తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Bharani Nakshtram: భరణి నక్షత్రంలో పుట్టిన వారికి అవంటే చాలా ఇష్టమట

Bharani nakshtram: భరణి నక్షత్రంలో పుట్టిన వారికి అవంటే చాలా ఇష్టమట

Gunti Soundarya HT Telugu

28 September 2024, 12:00 IST

google News
    • Bharani nakshtram: భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కళలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. వీరికి అలంకారం చేసుకోవడం అంటే చాలా ఇష్టం. 27 నక్షత్రాలలో రెండో నక్షత్రం భరణి. మీరు ఇదే నక్షత్రంలో పుట్టారా అయితే మీకు ఏ ఉద్యోగం సెట్ అవుతుందో చూసుకోండి. 
భరణి నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు ఇవే
భరణి నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు ఇవే (pexels)

భరణి నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు ఇవే

Bharani nakshtram: జ్యోతిష శాస్త్రం ప్రకారం పన్నెండు రాశులు ఉన్నట్టే మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. వాటిలో రెండవది భరణి నక్షత్రం. ఇది చాలా శుభప్రదమైనదిగా చెబుతారు. కుటుంబ సంబంధాలను బలోపేతం చేసేందుకు సహాయపడే శుభ నక్షత్రంగా పరిగణిస్తారు. అన్నింటిలోనూ చాలా పవిత్రమైనదిగా పిలుస్తారు. ఈ నక్షత్రానికి అధిపతి యముడు అయితే పాలించే గ్రహం శుక్రుడు. 

భరణి నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు ఇవే 

భరణి నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు ఆసక్తికరంగా ఉంటాయి. వీళ్ళు అలంకార ప్రియులు. వస్త్రాలు, ఆభరణాలపై అధిక ఆసక్తి ఉంటుంది. అందంగా ముస్తాబు అవుతారు. శుభ్రంగా ఉంటూ ఆకర్షణీయంగా కనిపించేందుకు తాపత్రాయపడతారు. 

సత్యమార్గాన్ని అనుసరిస్తారు. నిజాయితీగా ఉంటారు. భోగభాగ్యాలకు, విలాసాలకు, సౌకర్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. చాలా అందంగా పెద్దపెద్ద కన్నులతో ఆకర్షణీయంగా ఉంటారు. వీరి శరీరాకృతి అందంగా ఉంటుంది. వీరికి కళల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆకర్షణీయమైన ప్రవర్తనతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. సంపూర్ణమైన జీవితం జీవించేందుకు ఇష్టపడతారు. కొంచెం స్వార్థపరులుగా ఆలోచిస్తారు. ఇది వారికి ప్రతికూలమైన విషయం అనే చెప్పాలి. 

ఏ ఉద్యోగం సెట్ అవుతుందంటే 

భరణి నక్షత్రంలో జన్మించిన వారికి వినోదం, సినిమా, మీడియా, కళలు వంటి వాటిలోని ఉద్యోగాలు వీరికి చక్కగా సరిపోతాయి. అందానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. శుక్రుడు ఈ నక్షత్రానికి పాలక గ్రహం కావడం వల్ల ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. అలంకారాలు అంటే వీరికి చాలా ఇష్టం. అందువల్ల ఈ రంగాల్లో వీరు ఇష్టంగా పని చేస్తారు. వీటితో పాటు వైద్య వృత్తి కూడా వీరికి సెట్ అవుతుంది. అయితే ఈ నక్షత్ర జాతకులకు శత్రువులు అధికంగా ఉంటారు కొంత కష్టపడినప్పటికీ అందుకు తగిన ప్రతిఫలం ఒక్కోసారి దక్కకుండా పోతుంది. 

వైవాహిక జీవితం ఎలా ఉంటుంది?

ఈ నక్షత్ర జాతకులు కుటుంబ బంధాలకు కట్టుబడి ఉంటారు. కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తారు. ఒకరోజు కూడా వాళ్ళని విడిచిపెట్టి దూరంగా ఉండలేరు. ప్రతి విషయంలో వీరు తొలి ప్రాధాన్యత కుటుంబానికే ఇస్తారు. కుటుంబ అవసరాలను తీర్చడం కోసం ఎంత డబ్బు అయినా ఖర్చు చేస్తారు. జీవిత భాగస్వామిని అపురూపంగా చూసుకుంటారు. వీరి నుంచి జీవిత భాగస్వామికి తగినంత ప్రేమ మద్దతు దొరుకుతుంది. 

ప్రతికూల ప్రభావాలు 

భరణి నక్షత్రంలో జన్మించిన వారికి రాహు, శని గ్రహాల వల్ల ప్రతికూల సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల వాటి నుంచి బయటపడేందుకు లక్ష్మీదేవిని, భద్రకాళిని పూజించాలి. ప్రతినెల లక్ష్మి పూజ చేయడం, అలాగే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన శుక్రవారం పూట ఉపవాసం ఉండటం వల్ల శుక్ర గ్రహంతో పాటు లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయి. అలాగే శుక్రుడికి సంబంధించిన మంత్రాలు, స్తోత్రాలు జపించడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందుతారు. 

ఈ ఆరోగ్య సమస్యలు ఉంటాయి 

భరణి నక్షత్ర జాతకులకు చర్మ సంబంధ వ్యాధులు, కళ్లకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అందువల్ల ఇటువంటి అనారోగ్య సంకేతాలు ఏమైనా కనిపిస్తే వెంటనే నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి

టాపిక్

తదుపరి వ్యాసం