Importance of Magha Snanam : మాఘమాస స్నానముతో.. శాశ్వత పుణ్యలోక ప్రాప్తి
21 January 2023, 8:00 IST
- Importance of Magha Snanam : మాఘస్నానంలో దివ్యతీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం. అయితే మాఘమాస స్నానంతో తాత్కలికంగా కాదు.. శాశ్వత పుణ్యలోక ప్రాప్తి లభిస్తుంది అంటున్నారు. దీని ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మాఘ స్నాన మహిమ
Importance of Magha Snanam : మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతోనైనా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందంటారు. బావినీటి స్నానం పన్నెండేళ్ళ పుణ్య ఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీ స్నానం చాతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగా స్నానం సహస్రగుణం, త్రివేణీ సంగమ స్నానం నదీ శతగుణ ఫలాన్ని ఇస్తాయని పురాణ వచనం. మాఘ పూర్ణిమను 'మహామాఘం' అంటారు. ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ. స్నానదాన జపాలకు అనుకూలమైనది. ఈ రోజున సముద్రస్నానం మహిమాన్విత ఫలదాయకమంటారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మాఘస్నాన ఫలం
మాఘమాసంలో ప్రతిరోజూ అంటే ముప్పై రోజులపాటు నియమనిష్టలతో స్నానాలు, వ్రతాలు చేయడం పలు ప్రాంతాల్లో ఆచారంగా ఉంది. ప్రతి రోజూ స్నానం, పూజ, మాఘపురాణ పఠనం కానీ, శ్రవణం కానీ చేస్తే పాపహరణం అని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈ వరుసలోని మాఘపురాణంలో తొలి అధ్యాయంలో స్నానమహిమకు సంబంధించిన కథ ఉంది. అదేమిటంటే..
మాఘమాసంలో స్నాన మహిమ కథ
రఘు వంశంలో సుప్రసిద్ధుడైన రాజు దిలీపుడు. ఆయన ఓ రోజు వేటకోసం హిమాలయ ప్రాంతాలలో ఒక సరస్సు సమీపానికి వెళ్తాడు. అక్కడ ఒక ముని ఎదురవుతాడు. ఆయన రాజుని చూసి ఈ రోజే మాఘమాసం ప్రారంభమైంది. నీవు మాఘస్నానం చేసినట్టుగా లేదు. త్వరగా చేయి అని చెప్తాడు. మాఘస్నానం ఫలితాన్ని గురించి రాజగురువు వశిష్టుడిని అడిగితే ఇంకా వివరంగా చెబుతాడని ఆ ముని చెప్పి తన దోవన తాను వెళ్లిపోతాడు. దిలీపుడు ముని చెప్పినట్టే స్నానం చేసి ఇంటికి వెళ్లి.. వశిష్ట మహర్షిని మాఘస్నానం ఫలితం వివరించమని వేడుకొన్నాడు.
అప్పుడు వశిష్టుడు మాఘస్నాన ఫలితానికి సంబంధించిన విషయాలన్నీ వివరించాడు. మాఘంలో ఒకసారి ఉషోదయ స్నానం చేస్తే ఎంతో పుణ్యఫలం. ఇక మాసం అంతా చేస్తే ప్రాప్తించే ఫలం అంతా ఇంతా కాదు. పూర్వం ఒక గంధర్వుడు ఒక్కసారి మాఘస్నానం చేస్తేనే ఆయన మనస్తాపం అంతా పోయింది. ఆ గంధర్వుడికి అన్నీ బాగానే ఉన్నా ముఖం మాత్రం పూర్వజన్మకర్మ వల్ల వికారంగా ఉండేది. ఆ గంధర్వుడు భృగుమహర్షి దగ్గరకు వచ్చి తన బాధనంతా చెప్పుకున్నాడు. తనకు అన్ని సంపదలు, అన్ని శక్తులూ ఉన్నా ముఖం మాత్రం పులి ముఖాన్ని తలపించేలా వికారంగా ఉందని.. ఏం చేసినా అది పోవటం లేదని అన్నాడు. గంధర్వుడి వ్యథను గమనించిన ఆ మహర్షి అది మాఘ మాసం అయినందువల్ల వెంటనే వెళ్లి.. గంగానదిలో స్నానం చేయమని.. పాపాలు, వాటివల్ల సంక్రమించే వ్యథలు నశిస్తాయని అన్నాడు. వెంటనే గంధర్వుడు సతీసమేతంగా వెళ్లి మాఘస్నానం చేశాడు. మహర్షి చెప్పినట్లుగానే గత జన్మకు సంబంధించిన పాపాలు పోయి ఆ గంధర్వుడి ముఖం అందంగా తయారైంది.
ఈ పురాణ ప్రారంభంలో సూతుడు ఒక మాట చెప్పాడు. మాఘస్నానం చేయడం.. తెలియనివారికి దాని విశేషం చెప్పి చేయించడం.. ఒకవేళ స్నానం చేసే శక్తి లేకపోతే స్నానం చేసి వచ్చినవారికి దక్షిణ ఇచ్చి ఆ పుణ్యఫలితాన్ని పొందడం కూడా శ్రేయస్కరాలు అంటాడు సూతుడు. దిలీపుడికి ముని సరస్సులో స్నానం చేయమని చెప్పటం ఇలాంటిదే. ఏది ఏమైనా మాఘమాసంలో చేసే నదీ స్నానాల వల్ల.. ఉదయ కాలంలో చేసే స్నానం వల్ల ఆరోగ్యం చేకూరుతుందని నేటి కాలంలోని వైద్యులు కూడా చెప్పటం కనిపిస్తుంది.
మాఘమాస మహాత్మ్యమును తెలుసుకొనుట ఎవరి తరమూ కాదు. ఈ మాఘమాస నదీస్నానం అత్యంత ఫలదాయకమైనది. ఈ మాఘమాస నదీస్నానం చేయటం వల్ల లభించు పుణ్యఫలము మరే ఇతర యజ్ఞయాగాదులు, క్రతువులు చేసినా లభించదు. ఈ మాఘమాస నదీస్నానం చేయుట వలన అత్యంత పుణ్యాత్ములు అవుతారు. ఈ మాఘమాస స్నానము శాశ్వత పుణ్యలోక ప్రాప్తినిచ్చును. ఇతర యజ్ఞయాగాదులవలె తాత్కాలిక ఫలితమును ఇవ్వదు. శాశ్వత స్వర్గలోక ప్రాప్తిని పొందవలెనన్న మాఘమాస నదీస్నానమొక్కటే తరుణోపాయము. మరే ఇతర పుణ్య కార్యాలవలన ఇది సాధ్యం కాదు.
ఫలశ్రుతి
సూతమహర్షి శౌనకాది మునులతో 'మహర్షులారా! వశిష్టులవారు దిలీపునకు తెలియజేసిన మాఘమాస మహత్యము, మాఘస్నాన మహిమ మీకు వివరించితిని. మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞము కూడా పూర్తి కావచ్చినది. కావున సర్వులూ మాఘమాస వ్రతమును, నదీస్నానములను నియమనిష్టలతో చేసి ఆ శ్రీహరి కృపకు పాత్రులు అవ్వండి. మాఘమాసంలో సూర్యుడు మకరరాశియందు ఉండగా సూర్యోదయం అయిన తర్వాత నదిలో స్నానం చేయాలి. ఆదిత్యుని పూజించి విష్ణ్వాలయమును దర్శించి, శ్రీమన్నారాయణునికి పూజలు చేయాలి. మాఘమాసమున ముప్పది రోజులూ క్రమం తప్పకుండా మిక్కిలి శ్రద్ధతోను, ఏకాగ్రతతోను, చిత్తశుద్ధితోను శ్రీ మహావిష్ణువును మనసారా పూజించినచో సకలైశ్వర్య ప్రాప్తి, పుత్రపౌత్రాభివృద్ధి, వైకుంఠప్రాప్తియు పొందుతారని సూతమహర్షి తెలిపినట్లు చిలకమర్తి వెల్లడించారు.