Vastu Tips for Plants। వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ఆవరణలో అలాంటి మొక్కలు ఉండరాదు!
13 February 2023, 16:47 IST
- Vastu Tips for Plants । ఇంట్లో తులసి చెట్టు ఉండటం శుభప్రదం, కానీ కొన్ని చెట్లు ఇంటి ఆవరణలో ఉండటం మంచిది కాదని వాస్తుశాస్త్రం చెబుతుంది. అలాంటి మొక్కలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
Vastu Tips for Plants
హిందూ ధర్మాల ప్రకారం, వివిధ రకాల చెట్లు, మొక్కలను కూడా ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు, వాటికి పూజలు కూడా చేస్తారు. ఇంటి పరిసరాల్లో పచ్చని మొక్కలు ఉంటే ఎంతో శుభప్రదమని చెబుతారు. ఇంటి చుట్టూ పచ్చని చెట్లు ఉంటే ఆ ఇల్లు ఎంతో అందంగా కనిపిస్తుంది, ప్రశాంతంగా కూడా ఉంటుంది. వాస్తుశాస్త్రం ప్రకారంగా ఇంటి చుట్టూ పచ్చని చెట్లు ఉండటం వలన ఆ ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది, అది ఆ ఇంటికి పురోగతి, ఆనందం, శ్రేయస్సును తీసుకురావడంలో సహాయపడుతుంది.
అయితే అన్ని రకాల చెట్లను ఇంట్లో నాటుకోకూడదు. రాగి చెట్టు, మర్రి చెట్టు లాంటివి గుడి ఆవరణలో ఉండవచ్చు కానీ, ఇంటి ఆవరణలో ఉండకూడదు. అలాగే చింత చెట్టును అటు గుడిలోనూ, ఇటు ఇంటి ఆవరణలోనూ ఉంచుకోకూడదు అంటారు. ఇలాంటివే మరికొన్ని మొక్కలు, చెట్లు ఇంటి ఆవరణలో ఉండకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది.
Vastu Tips for Plants at Home- ఇంట్లో మొక్కలు, వాస్తు నియమాలు
కొన్నిమొక్కలు ఇంట్లో ఉంటే అవి జీవితంలో సమస్యలను కలిగిస్తాయి. ఇంటి ప్రశాంతతకు భంగం వాటిల్లుతుందని, కుటుంబసభ్యుల పురోగతి ఆగిపోతుందని వాస్తు నిపుణులు అంటున్నారు. అవి ఎలాంటి మొక్కలో ఇక్కడ తెలుసుకోండి.
ముళ్ల చెట్లు
ఇంటి చుట్టూ ఎలాంటి ముళ్ల చెట్లు ఉండకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం, ముళ్లు ఉన్న మొక్కలు ఇంట్లో ఉంటే జీవితం అంతా ముళ్లబాటలా ఉంటుందని నమ్ముతారు. అటువంటి మొక్కలు జీవితంలో అనేక సమస్యలను సృష్టిస్తాయి. కాబట్టి ముళ్లు ఉన్న చెట్లు ఇంటి లోపల గానీ, ఇంటి ఆవరణలో గానీ ఉండకూడదు. అయితే అన్ని ముళ్ల మొక్కలకు ఇది వర్తించదు, కొన్ని పువ్వులు పూసే ముళ్ల చెట్లు ఉంటాయి, వాటిని ఇంటి పెరట్లో సరైన దిశలో ఉంచడం మంచిది. ఉదాహారణకు గులాబీ మొక్కలు ఇంటి నైరుతి దిశలో నాటుకుంటే శుభప్రదం.
తుమ్మ చెట్టు
ఇంటి చుట్టూ తుమ్మ చెట్లు ఉండకూడదు. ఈ మొక్కను నాటడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇది పనిలో అడ్డంకులను సృష్టించగలదు. వ్యాపారాలలో నష్టాలు ఎదురవుతాయి.
రేగు చెట్టు
వాస్తు శాస్త్రం ప్రకారం, రేగు పళ్ల చెట్టు కూడా ఇంట్లో ఉండకూడదు. రేగుపళ్ల చెట్టుకు కూడా ముళ్లు ఉంటాయి. ఈ చెట్టు ఇంట్లో ఉంటే ఖర్చులు అధికమవుతాయి. లక్ష్మీదేవి అసంతృప్తితో వెళ్లిపోతుందని అంటారు. ఇలాంటి చెట్లను తోటలోనే నాటుకోవడం మంచిది.
నిమ్మ చెట్టు
చాలా మంది ఇళ్లల్లో నిమ్మ చెట్టుని చూసి ఉంటారు. వారి ఇంటి పెరడులో నిమ్మ, ఉసిరి వంటి చెట్లను నాటుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ చెట్లు ఉండటం సరికాదు. ఇవి ఇంట్లో కష్టాలను పెంచుతుంది. మీ ఇంటి ఆవరణలో నిమ్మ చెట్టు ఉంటే దానిని వేరే చోటుకి, తోటకి మార్చండి.
*బిల్వ చెట్టు
బిల్వ చెట్టుకి కూడా ముండ్లు ఉంటాయి, అయినప్పటికీ బిల్వ చెట్టును పవిత్రమైనదిగా భావిస్తారు. బిల్వ పత్రం శివునికి ఎంతో ఇష్టమైనది. బిల్వ పత్రంతో శివునికి అభిషేకం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని చెబుతారు. బిల్వ చెట్టును ఇంట్లో నాటుకోవచ్చు. ఇది ఇంటికి ఆరోగ్యం, అదృష్టాన్ని తెస్తుంది. బిల్వ చెట్టును ఇంటికి ఈశాన్య దిక్కులో నాటడం శుభప్రదం.