Ashwini nakshtram: మీరు అశ్విని నక్షత్రంలో పుట్టారా? మీకు ఏ ఉద్యోగం సెట్ అవుతుందో తెలుసా?-are you born in ashwini nakshatram do you know which job is set ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ashwini Nakshtram: మీరు అశ్విని నక్షత్రంలో పుట్టారా? మీకు ఏ ఉద్యోగం సెట్ అవుతుందో తెలుసా?

Ashwini nakshtram: మీరు అశ్విని నక్షత్రంలో పుట్టారా? మీకు ఏ ఉద్యోగం సెట్ అవుతుందో తెలుసా?

Gunti Soundarya HT Telugu
Sep 24, 2024 10:00 AM IST

Ashwini nakshtram: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అశ్విని నక్షత్రం మొదటిది. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు వేగానికి ప్రతీకగా ఉంటారు. అన్నింటా దూసుకెళ్ళే మనస్తత్వం వీరిది. ఇలాంటి వారికి ఎలాంటి ఉద్యోగం సెట్ అవుతుందో తెలుసా?

అశ్విని నక్షత్రం
అశ్విని నక్షత్రం (pixabay)

Ashwini nakshtram: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. వాటిలో మొదటిది అశ్విని నక్షత్రం. పేరులో ఉన్నట్టే గుర్రం లాంటి వేగం వీరి సొంతం.

అశ్విని నక్షత్రానికి అధిదేవత అశ్విని దేవతలు. వీళ్ళు ఎవరో కాదు సూర్య భగవానుడికి పుట్టిన వాళ్ళు. ఒకనాడు వేడిని తట్టుకోలేక సూర్యుడి భార్య సంజ్ఞ గుర్రం మాదిరిగా మారింది. అప్పుడు సూర్యుడు ఆమెతో కలయిక జరగడం వల్ల అశ్విని దేవతలు పుట్టారని చెబుతారు. అశ్విని దేవతలను వైద్యులుగా నమ్ముతారు.

అశ్విని నక్షత్రాన్ని పాలించే గ్రహం కేతువు. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ప్రతి పని వేగంగా పూర్తి చేస్తారు. జ్ఞాపకశక్తి మెండుగా ఉంటుంది. నిరంతరం నేర్చుకోవాలనే తపన, ఆసక్తి వీరికి ఎక్కువగా ఉంటాయి. కొన్ని సార్లు మొండిగా ప్రవర్తిస్తారు కానీ కష్టపడి పని చేసే తత్వం వీరిది. అదృష్టవంతులుగా పేరు తెచ్చుకుంటారు. నీతి నిజాయితీకి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఆధ్యాత్మికత మీద కూడా ఆసక్తి కలిగి ఉంటారు. ఎంతో ఆకర్షణీయమైన రూపం వీరి సొంతం. మాట తీరు బాగుంటుంది.

కెరీర్

అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి వాళ్ళు పోలీసు, రక్షణ దళాలు, జర్నలిజం వంటి వృత్తిలో రాణించగలుగుతారు. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి కలిగి ఉండటం వల్ల వైద్య వృత్తి కూడా వీరికి చక్కగా సరిపోతుంది. ఏ రంగం ఎంచుకున్నా సరే కెరీర్ లో వీళ్ళు అందరి కంటే భిన్నంగా రాణించగలుగుతారు. బిజినెస్, సాహస క్రీడల రంగాలలో రాణిస్తారు.

వైవాహిక జీవితం

అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు స్వతంత్రంగా ఉండేందుకు ఇష్టపడతారు. ఒకరి నియంత్రణలో ఉండేందుకు ఇష్టపడరు. అయితే వీరి వైవాహిక జీవితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి నమ్మకంగా ఉంటారు. కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తారు. జీవిత భాగస్వామి మాటకు విలువ ఇస్తూనే తల్లిదండ్రులు, తోబుట్టువుల పట్ల ప్రేమ చూపిస్తారు.

జీవనశైలి

ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు విలాసవంతమైన జీవితం గడపడానికి ఇష్టపడతారు. ఎంతటి సవాలుతో కూడిన జీవితం అయినా సరే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. ధైర్యం, వేగంగా స్పందించడం వీరి సానుకూల లక్షణాలు. పదునైన ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఎదుటి వారి సలహాలు తీసుకున్నప్పటికీ చివరికి మాత్రం వీళ్ళు అనుకున్నదే చేస్తారు. ఇక ఆరోగ్య పరంగా వీరికి నలభై సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. తలకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. తలనొప్పి, నిద్రలేమి, మతిమరుపు వంటివి ఇబ్బంది పెట్టె అవకాశాలు ఉన్నాయి.

ప్రతికూలతలు

ఓ వ్యక్తికి బలం ఉన్నట్టే బలహీనత కూడా ఉంటుంది. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి ప్రతికూల లక్షణాలు ఉన్నాయి. అదే మొండితనం. కొన్ని సార్లు ఆవేశపూరితంగా మూర్ఖంగా తీసుకునే నిర్ణయాల వల్ల చిక్కుల్లో పడతారు. అనవసరమైన ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. ఓర్పు, వివేకానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

టాపిక్