Goddess Lakshmi | ఇంటికి ధన ప్రవాహం పెరగాలా? లక్ష్మీ కటాక్షం పొందడానికి మార్గాలు-best ways to please goddess lakshmi to become healthy and wealthy
Telugu News  /  Rasi Phalalu  /  Best Ways To Please Goddess Lakshmi To Become Healthy And Wealthy
Goddess Lakshmi
Goddess Lakshmi (Unsplash)

Goddess Lakshmi | ఇంటికి ధన ప్రవాహం పెరగాలా? లక్ష్మీ కటాక్షం పొందడానికి మార్గాలు

14 November 2022, 13:07 ISTHT Telugu Desk
14 November 2022, 13:07 IST

Ways to Please Goddess Lakshmi: ఏ వ్యక్తి అయినా సుఖసంతోషాలతో, సంపదలతో వర్ధిల్లాలంటే అందుకు లక్ష్మీ కటాక్షం అవసరం. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే అందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి, అవి ఇక్కడ తెలుసుకోండి.

హిందూ గ్రంథాల ప్రకారం, లక్ష్మీదేవికి ప్రత్యేక స్థానం ఉంటుంది. మహాలక్ష్మీదేవిని అష్ట ఐశ్వర్యాలకు, ఆయురారోగ్యాలకు దేవతగా భావిస్తారు. తమకు లక్ష్మీ కటాక్షం కలగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చదువు, జ్ఞానం లేకపోయినా లక్ష్మీ అనుగ్రహం పొందిన వ్యక్తులు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వారి వద్ద డబ్బుకు అసలు లోటే ఉండదు. జీవితం విలాసవంతంగా సాగుతుంది, అసలు కష్టాలు అనేవే ఉండవు అనేది చాలా మంది విశ్వసించే ఒక నమ్మకం.

మరోవైపు, లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగితే ఎలాంటి వ్యక్తి అయినా తారాస్థాయి నుంచి నేలకు దిగజారుతాడు. సంపదనంతా కోల్పోయి రోడ్డు పాలవుతారు. అన్ని కష్టాలు చుట్టుముట్టి ఒక్కసారిగా జీవితం తలకిందులు అవుతుంది.

Ways to Please Goddess Lakshmi- లక్ష్మీదేవి కటాక్షం పొందడం ఎలా

ఓడలు బండ్లు అవ్వాలన్నా, బండ్లు ఓడలు అవ్వాలన్నా అందుకు లక్ష్మీదేవి కటాక్షమే కీలకం. లక్ష్మీదేవి చల్లని చూపు మీపై ఉండాలంటే, లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి వాస్తు, జ్యోతిష్య శాస్త్రాల పరంగా కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటి పరిశుభ్రత

పురాణ విశ్వాసాల ప్రకారం, ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో, అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుందని నమ్ముతారు. ఏ ఇల్లు అయితే ముత్యాల ముగ్గులతో, పచ్చని తోరణాలతో, దీపధూపనైవేద్యాలతో పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుదీరుతుంది అని చెబుతారు. కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఇంటి పరిశుభ్రత చాలా ముఖ్యం. మూలల్లో చెత్తచెదారాలు ఉంచుకోవడం, గోడలపై బూజు, వస్తువులు చిందరవందరగా పడిఉండటం వంటివి లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించే అంశాలు. అలాగే ఇంటిని ఎల్లప్పుడూ పగటిపూట శుభ్రం చేయాలి, సాయంత్రం వేళ చీకట్లో శుభ్రం చేయకూడదు.

గుమ్మం ముందు స్వస్తిక్

ఇంటి ప్రధాన ద్వారం వద్ద పసుపు, కుంకుమలతో స్వస్తిక్ చేయండి. పురాణ విశ్వాసాల ప్రకారం, ఇంటి ప్రధాన ద్వారం వద్ద ప్రతిరోజూ పసుపు, కుంకుమలతో స్వస్తిక్ చేయడం అంటే లక్ష్మీ దేవికి ఆహ్వానం పంపినట్లే. కాబట్టి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఇది ముఖ్యమైన మార్గం. స్వస్తిక్ రాయటంతో పాటు, ఇంటి ప్రధాన ద్వారం వద్ద రోజూ ముగ్గుపెట్టి, దీపం వెలిగిస్తే, అది మీకు చాలా లాభదాయకం.

లక్ష్మీ హారతి

ప్రతిరోజూ మహాలక్ష్మీ దేవికి హారతి ఇవ్వాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రోజూ లక్ష్మీ దేవికి పూజలు, ఆరాధనలు చేయడం ద్వారా అది ఇంటికి శ్రేయస్సును తెస్తుంది, ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఈ రకంగా ఇంటికి ధన ప్రవాహం పెరుగుతుంది.

దానధర్మాలు

ఇది చాలా ముఖ్యమైనది. లేని వారికి లేదనకుండా ఇవ్వాలి, మనకు మేలు చేసిన వారిని గుర్తుపెట్టుకోవాలి. వారి రుణం ఉంచుకోకూడదు, ఎప్పటికప్పుడు తీర్చుకోవాలి. ఇలాంటి సహాయాలు, దానధర్మాలు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనవి. ఇచ్చే చేయికి, లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఇస్తూనే ఉంటుందని నమ్మకం. అలాగని మీ ఆడంబరాల కోసం, మీ గొప్పల కోసం ఇవ్వకూడదు. మీ సహాయానికి విలువనివ్వనివారికి ఇచ్చినా అది వ్యర్థమే.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా మత విశ్వాసాల ప్రకారం జాబితా చేసినది. ఈ పరిహారాలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

టాపిక్