Zerodha fitness challenge : బరువు తగ్గితే.. రూ. 10లక్షలు- ఉద్యోగులకు సీఈఓ ఆఫర్!
25 September 2022, 16:11 IST
- Zerodha fitness challenge : బరువు తగ్గితే రూ. 10లక్షల నగదు రివార్డుగా ఇస్తామని ఉద్యోగులకు ఛాలెంజ్ విసిరింది జెరోధా. ఈ మేరకు ఓ ఫిట్నెస్ ఛాలెంజ్‌ను ప్రవేశపెట్టింది.
నితిన్ కామత్
Zerodha fitness challenge : ఉద్యోగులకు సరికొత్త ఫిట్నెస్ ఛాలెంజ్‌ని విసిరింది ఆన్లైన్ బ్రోకరేజ్ సంస్థ జెరోధా. గత కొంతకాలంగా.. ఉద్యోగుల ఫిట్‌నెస్‌పై దృష్టిసారించిన ఆ సంస్థ.. ఛాలెంజ్‌లో గెలిస్తే రూ. 10లక్షల రివార్డును కూడా ఇస్తామని ప్రకటించింది.
జెరోధా సీఈఓ నితిన్ కామత్ ప్రకారం.. ఈ ఫిట్నెస్ ఛాలెంజ్‌లో పాల్గొనే ఉద్యోగులకు పలు రకాల ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఒక లక్కీ పార్టిసిపెంట్‌కు రూ. 10లక్షల నగదును రివార్డుగా ఇస్తారు.
జెరోధా ఫిట్నెస్ ఛాలెంజ్‌లో భాగంగా.. రోజుకు కనీసం 350 క్యాలరీలను బర్న్ చేయాలి.
"ఫిట్నెస్ ట్రాకర్లలో డెయిలీ యాక్టివిటీ గోల్స్ సెట్ చేసుకోవడం పూర్తిగా ఆప్షనల్. 90శాతం రోజుల్లో పెట్టుకున్న గోల్స్‌ని ఏడాది కాలంలో సాధిస్తే.. వారికి నెల జీతాన్ని బోనస్‌గా ఇస్తాము. లక్కీ డ్రాలో ఎంపికైన వ్యక్తికి రూ. 10లక్షలు లభిస్తాయి," అని లింక్డిన్లో చెప్పారు నితన్ కామత్.
ఉద్యోగులు యాక్టివ్‌గా, ఫిట్‌గా ఉండేందుకు సంస్థ ప్రయత్నిస్తోందని నితిన్ కామత్ వెల్లడించారు. ఈ క్రమంలో ఓ హెల్త్ యాప్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ని కూడా షేర్ చేశారు.
"కొవిడ్ నేపథ్యంలో నేను బరువు పెరిగాను. నా యాక్టివిటీలను ట్రాక్ చేయడం బాగా ఉపయోగపడుతోంది. డైట్ పరంగానూ వినియోగిస్తున్నాను. 1000క్యాలరీలు బర్న్ చేస్తున్నా. మీ యాక్టివిటీ ట్రాకర్‌ని కూడా పంచుకోండి," అని రాసుకొచ్చారు జెరోధా సీఈఓ నితిన్ కామత్.
ఉద్యోగుల ఫిట్‌నెస్‌పై జెరోధా దృష్టిపెట్టడం ఇది కొత్తేమీ కాదు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ప్రోత్సాహకాల గురించి ప్రకటించింది. బీఎంఐ స్థాయి 25 కన్నా తక్కువ ఉన్న ఉద్యోగులకు.. నెల జీతంలో సగాన్ని బోనస్‌గా ఇస్తామని ప్రకటించింది. గతేడాది కూడా ఇలాంటి ఛాలెంజ్‌నే ప్రవేశపెట్టింది ఈ ఆన్లైన్ బ్రోకరేజ్ సంస్థ.