TS to TG Registrations: తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్లు మార్పు.. ఇకపై TG పేరిట వాహనాల రిజిస్ట్రేషన్-change in vehicle registrations in telangana registration of vehicles in the name of tg ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts To Tg Registrations: తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్లు మార్పు.. ఇకపై Tg పేరిట వాహనాల రిజిస్ట్రేషన్

TS to TG Registrations: తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్లు మార్పు.. ఇకపై TG పేరిట వాహనాల రిజిస్ట్రేషన్

Sarath chandra.B HT Telugu
Mar 13, 2024 08:04 AM IST

TS to TG Registrations: తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్‌‌లో రాష్ట్ర గుర్తింపును టీఎస్‌ నుంచి టీజీకి మారుస్తూ కేంద్ర రహదారి రవాణాశాఖ మంగళవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

తెలంగాణలో ఇకపై TG పేరిట వాహనాల రిజిస్ట్రేషన్
తెలంగాణలో ఇకపై TG పేరిట వాహనాల రిజిస్ట్రేషన్

TS to TG Registrations: తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్లలో రాష్ట్రం కోడ్ మారింది. దాదాపు తొమ్మిదేళ్లుగా అమలవుతున్న టిఎస్‌ TS స్థానంలో టీజీ TG అక్షరాలు Number platesపై రానున్నాయి. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్‌ 41(6) కింద ఉన్న అధికారాలతో గెజిట్‌ నోటిఫికేషన్‌లో మార్పు చేసినట్లు కేంద్ర రవాణా శాఖ తెలిపింది. ఆ నోటిఫికేషన్‌లోని టేబుల్‌లో సీరియల్‌ నంబర్‌ 29ఏ కింద.. తెలంగాణ రాష్ట్రానికి ఇదివరకు ఉన్న టీఎస్‌ స్థానంలో ఇప్పుడు టీజీ మార్క్‌ కేటాయించినట్లు వెల్లడించింది.

2014 జూన్‌ 2 నుంచి తెలంగాణ రాష్ట్రం మనుగడులోకి వచ్చింది. ఏపీ పునర్విభజన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత మొదట తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ టీజీగానే ఉంటుందని ప్రచారం జరిగింది. మొదట్లో ఇందుకు అనుగుణంగా వాహనాల రిజిస్ట్రేషన్‌ వ్యవస్థలో మార్పులు కూడా చేశారు. అయితే అనూహ్యంగా టీజీ బదులుగా టిఎస్‌‌గా మార్పు చేశారు.

తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ TRSపార్టీ పేరుకు దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతోనే టిఎస్‌గా ఎంపిక చేశారనే ప్రచారం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌KCR ఆదేశాలతో వాహనాల రిజిస్ట్రేషన్ పేరును టిఎస్‌గా ఖరారు చేస్తూ కేంద్రానికి ప్రతిపాదించారు. ఆ వెంటనే దానిని కేంద్రం నోటిఫై చేసింది.

గత ఏడాది తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత వాహన రిజిస్ట్రేషన్‌ మార్క్‌లో మార్పు చేయాలని నిర్ణయించారు.దానికి అనుగుణంగా రాష్ట్ర మంత్రివర్గంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు.క్యాబినెట్‌ ప్రతిపాదన ఆదారంగా కేంద్ర ప్రభుత్వం మార్పు చేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. తెలంగాణలో ఇకపై రిజిస్టర్‌ అయ్యే వాహనాల మార్క్‌ టీజీగా మారనుంది.

కొత్తవాటికే మార్పు...

రాష్ట్ర పునర్విభజన తర్వాత ఏపీ రిజిస్ట్రేషన్‌‌తో ఉన్న వాహనాలను తెలంగాణకు మార్చుకునేందుకు అప్పటి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పాత నంబర్‌ ప్లేట్లతో ఉన్న వాహనాల విషయంలో పెద్దగా ఆంక్షలు విధించలేదు. నంబర్ ప్లేట్లపై రాష్ట్ర కోడ్ మార్పు విషయంలో కొత్త వాహనాలకు మాత్రమే పరిమితం చేశారు. దీంతో 2014 నుంచి 24 మార్చి మధ్య కాలంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలకు మాత్రమే టిఎస్‌ కోడ్‌ పరిమితం అయ్యింది.

తాజాగా పేరు మార్పు నిర్ణయాన్ని కూడా కొత్త వాహనాలకు మాత్రమే పరిమితం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న టీఎస్ నెంబర్ ప్లేట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదని కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకే నెంబర్ ప్లేట్లలో టీజీగా నమోదు చేయనున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ నెంబర్ ప్లేట్స్ తోనే 30 లక్షల వాహనాలు ఉన్నాయి.

రోజుకు 10 వేల కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్స్

తెలంగాణలో ప్రస్తుతం 1.50 కోట్లకు పైగా వాహనాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సగటున 10 వేల కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. ఇకపై కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాల నెంబర్ ప్లేట్లపై 'TG'గా మార్చనున్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అకాంక్షలకు అనుగుణంగానే వాహనాల రిజిస్ట్రేషన్లలో రాష్ట్రం పేరును మారుస్తున్నట్టు సిఎం రేవంత్ రెడ్డి Revanthreddy గతంలోనే స్పష్టత ఇచ్చారు.

Whats_app_banner

సంబంధిత కథనం