Ratha Saptami 2023 : రథసప్తమి రోజు సూర్యుడిని ఇలా పూజిస్తే.. ఆ ఫలితాలు పొందవచ్చట
25 January 2023, 9:00 IST
- Ratha Saptami Rituals : మాఘమాసంలో రథసప్తమికి చాలా ప్రత్యేకత ఉంది. దీనినే సూర్య జయంతిగా కూడా చెప్తారు. ఆరోజు సూర్యభగవానుడు తన గతిని ఉత్తర దిశగా మార్చుకుంటాడు. అందుకే ఆరోజు సూర్యారాధన చేస్తే నవ గ్రహ దోషములు తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని జ్యోతిష్యశాస్త్రం చెప్తోంది. ఆరోజు ఏమి చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
రథ సప్తమి 2022
Ratha Saptami 2023 : మాఘ మాసము చాలా విశేషమైనటువంటి మాసము. ఉత్తరాయణంలో మాఘమాసం దక్షిణాయానంలో కార్తీక మాసం రెండు చాలా ప్రత్యేకమైనవి. మాఘమాసం సూర్యారాధనకు, విష్ణుమూర్తి ఆరాధనలకు ప్రత్యేకం. అలాంటి మాఘమాసంలో రథసస్తమి రావడమే ఈ మాసము ప్రాధాన్యతను తెలియజేస్తుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిలకమర్తి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మాఘమాసంలో ఆదివారాలు సూర్యారాధన చేయడం చాలా పుణ్యము. అవే సనాతన ధర్మంలో మనని భారతీయులుగా చెప్పినవి. భారతి అనే దానికి అర్థం రతి అనగా సూర్యుడు, భా కిరణములు. భారతి అంటే సూర్యకిరణములను ఆరాధించువారు అని అర్థము. నిత్యం సూర్యారాధన చేయడం భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి నిగూఢ రహస్యము అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం సప్తమి తిథి సూర్యభగవానుడికి చాలా ఇష్టమైన తిథి. మాఘమాస శుక్ల పక్ష సప్తమి రోజు సూర్య జయంతిగా మన పురాణాలు తెలియచేసాయి.
జ్యోతిష్యశాస్త్ర ప్రకారం సూర్యభగవానుడు రథసప్తమిరోజు తన గతిని ఉత్తర దిశగా మార్చుకొనేటటువంటి రోజు. ఇలా సూర్యుని గతిలో మార్పులు రావడం వలన అనారోగ్య సమస్యలు తొలగి.. ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని చెప్తారు. రథసప్తమిరోజు ఏ వ్యక్తి అయినా సరే సూర్యారాధన చేస్తే.. వారికి ఉన్న నవ గ్రహ దోషములు తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని జ్యోతిష్యశాస్త్రం చెప్పింది.
రథసప్తమిరోజు ఏమేమి చేయాలంటే..
రథసప్తమిరోజు ఉదయాన్నే లేచి పుణ్యనదీ స్నానమాచరించి సూర్యభగవానుడికి తర్పణాలు వదలాలి. అలాగే రథసప్తమిరోజు స్నానమాచరించేటపుడు ఏడు అర్శ్య పత్రాలను (జిల్లేడు ఆకులు) తలమీద పెట్టుకొని స్నానమాచరించాలి. ఇలా స్నానమాచరించిన వారికి ఆరోగ్యప్రాప్తి కలుగుతుందని సనాతన ధర్మం చెపుతుంది. రథసప్తమిరోజు బెల్లముతో పరమాన్నమును చేసి దాన్ని జిల్లేడు ఆకులో పెట్టి ఆ పరమాన్నాన్ని సూర్యునికి నైవేద్యంగా పెట్టి సూర్యభగవానుని అష్టోత్తర శతనామావళితో సూర్యారాధన చేయాలి. ఇలా సూర్యారాధన చేసి సూర్యునికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని స్వీకించిన వారికి అనారోగ్యములు తొలగి సూర్యభగవానుని అనుగ్రహంచేత విజయములు కలుగుతాయి. రథసప్తమిరోజు సూర్యాష్టకం, ఆదిత్యహృదయం వంటివి పారాయణ చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిలకమర్తి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.