Hanuman Jayanti 2023 । హనుమాన్ జయంతి రోజున చేయాల్సిన పూజలు, పరిహారాలు ఇవే!
05 April 2023, 11:01 IST
- Hanuman Jayanti 2023: హనుమాన్ జయంతి రోజున హనుమంతుడిని పూజించడం ఎంతో శుభకరం. ఈ రోజున కొన్ని ప్రత్యేక పరిహారాలను పాటించడం వల్ల జీవితంలోని ఎలాంటి అడ్డంకులైనా తొలగిపోవడమే కాదు, శని దోషం నుంచి విముక్తి లభిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
Hanuman Jayanti 2023
Hanuman Jayanti 2023: హిందూ పురాణాల ప్రకారం, చైత్ర మాసంలోని శుక్ల పక్ష శుద్ధ పౌర్ణమి రోజునే హనుమంతుడు జన్మించాడని నమ్ముతారు. హనుమాన్ జయంతి రోజు చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ రోజున హనుమంతుడు తన తల్లి అంజనా గర్భం నుండి జన్మించాడు. ఈ పవిత్రమైన రోజున హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
హనుమంతుని మరొక పేరు సంకట్మోచన్. పురాణాల ప్రకారం, హనుమంతుడి ఆశీర్వాదం పొందిన వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోడు. ఎందుకంటే హనుమంతుడి స్మరణ భక్తుల కష్టాలన్నింటినీ దూరం చేస్తుంది. హనుమంతుడిని ప్రతి మంగళవారం, శనివారం పూజిస్తారు. అయితే, హనుమాన్ జయంతి రోజున పూజించడం మరింత ప్రత్యేకమైన సందర్భం. ఈ రోజున కొన్ని ప్రత్యేక పరిహారాలను పాటించడం వల్ల ఎలాంటి అడ్డంకులైనా తొలగిపోవడమే కాదు.. శని దోషం నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం.
హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుడిని ఎలా పూజించాలి? పాటించాల్సిన పరిహారాలేమిటి తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
హనుమాన్ జయంతి పూజలు, పరిహారాలు- Hanuman Jayanti Puja Rituals
హనుమాన్ జయంతి రోజున, ఆంజనేయుడిని శుభ సమయంలో పూజించండి. ఆయనను పూజించేటప్పుడు, ఎర్రటి పువ్వులు, నెయ్యి, అక్షత, తమలపాకులు, లడ్డూలు సమర్పించాలి. దీనితో పాటు హనుమాన్ మందిరంలో హనుమాన్ చాలీసా పఠించండి, హారతి తీసుకోండి. హనుమంతుడు దీనికి సంతోషించి తన భక్తులను సుఖశాంతులతో దీవిస్తాడు.
ఎవరి జాతకంలో అయితే శని దోషం ఉంటుందో వారంతా హనుమాన్ జయంతి రోజున సుందరకాండ పారాయాణం చేయాలి. హనుమాన్ జయంతి రోజున బెల్లం నూనె లేదా నెయ్యిలో సింధూరం కలిపి ఆంజనేయ దేవాలయంలో సమర్పించాలి. ఇలా చేయడం వల్ల హనుమంతుడు సంతోషించి, మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు. హనుమాన్ జయంతి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు స్వస్తిక్, ఓం చిహ్నం వేయండి. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు, దుష్ట శక్తులు అనేవి మీ ఇంట్లోకి ప్రవేశించలేవు.
హనుమాన్ జయంతి రోజున ఆంజనేయుడి ఆలయానికి వెళ్లి నెయ్యి లేదా ఆవాల నూనెతో దీపం వెలిగించి, హనుమాన్ చాలీసా 5-11 సార్లు పఠించాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటి నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు శని దోషం నుంచి మీకు విముక్తి లభిస్తుంది అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొనే వారు హనుమాన్ జయంతి రోజున రావి చెట్టు ఆకులను 11 వరకు తీసుకుని వాటిని శుభ్రం చేయాలి. అనంతరం వాటికి గంధం, కుంకుమ రాసి శ్రీరాముని పేరు రాసి, మాలగా తయారు చేసి హనుమంతుడికి ధరింపజేయాలి. ఇలా చేయడం వల్ల మీకు డబ్బు సంబంధిత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
హనుమాన్ జయంతి రోజున ఆంజనేయుడి ఆలయంలో ఒక కాషాయ జెండాను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ కచ్చితంగా విజయం సాధిస్తారు. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి అని ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.