Magha Masam Significance : మాఘమాసంలో ఈ పనులు చేస్తే.. పుణ్యఫలం మీదే..
Magha Masam 2023 : అఘము అంటే పాపము అని అర్థము. మాఘము అంటే పాపాలను నశింపచేసేది అని అర్థము. పాపాలను నశింపచేసేటటువంటి శక్తి ఉన్నటువంటి మాసము కాబట్టే మాఘమాసమునకు ప్రత్యేకత ఉంది. అయితే ఈ మాసములో ఏయే రోజు ఏమి చేస్తే భగవంతుని అనుగ్రహం పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం.
Magha Masam Significance : ఉత్తరాయణంలో మాఘమాసము చాలా ప్రత్యేకమైనది. మనకి పురాణాలలో పుణ్య నదీ స్నానాలకు ఉత్తరాయణంలో మాఘమాసము, దక్షిణాయనంలో కార్తీక మాసము అని పెద్దలు చెప్తారు. సూర్యభగవానుడు మకర రాశిలో సంచరించుచుండగా చేసేటటువంటి పుణ్యనదీ స్నానాలకు విశేషమైనటువంటి పుణ్యఫలం ఉంటుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చెప్పారు. అయితే 2023లో జనవరి 22 నుంచి మాఘమాసం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మాఘమాస ప్రత్యేకత, ప్రాముఖ్యత ఏమిటో.. ఏయే పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్య నదీ స్నానం, దానం, తర్పణం వంటివి ఆచరిస్తాడో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రములు చెప్తున్నాయి. మాఘమాసంలో ఉదయాన్నే నువ్వులతో దీపారాధన చేసిన వారికి.. అలాగే నువ్వులతో హెూమము, నువ్వులు దానము వంటివి చేసిన వారికి ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగుతాయని చిలకమర్తి తెలిపారు.
మాఘమాసంలో పుణ్య నదీస్నానాలకు ఎంతటి ప్రాధాన్యం ఉన్నదో దానమునకు కూడా అంతే విశేషమైనది. మాఘ మాస శుద్ధ విదియ నాడు బెల్లమును దానము చేయడము, ఉప్పును దానము చేయడము వలన శుభాలు కలుగుతాయని, పుణ్యం కలుగుతుందని మాఘ పురాణం స్పష్టంగా తెలియజేసింది. మాఘమాసంలో చవితిరోజు ఉమాదేవిని, విఘ్నేశ్వరుని పూజించడం విశేషం. మాఘ మాస శుక్ల పక్ష పంచమి శ్రీపంచమి రోజు సరస్వతి దేవిని పూజించడం వలన సరస్వతీ కటాక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెప్తున్నాయి.
మాఘమాస శుద్ధ షష్ఠి, మందారషష్ఠి, కామ షష్ఠి, వరుణ షష్ఠి రోజు వరుణ దేవుడిని మందారం వంటి ఎర్రపూలతో, ఎర్ర చందనంతో పూజిస్తారు. మాఘ మాస శుద్ధ సస్తమి రథ సప్తమి రోజు చేసే సూర్యారాధనకు ఆరోగ్యప్రాప్తి కలుగుతుంది. అనారోగ్య సమస్యలు తొలగుతాయి. మాఘమాస శుద్ధ అష్టమిని భీష్మాష్టమి అని.. ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు. మాఘమాసంలో భీష్మ అష్టమి నుంచి భీష్మ ఏకాదశి వరకు విష్ణు సహస్ర నామాన్ని పారాయణ చేసిన వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు తెలియచేసాయి.
సంబంధిత కథనం
టాపిక్