Vastu Tips- Lord Shiva । ఇంట్లో శివుని విగ్రహం ఉంటే.. వాస్తు జాగ్రతలు పాటించాలి!
14 November 2022, 17:10 IST
- Vastu Tips- Lord Shiva: మీ ఇంట్లో శివుని ఫోటో లేదా విగ్రహం పెట్టుకున్నారా? అయితే వాస్తు ప్రకారం దేవతమూర్తుల విగ్రహాలు ఎలా ఉండాలో ఇక్కడ తెలుసుకోండి.
Lord Shiva
హిందూ సంప్రదాయం ప్రకారం, ఇంట్లో దేవత విగ్రహాలను, చిత్రపటాలను ఉంచుకోవడం కూడా ఒక భాగం. హిందూ సంప్రదాయాలను అనుసరించే వారి ఇంటి గుమ్మం ముందు తులసి మొక్క, ఇంటిలోపల పూజమందిరం కచ్చితంగా ఉంటుంది. ఇంటి గోడలపైనా దేవతామూర్తుల చిత్రపటాలు ఉంచుకుంటారు. అయిదే దేవతల చిత్రపటమైనా, విగ్రహాలైన ఇంట్లో కొలువుదీర్చేటపుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. విరిగిపోయిన విగ్రహాలు, చిరిగిపోయిన చిత్రపటాలు ఇంట్లో ఉంచుకోకూడదు. రౌద్రరూపంలో ఉండే మూర్తుల ప్రతిమలను ఎంచుకోకూడదు. అలాగే ఇంట్లో దేవుడి విగ్రహం ఎంత పెద్దగా ఉంటే అందుకు తగినట్లుగా నైవేద్యం కూడా ఎక్కువగా సమర్పించాలని చెబుతారు.
ఇదిలా ఉంటే, చాలామంది ఇళ్లలో ఎక్కువగా శివుడు, వెంకటేశ్వరుడు, లక్ష్మీదేవి, గణపతి విగ్రహాలు ఉంటాయి. హిందువులు ఎక్కువగా పూజించే దేవుళ్ళలో పరమశివుడు ఒకరు. శంకరుడు, పరమేశ్వరుడు, భోళాశంకరుడు, మహేశ్వరుడు, ఈశ్వరుడు, శివుడు ఇలా అనేక పేర్లతో కైలాసవాసుడిని కొలుస్తారు. ఎక్కువ మంది శివుడిని లింగం రూపంలోనే పూజలు చేస్తారు. కానీ శివుని విగ్రహాలు, చిత్రపటాలు పెట్టుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు నిపుణులు అంటున్నారు.
Vastu Tips- Lord Shiva.. శివుని విగ్రహం ఎలా ఉండాలి?
వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు ఇంట్లో రౌద్ర రూపంలో లేదా రహస్య రూపంతో ఉన్న శివుని ఫోటోను ఉంచకూడదు. ఫోటో మాత్రమే కాదు అలాంటి విగ్రహాలను కూడా పెట్టుకోకూడదు. రౌద్రరూపంలో ఉండే విగ్రహాలు ఉండటం వలన ఇంట్లో నిరంతరం ఆందోళన ఉంటుందని నమ్ముతారు. శివుని విగ్రహం లేదా ఫోటో ప్రశాంత వదనంతో ధ్యానం చేసుకుంటున్నట్లుగా ఉండాలి. శివుని మోమూ నవ్వుతున్నట్లుగా ఉంటే ఆ ఇంట్లో కష్టాలు ఉండవు. అలాంటి విగ్రహాలు ఉంటే శాంతి ఉంటుంది. అలాగే శివుని విగ్రహం హాలులో అందరికీ కనిపించేలా, అందరి దృష్టి పడేలా ఉంటే సానుకూల శక్తులు ప్రసరిస్తాయని చెబుతున్నారు.
ఆలుమగలు అన్యోనంగా ఉండాలంటే, వారి దాంపత్య జీవితం సజావుగా సాగాలంటే శివపార్వతులు కలిసి ఉన్న చిత్రపటం లేదా విగ్రహం ఉంచుకోవాలి.
ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య నిరంతర కలహాలు జరుగుతుంటే, లేదా చుట్టుపక్కల వారితో గొడవలు ఎక్కువ ఉంటే. ఇంట్లో పార్వతీ పరమేశ్వరులతో పాటు వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి ఇలా అందరూ ఉన్న ఫోటో ఉంటే కలహాలు ఉండవు.
నృత్యం చేస్తున్నట్లుగా ఉండే శివుని ప్రతిరూపం లేదా నటరాజ విగ్రహం ఇంట్లో ఉంచుకోకూడదు. ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా ఆఫీస్ రూంలో, పెద్దహాలులో, పెరట్లో ఉంచుకోవచ్చు.
వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు శివుడి విగ్రహం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. అలాగే ఇంట్లో ఉత్తర దిశలో ఈశ్వరుని ఫోటో ఉంచితే సానుకూల ఫలితాలు పొందుతారు. మీ ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా మత విశ్వాసాల ప్రకారం జాబితా చేసినది. ఈ పరిహారాలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
టాపిక్