Vastu for West Facing House| పశ్చిమ దిశ వారికి చాలా కలిసి వస్తుంది.. పడమర ముఖం ఇంటికి వాస్తు చిట్కాలు ఇవీ!
Vastu Tips for West Facing House: చాలా మంది పశ్చిమ దిశలో ఇల్లు ఉండటం మంచిది కాదని భావిస్తారు, కానీ ఇది అపోహే అని వాస్తు నిపుణులు కొట్టి పారేస్తున్నారు. కొంతమంది పడమర ముఖంగా ఇల్లు చాలా కలిసి వస్తుందని చెబుతున్నారు.
నూతన గృహం కట్టుకునేటపుడు లేదా కొనుగోలు చేసేటపుడు ఆ ఇంటికి వాస్తును ప్రధానంగా చూస్తారు. చాలామంది తూర్పు దిశ లేదా ఉత్తర దిశలో ఉన్న ఇంటిని తీసుకునేందుకు ఇష్టపడతారు. అదే సమయంలో పడమర లేదా దక్షిణం వైపు ఉన్న ఇల్లు వాంఛనీయం కాదని లేదా దురదృష్టం తెస్తుందని నమ్ముతారు. కానీ, వాస్తు శాస్త్రంలో పశ్చిమం అశుభ దిశ అని ఎటువంటి వాదన లేదు. నిజానికి వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటికి అన్ని దిశలు సమానమైన ఫలితాలను కలిగి ఉంటాయి. ఇక్కడ ఇంటి వాస్తుకి సంబంధించి నిర్ణయాత్మక అంశం ప్రవేశ ద్వారం మాత్రమే అని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
వాస్తు నిపుణుల ప్రకారం, పశ్చిమ దిశ కూడా మంచిదే. రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, ఉపాధ్యాయులు, మత గురువులు మొదలైన వారికి పశ్చిమ ముఖంగా ఉండే గృహాలు చాలా అనుకూలమైనవి , వీరికి శుభ ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. పశ్చిమ దిశలో నివాసం ఉన్న ఇంట్లో యుక్త వయసు వారు ఉంటే వారికి మంచి శ్రేయస్సు, ఆనందం ఉంటుందని కూడా చెబుతున్నారు.
Vastu Tips for West Facing House- పడమర దిశ ఇంటికి వాస్తు చిట్కాలు
పడమటి ముఖంగా ఉన్న ఇంటి గురించి చింత అవసరం లేదు. కొన్ని వాస్తు నియామాల ద్వారా ఆ ఇంటిని సానుకూల శక్తితో నింపవచ్చు. ఒకవేళ మీరు పశ్చిమ దిశలో ఉండే గృహాన్ని ఎంచుకున్నట్లయితే ఎలాంటి వాస్తు నియమాలు పాటిస్తే శుభ ఫలితాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి.
1. వెస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్
మీది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే, ఇంటి ప్రధాన ద్వారం ఇంటికి మధ్యలో లేదా ఉత్తర భాగంలో ఉండేలా చూసుకోవాలి. అలాగే పశ్చిమ ముఖంగా ఉన్న ఇంటి తలుపులపై కొన్ని మెటల్ వర్క్‌లను డిజైన్ చేయడం మంచిది, ఉదా. మెటల్ నేమ్ బోర్డ్ లేదా లోహపు గంట వంటివి ఉంచాలి. ప్రధాన ప్రవేశ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచండి. మెయిన్ డోర్ దగ్గర డస్ట్‌బిన్‌లు లేదా విరిగిన ఫర్నిచర్ ఉండకూడదు.
2. లివింగ్ రూమ్
మీ లివింగ్ రూమ్ తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్యం వైపు ఉంటే మంచిది. వాయువ్యం వైపు ఉన్న లివింగ్ రూమ్ కూడా మంచిది. గది పశ్చిమ లేదా నైరుతి దిశలో ఏదైనా భారీ ఫర్నిచర్ ఉంచండి.
3. మాస్టర్ బెడ్ రూమ్
పడమర ముఖం కలిగిన ఇంట్లో మాస్టర్ బెడ్‌రూమ్ నైరుతి వైపు ఉంటే మంచిది. భార్యాభర్తల మధ్య అవగాహనను మెరుగుపరచడంలో ఈ దిశ సహాయపడుతుంది. మీ ఇల్లు బహుళ అంతస్థులైతే, ఎత్తైన అంతస్తులో మాస్టర్ బెడ్‌రూమ్‌ని ఏర్పాటు చేయండి. ఇది మీ ఇంటికి విజయం, సామరస్యం, పూర్వీకుల ఆశీర్వాదాలను అందజేస్తుంది.
4. పిల్లల గది
పిల్లల గది కోసం దక్షిణం, పశ్చిమం లేదా వాయువ్య దిశలు ఆదర్శంగా ఉంటాయి. తూర్పు లేదా ఉత్తరంలో తలుపు ఉంచండి. గదిలో వార్డ్రోబ్లను దక్షిణ లేదా పశ్చిమ దిశలో ఉంచండి.
5. వంటగది
వెస్ట్ ఫేసింగ్ ఇంటికి ఆగ్నేయం లేదా వాయువ్యంలో కిచెన్ ఉంచండం మంచిది. ఇంటి నైరుతి భాగంలో మీ వంటగదిని ప్లాన్ చేయవద్దు. ఇంటి కుక్‌టాప్‌తో కూడిన మీ కిచెన్ కౌంటర్ తూర్పు వైపు ఉండేలా చూసుకోండి, ఎందుకంటే వంట చేసేటప్పుడు తూర్పు వైపుకు వెళ్లడం మంచిది.
6. కిటికీలు
పడమర దిశ ఇంటికి అద్భుతమైన సూర్యాస్తమయాలను చూసే అవకాశం ఉంటుంది. వెచ్చని సూర్యరశ్మిని ఎక్కువసేపు పొందవచ్చు. ఇంట్లోకి సూర్యకాంతి రావడం చాలా మంచిది. శక్తి ప్రవాహాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడటానికి ఉత్తరం, తూర్పు దిశలలో ఎక్కువ కిటికీలు ఉండేలా డిజైన్ చేసుకోండి.
సంబంధిత కథనం
టాపిక్