మంగళవారం ఈ పనులు చేశారంటే.. మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్టే!
13 November 2024, 22:16 IST
- మంగళవారం వచ్చిందంటే గోర్లు కత్తిరించద్దు, జుట్టు కత్తిరించద్దు లాంటి మాటలు మనం నిత్యం వింటూనే ఉంటాం. కానీ అలా ఎందుకంటారో తెలుసా..? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం కొన్ని పనులు చేయకూడదు.
మంగళవారం జుట్టు ఎందుకు కత్తిరించకూడదు
మంగళవారం గోర్లు కత్తిరించకూడదు. మంగళవారం గుడ్లు తినకూడదు. మంగళవారం జుట్టు కత్తిరించకూడదు అని ఎవరో ఒకరు చెబుతూనే ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా ఈ మాటలను వినే ఉంటాం. మంగళవారం వస్తే అది చెయ్యద్దు, ఇది చెయ్యద్దూ అని పూర్వీకులు ఎందుకు అంటారు. చేస్తే ఏమవుతుంది అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా..? వచ్చుంటే దానికి సమాధానం మీకు ఇక్కడ దొరుకుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మంగళవారం చేయకూడని పనులు కొన్ని ఉన్నాయట. అవేంటో దానికి కారణాలేంటో తెలుసుకుందాం..
హిందూమంతంలో వారంలో ప్రతి ఒక రోజు ఒక దేవుడికి, ఒక గ్రహానికి అంకితం చేయబడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఆయా రోజుల్లో సంబంధిత దేవుడిని పూజించడం శుభప్రదమని నమ్ముతారు. అలాగే ఆయా రోజుల్లో ఆ దేవుడికి, ఆ గ్రహానికి ఇష్టం లేని పనులు చేయడం అశుభమని భావిస్తారు. మంగళవారాన్ని హనుమంతుడి రోజుగా, అంగారక గ్రహం రోజుగా జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
అంగారక గ్రహం వ్యక్తి శక్తి, పరాక్రమం, ధైర్యం వెనక ఉంటే శక్తి. ఎరుపు రంగులో ఉండే ఈ గ్రహం ఒక వ్యక్తి రక్తంపై కూడా ప్రభావం చూపుతుంది. మంగళవారం రోజున అంగారకుడికి నచ్చని పనులను చేయడం వల్ల మాంగ్లిక దోషం కలుగుతుంది. ఇది కోపం, అసూయ, ధ్వేషం, వివాదాలు, నిరాశ, మానసిక క్షోభ, అనారోగ్యం వంటి వాటిని కలిగిస్తుంది. కొంతమందికి వివాహం కానివ్వకుండా చేస్తుంది. మంగళవారం రోజు కొన్ని పనులు చేయడం వల్ల అంగారకుడి నుంచి మీకు కష్టాలు తప్పవు. మంగళవారం చేయకూడని పనులు, కొనకూడని వస్తువులు ఏంటో తెలుసుకుందాం..
1. జుట్టు కత్తిరించడం:
అంగారక గ్రహ ప్రభావం వల్ల మంగళవారం వేడి ఎక్కువగా ఉంటుంది. ఇది మనిషి శరీరంలోని రక్తం, రాగద్వేషాలపై ప్రభావం చూపుతుంది. ఇతర రోజుల కంటే మంగళవారం రోజు చాలా సులభంగా కోపం వస్తుంది. ఈ రోజు జుట్టు కత్తిరించుకోవడం వల్ల ఆందోళనలు పెరుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. జుట్టు కత్తిరించుకోవడానికి బుధవారం ఉత్తమమైనది.
2. మినప పప్పు వాడటం:
మంగళవారం అస్సలు చేయకూడని పనుల్లో ఒకటి ఇంట్లో మినపపప్పు వండటం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మినపపప్పు శని గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. అంగారకుడు, శని గ్రహాల కలయిక మొత్తం కుటుంబానికి హాని కలిగిస్తుంది. కాబట్టి మంగళవారం మినపపప్పుకు దూరంగా ఉంటే మంచిది.
3. గోళ్లు కత్తిరించడం:
గురువారం, శనివారంతో పాటు మంగళవారం కూడా గోళ్లను కత్తిరించేందుకు అనువైనది కాదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గోళ్లు, వెంట్రుకలు, ధూళి వంటి వ్యర్థ పదార్థాలను శని పరిపాలిస్తుంది. అలాగే కత్తెర, బ్లేడు, నెయిల్ కట్టర్ వంటి ఆయుధాలను అంగారకుడు పాలిస్తాడు. ఈ రెండింటినీ కలయిక శరీరానికి హాని కలిగిస్తుంది. కనుక మంగళవారం గోళ్లు కత్తిరించడం మానుకోవాలి.
4. అన్నయ్యతో గొడవ పడటం:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అంగారకుడు అన్నయ్యతో సంబంధం కలిగి ఉంటారు. కనుక మంగళవారం నాడు మీ అన్నయ్యతో ఎప్పుడూ గొడవపడకండి. ఇలా చేయడం వల్ల మీకు తెలియకుండానే మీ అన్నయ్యకు మీరు తీరని హాని చేస్తారు. ఇది మీ అన్నదమ్ముల బంధాన్ని నాశనం చేస్తుంది.
5. నల్లటి దుస్తులు ధరించడం:
అటు హనుమంతుడికి ఇటు అంగారకుడికి నలుపు రంగంటే పడదు. కనుక మంగళవారం నాడు నలుపు రంగు దుస్తులు అస్సలు ధరించకూడదు. ఇది మీ ఎదుగుదలకు, శ్రేయస్సుకు ఆటంకం కలిగిస్తుంది. మానసిక ఒత్తిడిని పెంచుతుంది. బదులుగా ఎర్రటి దుస్తులను ధరించడం శుభఫలితాలను కలిగిస్తుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.