vastu Tips: వీధి పోటు కూడా కలిసొస్తుందా? ఈ రకమైన వాస్తు ఉంటే ఆ ఇంట్లో ఆడవాళ్ల కోరికలన్నీ తీరతాయి!!
ఏదైనా స్థలం లేదా ఇల్లు కొనుగోలు చేసే ముందు కచ్చితంగా చూసుకునేది వాస్తు. స్థలం ఏ షేప్‌లో ఉందో చూసుకోవడానికంటే అసలు దానికి వీధిపోటు/ వీధి శూల లాంటివి కచ్చితంగా పాటించాలి.
Vastu Tips: వాస్తు శాస్త్రంలోనూ, పెద్దలు చెప్పినట్లుగానూ వీధి శూల/వీధి పోటు అనేది కచ్చితంగా గమనించాల్సిన విషయం. స్థలం లేదా ఇల్లు కొనుగోలు చేసిన సమయంలో వేరే ఏ విధమైన దోషమున్నా నివారణ మార్గాలుంటాయి. కానీ, దీనికి మాత్రం అంత సులువైన పరిష్కారం లేదు. పైగా ఒక్కోసారి ఇంటి యజమాని లేదా ఇంటి సభ్యులకు ఎవరికైనా ప్రాణహాని జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వీధి శూల లేదా గర్భ శూల అనేవి పూర్తిగా ప్రమాదకరమైనవి కాదు కొన్ని సందర్భాల్లో ఇవి కూడా లెక్క పెట్టలేనంత ధనాన్ని అమితమైన సంతోషాన్ని తెచ్చిపెడతాయి. అదెలాగో తెలుసుకుందామా..
వీధి శూల: ఒక స్థలానికి లేదా ఇంటికి ఎదురుగా ఒక రోడ్ లేదా వీధి ఉన్నట్లయితే దానిని వీధిపోటు/వీధి శూల అని పిలుస్తుంటారు. అదేవిధంగా ఇంటికి కింది భాగంలోకి ఎదురుగా వీధి ఉన్నట్లయితే దానిని గర్భశూల అంటుంటారు. ఈ వీధిశూల విషయంలో కొన్ని సార్లు కలిసొచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశల మూలల మీదుగా వచ్చే వీధి లేదా రోడ్‌ను బట్టి ఈ ఫలితాలనేవి కనిపిస్తాయి.
తూర్పు - ఈశాన్య భాగం: గృహము లేదా స్థలముకు తూర్పు - ఈశాన్య భాగంలో వీధి శూల ఉంటే మంచిది. దానిని కొనుగోలు చేసిన ఇంటి యజమాని మంచి ఆత్మ విశ్వాసంతో పాటు ఏ రంగంలో కాలు పెట్టినా పైచేయి సాధిస్తారు. పైగా సర్వాధికారాలు లభిస్తాయి కూడా.
ఉత్తర - ఈశాన్య భాగం: గృహము లేదా స్థలముకు ఉత్తర - ఈశాన్య భాగంలో వీధి శూల ఉంటే మంచిది. ఆ ఇంటి స్త్రీలకు బాగా కలిసొస్తుంది. అన్ని విధాల మేలు కలుగుతుండటంతో సుఖ సంతోషాలతో వారి కోరికలు తీర్చుకుని ఆనందంగా ఉంటారు. ఇల్లాలు సంతోషంగా ఉంటే ఆ ఇంటి యజమానికి మానసిక ప్రశాంతతతో పాటు ధనాదాయం కూడా అధికముగా వచ్చి చేరుతుందని శాస్త్రం చెబుతుంది.
ఉత్తర - వాయువ్య భాగం: గృహము లేదా స్థలముకు ఉత్తర - ఈశాన్య భాగంలో వీధి శూల ఉంటే మంచి జరగదు. ఆ ఇంటి స్త్రీలకు చేటు వాటిల్లుతుంది. అంతేకాకుండా పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, ఒకవేళ కుదిరినా సంబంధాలు కూడా చివరలో తప్పిపోవడం వంటి సమస్యలు, చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది.
పశ్చిమ - వాయువ్య భాగం: గృహము లేదా స్థలముకు పశ్చిమ - వాయువ్య భాగంలో వీధి శూల ఉంటే చాలా ఉత్తమం. ఈ వీధిపోటు ఇంటి యజమానికి బాగా కలిసొస్తుంది. సమాజంలో గౌరవాన్ని, మర్యాదను అందుకుంటాడు. కొన్ని సందర్భాల్లో రాజకీయ నాయకులుగా కూడా ఎదిగే అవకాశం ఉంది. పుష్కలమైన ధనాదాయంతో విరాజిల్లుతాడు.
పశ్చిమ - నైరుతి భాగం: గృహము లేదా స్థలముకు పశ్చిమ - నైరుతి భాగంలో వీధి శూల ఉంటే చికాకులు తప్పవు. పైగా శ్రమ అంతా బూడిదలో పోసినట్లే అవుతుంది. శ్రమ అధికంగా ఉండి కష్టానికి తగ్గ ఫలితం అందదు. చేతి వరకూ వచ్చిన డబ్బు కూడా చేజారిపోయి ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది.
దక్షిణ - నైరుతి భాగం: గృహము లేదా స్థలముకు దక్షిణ - నైరుతి భాగంలో వీధి శూల ఉంటే ఒకట్రెండు కాదు అనేక సమస్యలు చుట్టుముడతాయి. భార్యభర్తల మధ్య గొడవలు,, స్త్రీలకు పదేపదే అనారోగ్యం వంటివి కలుగుతుంటాయి. ఏ పని మొదలుపెట్టినా ఆదిలోనే ఆటంకం కలుగుతుంది.
దక్షిణ - ఆగ్నేయ భాగం: గృహము లేదా స్థలముకు దక్షిణ - ఆగ్నేయ భాగంలో వీధి శూల ఉంటే శుభ ఫలితాలు అందుకుంటారు. కుటుంబమంతా మానసిక ప్రశాంతతో పాటు సుఖ సంతోషాలతో గడిపేస్తారు. దాంతోపాటుగా బంధువుల ఆదరణ, శుభ కార్య నిర్వహణ వంటివి ఫలిస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలుగుతుంది.
తూర్పు - ఆగ్నేయ భాగం: గృహము లేదా స్థలముకు తూర్పు - ఆగ్నేయ భాగంలో వీధి శూల ఉంటే అనేక కష్ట నష్టాలు నెత్తినేసుకున్నట్లే. ఎన్ని రకాలుగా కష్టపడి సంపాదించినా అంతకు మించిన ఖర్చు ఉంటుంది. శ్రమ పెరిగి మానసిక ఒత్తిడి పట్టి పీడిస్తుంది. కుటుంబ కలహాలు సైతం మనోవేదనకు గురి చేస్తుంటాయి.
ఈ మూలల ద్వారా వచ్చే వీధిపోటులు కాకుండా నేరుగా తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ దిశల మీదుగా వచ్చే వీధి పోటు ఫలితాలు ఇలా ఉన్నాయి. తూర్పు వీధిపోటు, ఉత్తర వీధిపోటుల కారణంగా మిశ్రమ ఫలితాలు అందుకోవచ్చు. వీధి శూల/ వీధి పోటు దోష నివారణ కోసం విఘ్నాలను తుడిచేసే గణపతి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు కొందరు. ఇటువంటి సందేహాలుంటే వాస్తుశాస్త్ర నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమము.
టాపిక్