక్వేరియంలు, వాటర్ ఫౌంటైన్లు తీసుకురావడం నిషిద్ధమని చెబుతుంది. వాటికి బదులుగా ప్రశాంతమైన శబ్దం వినిపించే వస్తువులను ఏర్పాటు చేసుకోవాలి.
అనవసరమైన పుస్తకాలు:
నిద్రకు ఉపక్రమించే ముందు, నిద్ర లేచిన తర్వాత వృథాగా పడి ఉన్న పుస్తకాలు కంటికి కనిపించడం మంచిది కాదు. ఇది మానసిక అస్పష్టతకు, ఒత్తిడి కలిగేందుకు కారణమవుతుంది. అటువంటి వాటిని పక్కకు పారేసి గదిలో చక్కటి స్పేస్‌ను క్రియేట్ చేసుకోవడం బెటర్.
హింసాత్మకమైన ఫొటోలు
మనిషిలోని నెగెటివ్ ఫీలింగ్స్‌ను ప్రేరేపించే ఫొటోలను బెడ్ రూంలో ఉంచకూడదు. ఇవి చెడు భావోద్వేగాలను రేకెత్తించి ప్రశాంతతను దూరం చేస్తాయని వాస్తు నిపుణుల సలహా.
విరిగిన ఏదైనా లోపమున్న వస్తువులు
విరిగిపోయిన వస్తువులు మనలో ఉత్సాహాన్ని నాశనం చేస్తాయి. బెడ్ రూంలో నిద్రపోయే ముందు లేదా నిద్ర లేచిన వెంటనే మనలోని పాజిటివిటీని దూరం చేసే ఇటువంటి వస్తువులు కనిపించకుండా ఉండేందుకు వాటిని బయటపడేయండి.