తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ugadi Rasi Phalalu 2024: సింహ రాశి క్రోధి నామ సంవత్సర ఉగాది రాశి ఫలాలు.. ఆదాయం 2, వ్యయం 14

Ugadi Rasi Phalalu 2024: సింహ రాశి క్రోధి నామ సంవత్సర ఉగాది రాశి ఫలాలు.. ఆదాయం 2, వ్యయం 14

HT Telugu Desk HT Telugu

28 March 2024, 10:32 IST

google News
    • Simha Rasi: సింహ రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది 2024-25 రాశి ఫలాలను పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. ఆరోగ్యం, కెరీర్, ఆర్థికం, ప్రేమ వంటి అంశాల్లో నూతన తెలుగు సంవత్సరం సింహ రాశి జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే నెలవారీ రాశి ఫలాలు ఇక్కడ చూడొచ్చు.
Simha Rasi: క్రోధి నామ సంవత్సర సింహరాశి ఉగాది రాశి ఫలాలు 2024-25
Simha Rasi: క్రోధి నామ సంవత్సర సింహరాశి ఉగాది రాశి ఫలాలు 2024-25 (Pixabay)

Simha Rasi: క్రోధి నామ సంవత్సర సింహరాశి ఉగాది రాశి ఫలాలు 2024-25

శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది రాశి ఫలాలు సింహరాశి వారికి చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా చూస్తే మధ్యస్థం నుంచి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నట్టు పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.

మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన జాతకులు సింహ రాశిలోకి వస్తారు.

శ్రో క్రోధి నామ సంవత్సరంలో సింహ రాశి వారికి ఆదాయం 2 పాళ్లు, వ్యయం14 పాళ్లు, రాజపూజ్యం 2 పాళ్లు, అవమానం 2 పాళ్లు ఉన్నవి.

నూతన తెలుగు సంవత్సరంలో బృహస్పతి దశమ స్థానమునందు సంచరించుట చేత, శని సప్తమ స్థానము నందు సంచరించుటచేత, రాహువు అష్టమస్థానము యందు సంచరించుట చేత మరియు కేతువు వాక్‌ స్థానమునందు సంచరించుటచేత సింహరాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు ఉన్నాయని తెలిపారు.

ఈరాశి వారు వాక్‌ స్థానములో కేతువు ప్రభావం చేత గొడవలకు, అవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. కళత్ర స్థానము నందు శని, అష్టమ స్థానము నందు రాహువు ప్రభావం చేత కుటుంబ విషయాలయందు, ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి.

ఉద్యోగస్తులకు దశమ స్థానములో గురుని ప్రభావం చేత వృత్తి ఉద్యోగాలలో అనుకూల ఫలితాలు ఉన్నప్పటికి శారీరక శ్రమ అధికమగును. ఉద్యోగస్తులు అవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచన.

వ్యాపారస్తులకు అనారోగ్యం, కుటుంబ సమస్యలు వేధించినప్పటికి వ్యాపారంలో మధ్యస్థ ఫలితాలు కలుగును. రైతాంగానికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు కనబడుతున్నాయి. పంట దిగుమతి విషయంలో నష్టములు కలుగు సూచన.

సినీ, మీడియా రంగాలవారికి మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. విద్యార్థులు ఈ సంవత్సరం కష్టపడాల్సిన సమయం. విదేశీ ప్రయత్నాలు అనుకూలించును.

సింహ రాశి జాతకులైన స్త్రీలు ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. కుటుంబములో సమస్యల వలన అనారోగ్యం కలుగు సూచన. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండుట మంచిది.

సింహ రాశి జాతకుల ప్రేమ జీవితం 2024-25

సింహరాశి వారికి ఈ సంవత్సరం ప్రేమపరమైనటువంటి విషయాలు అనుకూలించును. జీవిత భాగస్వామితో అనందముగా గడిపెదరు. కొన్ని విషయాల్లో భేదాభిప్రాయములు ఏర్పడినప్పటికీ మీరు ప్రయత్న బలంతో వాటిని అధిగమించెదరు.

సింహ రాశి జాతకుల ఆర్థిక విషయాలు 2024-25

సింహరాశి జాతకులకు ఈ సంవత్సరం ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. అప్పుల బాధలు మాత్రం ఉండవు. ధనపరమైనటువంటి విషయాల్లో ఆశించిన స్థాయి కాకపోయినా లాభములతో ధనమును సంపాదించెదరు.

సింహ రాశి జాతకుల కెరీర్ 2024-25

సింహరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది. దశమంలో గురుడు అనుకూలంగా ఉండటం చేత నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో లాభములు కలుగును. ప్రమోషన్లు వంటివి అనుకూలించును.

సింహరాశి ఆరోగ్యం 2024-25

సింహరాశివారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది. అనారోగ్య సమస్యల నుండి బయటపడెదరు. ఆరోగ్యంలో మార్పు కనిపించును. గత కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుండి విముక్తి పొందెదరు.

ధరించాల్సిన రత్నం: సింహరాశి వారు ధరించవలసిన నవరత్నం మాణిక్యం (౩ంపు).

ప్రార్థించాల్సిన దైవం: సింహరాశివారు ఆరాధించవలసిన దైవం సూర్యనారాయణుడు.

సింహరాశి పరిహారాలు

సింహరాశివారు 2024 సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలంటే దుర్గా దేవిని పూజించి, సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం మంచిది. ఆదివారం సూర్యాష్టకం పఠించండి. ఆదిత్య హృదయాన్ని పఠించడం, దేవి ఖడ్గమాల, దుర్గాష్టకం పఠించడం శుభ ఫలితాలను ఇస్తుంది. శనివారం రోజు రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించడం, ఆరాధించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

సింహ రాశి జాతకుల నెలవారీ రాశి ఫలాలు 2024-25

ఏప్రిల్‌: ఈమాసం మీకు చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. ధనపరంగా చిక్కులు. ఉద్యోగ విషయంలో సమస్యలు. వ్యాపారపరంగా చెడు సమయం. భార్యాభర్తల మధ్య అనుకూలత తగ్గుతుంది. మనస్పర్ధలు పెరుగుతాయి. గృహమునందు కలహములు.

మే: ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ఆదాయం ఉన్నప్పటికి ఖర్చులు అధికమగును. పనులు ఆగిపోవును. ఆరోగ్యం సమస్యలు. ప్రయాణముల యందు జాగ్రత్త. వివాహ శుభకార్య సంబంధిత పనులు అతికష్టం మీద సాగుతాయి.

జూన్‌: ఈ మాసం సింహ రాశి జాతకులకు అనుకూలంగా లేదు. ఉద్యోగ, వ్యాపారపరంగా చిక్కులు. ఆర్థిక ఇబ్బందులు. అధిక వ్యయం. శుభకార్యములు వాయిదాపడుట జరుగుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకొనుట మంచిది.

జూలై: ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. బాకీలు వసూలు కాక ధనపర ఇబ్బందులు కలుగును. ఉద్యోగస్తులు పైఅధికారులచే మాటపడాల్సి వస్తుంది. శుభకార్యక్రమాలు వాయిదా పడుతాయి. ఒత్తిడి అధికముగా ఉండును. ఇంటాబయట సమస్యలు ఉండును.

ఆగస్టు: ఈ మాసంలో మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఆస్తిపర విభేదాలు సద్దుకుంటాయి. బంధువుల శుభకార్యానికి హాజరవుతారు. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని సమస్యలను చక్కబెడతారు. ఖర్చులు అధికమగు సూచన.

సెప్టెంబర్‌: ఈ మాసం మీకు మధ్యస్థముగా ఉన్నది. భూ, గృహ, వాహన విషయములు ముందుకు సాగుతాయి. మిత్రుల కలయిక కొంత ఆనందాన్ని ఇస్తుంది. రాజకీయపరంగా అభివృద్ధి. దూరప్రయాణములు వాయిదా వేసుకోవడం మంచిది. ఒత్తిళ్ళు తగ్గుతాయి.

అక్టోబర్‌: ఈ మాసం సింహరాశి వారికి మధ్యస్థం నుండి అనుకూలం. ధనపరమైన చిక్కులు తొలగుతాయి. నూతన వ్యాపార పెట్టుబడులు. శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ప్రయాణములో తగు జాగ్రత్తలు అవసరం.

నవంబర్‌: ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థులు కష్టపడాల్సిన సమయం. మిత్రులతో సాన్నిహిత్యం. దైవపర పూజలు, పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటారు.

డిసెంబర్‌: ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులు విద్యపై శ్రద్ధ వహించాలి. వ్యాపారస్తులకు సామాన్య లాభములు. సమయానికి ధనం అందుతుంది. సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి.

జనవరి: ఈ మాసం సింహరాశి జాతకులకు మధ్యస్థంగా ఉన్నది. నూతన వస్తువులను కొంటారు. పెద్దలచే మాటడాల్సి వస్తుంది. ఇంట శుభకార్య సిద్ధి. రాజకీయపరంగా ఇబ్బందులు. మిత్ర విభేదములు.

ఫిబ్రవరి: ఈ మాసం మీకు మధ్యస్థం. అత్యవసర ఖర్చులు అధికమగును. ధనలాభం. బంధువుల రాక. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకోని వ్యక్తులచే మాటపడాల్సి వస్తుంది.

మార్చి: ఈ మాసం సింహరాశి వారికి అనుకూలంగా లేదు. భార్య ఆరోగ్యము మందగించుట. స్రీ మూలక చిక్కులు. నూతన వ్యక్తుల వలన చికాకులు. మధ్యవర్తిత్వం మంచిది కాదు. పిల్లలు మాట వినకపోవడం. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

- పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం