Vastu Colors For Home | నూతన సంవత్సరంలో మీ ఇంటికి రంగులు వేయండి, మీ జీవితంలో రంగులు నింపండి!
22 December 2022, 21:51 IST
- Vastu Colors For Home: వాస్తుశాస్త్రంలో ఇంటికి వేసే రంగులకు కూడా ప్రాధాన్యత ఉంది. ఒక్కో రంగు ఒక్కో నిర్ధేషిత ఫలితాన్ని కలిగి ఉంటుంది. ఈ స్టోరీ చదవండి.
Vastu Colors For Home
ప్రపంచంలో కేవలం నలుపు, తెలుపు అని రెండు రంగులు మాత్రమే ఉంటే ఎలా ఉంటుంది? కచ్చితంగా జీవకళ లేనట్లుగా నిస్తేజంగా ఉంటుంది. జీవితం కూడా అంతే! బ్లాక్ అండ్ వైట్ జీవితం ఎలాంటి మార్పులు లేకుండా నిరుత్సాహపరిచే విధంగా ఉంటుంది. చాలా మందికి రంగులు మన మానసిక స్థితిని ఎలా ప్రభావితం చేస్తాయో తెలియదు. వ్యక్తులలో సానుకూల శక్తిని నింపేందుకు, వివిధ పరిస్థితులలో విజయం సాధించేందుకు కూడా రంగులు తోడ్పడతాయి. ప్రతి రంగు మన మానసిక స్థితి, ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. రంగులు కొన్ని రుగ్మతలను తొలగించగలవు, భావోద్వేగాలను నియంత్రించగలవు. అంతటి శక్తి ఈ రంగులకు ఉంటుంది.
రంగులు పురాతన కాలం నుంచే ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. వాస్తుశాస్త్రంలో కూడా ఈ రంగులకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఇంటి నిర్మాణం చేపట్టేటపుడు లివింగ్ రూమ్, వంటగది, పడక గదులకు సంబంధించి నిర్ధిష్ట రంగులు వేస్తే మంచిదని నిపుణులు సలహ ఇస్తారు.
Vastu Colors For Home- వాస్తు పరంగా ఇంటి రంగులు
మాస్టర్ బెడ్‌రూంకు నీలి రంగు, లివింగ్ రూంకు తెలుపు రంగు, డైనింగ్ రూంకు ఆకుపచ్చ, నీలం లేదా పసుపు, సీలింగ్‌కు తెలుపు రంగు, వంటగదికి నారింజ లేదా ఎరుపు షేడ్స్, పూజ గదికి పసుపు రంగులను వాస్తు శాస్త్రం సిఫారసు చేస్తుంది.
మీ ఇంటి వాస్తును మెరుగుపరచాలంటే, మీ జీవితం రంగులమయం కావాలంటే ఇంటి లోపల కొన్ని రంగులను మార్పులు చేర్పులు చేయడం చాలా ముఖ్యం. ఏ రంగుకు ఎలాంటి ప్రాధాన్యత ఉంది, ఇంట్లో గదులకు ఎలాంటి రంగులు వేయాలో ఇప్పుడు తెలుసుకోండి.
ఎరుపు రంగు
రక్తం రంగు కూడా ఎరుపు రంగులో ఉంటుంది. ఎరుపు రంగు అభిరుచి, ఉత్సాహం, శక్తికి చిహ్నం. ఇది అగ్నికి సంబంధించినది కూడా. ఇది జీవితంలో ముందుకు సాగడానికి వేగాన్ని, శక్తిని అందిస్తుంది. లివింగ్ రూమ్ దక్షిణ గోడకు ఎరుపు రంగు షేడ్స్ వేయడం ద్వారా, గదిలో విభిన్నమైన సానుకూల శక్తి సృష్టించవచ్చు. లివింగ్ రూమ్ కాకుండా, బెడ్ రూమ్ గోడలపై ఎరుపు రంగు పింక్ షేడ్స్ ఉపయోగించవచ్చు. కొత్తగా పెళ్లయిన జంటలకు ఎరుపు, గులాబీ రంగులు అనువైనవి. ఇది వివాహిత జంటల మధ్య అనుబంధాన్ని పెంచుతుంది.
అయితే పొరపాటున కూడా బెడ్‌రూమ్‌లో ముదురు ఎరుపు రంగును ఉపయోగించవద్దు. ఈ రంగు కోపానికి చిహ్నం. ఇది సంబంధాలలో చేదును తెస్తుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో గర్భిణీ స్త్రీ ఉంటే, ఆమె గదిలో గోడలకు గులాబీ రంగు లేదా గులాబీ రంగు వస్తువులను ఉంచడం చాలా మంచిది.
ఆరెంజ్ కలర్
ఈ రంగు విజయ గర్వానికి ప్రతీక. గొప్ప ఆశయం, ప్రాతినిధ్యాన్ని సూచిస్తుంది. తమ లక్ష్యం కోసం కష్టపడే వ్యక్తులకు మంచి ఫలితాలు పొందాలంటే తమ పడకగదిలో దక్షిణ గోడపై నారింజ రంగు వేయాలి. వాస్తు ప్రకారం, ఇలా చేయడం ద్వారా, వారు చాలా త్వరగా విజయం సాధిస్తారు.
వాస్తు ప్రకారం, దక్షిణ, ఆగ్నేయ దిశలో ఉన్న వంటగదిలో నారింజ రంగును ఉపయోగించవచ్చు. ఇది కాకుండా, ఈ రంగును పూజ గదిలో కూడా ఉపయోగించవచ్చు.
పసుపు రంగు
ఈ రంగు మేధస్సు, ప్రకాశం, జ్ఞానానికి చిహ్నం. ఇంటి ముఖం ఉత్తరం వైపు ఉంటే, వాస్తు శాస్త్రం ప్రకారం, ఆ ఇంటి గోడలపై పసుపు రంగు చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాగే పసుపు రంగు స్టడీ రూమ్‌కి చాలా మంచిదని భావిస్తారు, పసుపు రంగుతో ఏకాగ్రత పెరుగుతుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
ఆకుపచ్చ రంగు
పాజిటివ్ ఎనర్జీ, శ్రేయస్సు పెంచడంలో ఈ రంగు చాలా సహాయపడుతుంది. ఇది వ్యక్తులను ప్రకృతితో సమకాలీకరించడానికి సహాయపడుతుంది. చికాకు, మొండి స్వభావం గల వ్యక్తులు వారి మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి వారి పడకగదిలో ఆకుపచ్చ రంగును ఉపయోగించవచ్చు.
వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే సౌత్-ఈస్ట్ బెడ్ రూమ్ గోడలపై పాస్టెల్ గ్రీన్ షేడ్స్ వేస్తే సానుకూలతను పెంచుతాయి.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం మీ మతవిశ్వాసాలు, నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులోని సమాచారం పూర్తిగా నిజం అని చెప్పలేం, అందుకు ఎలాంటి కచ్చితమైన ఆధారాలు కూడా లేవు.
టాపిక్