Hanuman Jayanthi 2022 |తెలుగు హనుమాన్ జయంతి.. శుభ ముహుర్తం ఎప్పుడంటే..
హనుమంతుని జన్మదినాన్ని దేశవ్యాప్తంగా వైభవంగా జరుపుకుంటారు. భారతదేశంలో ఎక్కువమంది పూజించే వారిలో హనుమంతుడు ప్రసిద్ధి చెందిన దేవుడు. ఆయన రామాయణంలోని అత్యంత ప్రధాన పాత్రలలో ఒకరు. మరి ఈ ప్రత్యేక రోజున ముహూర్తం, తిథి వంటి తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu Hanuman Jayanthi 2022 | భారతదేశంలోని ఉత్తర భాగంలో హనుమాన్ జయంతిని చైత్ర మాసంలోని 15వ రోజున లేదా పౌర్ణమి రోజున జరుపుకుంటారు. తెలుగురాష్ట్రాల్లో, కర్ణాటకలో వైశాఖ మాసంలో కృష్ణ పక్షంలోని పదవ రోజున భక్తులు హనుమాన్ జయంతిని పాటిస్తారు. చైత్ర పూర్ణిమ నాడు ప్రారంభమై వైశాఖ మాసం 10వ రోజుతో ముగిసే ఈ పండుగను 41 రోజుల పాటు చేసుకుంటారు.
వైశాఖ బహుళ దశమినాడు అంజనాదేవికి ఆంజనేయుడు జన్మించాడని పరాశర సంహిత చెబుతోంది. శివాంస సంభూతుడిగా.. కేసరి, అంజనాదేవిలకు ఆంజనేయుడు జన్మించాడు. సప్త చిరంజీవుల్లో ఆయన ఒకరు. రామభక్తుడైన ఆంజనేయుడు.. భక్తితో రామనామాన్ని జపిస్తే ప్రసన్నమవుతాడు.
తేదీ, శుభ ముహూర్తం
తెలుగు హనుమాన్ జయంతిని ఈ సంవత్సరం మే 25వ తేదీన జరుపుకుంటున్నారు. దశమి తిథి మే 24 ఉదయం 10:45 గంటలకు ప్రారంభమై.. మే 25 ఉదయం 10:32 గంటలకు ముగుస్తుంది.
రోజు ఎలా జరుపుకుంటారు?
ఈ ప్రత్యేకమైన రోజును భక్తులు అత్యంత వైభవంగా, ఉత్సాహంగా నిర్వహిస్తారు. 41 రోజుల ఆచారంలో.. ధూమపానం, మద్యం సేవించడం, మాంసం తినడం కూడా మానేస్తారు. కొంతమంది భక్తులు చెప్పులు లేకుండా నడుస్తారు. ఉపవాస కాలం మొత్తం.. ప్రత్యేక దీక్షా మాల, నారింజ ధోతీలు ధరిస్తారు. ఈ 41 రోజులు హనుమాన్ చాలీసాను పారాయణ చేస్తారు. ఇలా పారాయణ చేస్తే.. అనుకున్న కార్యాలు నెరవేరతాయని నమ్ముతారు. హనుమాన్ జయంతిరోజు షోడశోపచార పూజలతో ఆయనను అర్చిస్తే.. సమస్త శుభాలు కలుగుతాయని నమ్ముతారు.
హనుమంతుని ఆశీర్వాదం కోసం.. భక్తులు ఈ పవిత్ర కాలంలో హనుమాన్ చాలీసాను చదివి.. కోతులకు ఆహారం ఇస్తారు. భక్తులు నెయ్యితో దీపారాధన చేసి.. ఆవాల నూనె, సింధూరం కలిపి పూజకు ముందు విగ్రహంపై పూస్తారు.
టాపిక్