Largest residential building : ఈ ఒక్క బిల్డింగ్‌లో 20వేల మంది నివాసం- చైనాలో అంతే..!
07 October 2024, 6:53 IST
Largest residential building : ఒక భవనంలో 20వేల మంది ప్రజలు నివాసం ఉంటున్నారంటే మీరు నమ్మగలరా? ఆ భవనం అసలు సామర్థ్యం 30వేలు అంటే మీ స్పందన ఏంటి? చైనాలోని ప్రపంచంలోనే అతిపెద్ద నివాస భవనం గురించి ఇక్కడ తెలుసుకోండి..
ఒక్క బిల్డింగ్‌లో 20వేల మంది ఉంటన్నారు!
హైదరాబాద్ వంటి మహా నగరాల్లోని స్కై స్క్రేపర్స్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. ఎత్తైన, భారీ భవనాల్లో వందలాది కుటుంబాలు నివాసముంటాయి. అయితే.. ఒక భవనంలో 20వేల మంది నివాసముంటున్నారు అంటే మీరు నమ్మగలరా? నమ్మాల్సిందే! చైనాలోని ప్రపంచంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో 20వేలకుపైగా మంది జీవిస్తున్నారు! ఈ బిల్డింగ్‌కి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోని ప్రజలు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద నివాస భవనం..
చైనాలోని కియాన్జియాంగ్ సెంచురీ సిటీలో ఉంది ఈ ప్రపంచంలోనే అతిపెద్ద నివాస భవనం. రీజెంట్ ఇంటర్నేషనల్ అని పిలిచే ఈ 675 అడుగులు, ఎస్ ఆకారంలో ఉన్న భవనాన్ని తొలుత ఓ లగ్జరీ హోటల్‌గా నిర్మించారు. ఆ తర్వాత ఒక భారీ అపార్ట్మెంట్ బిల్డింగ్‌గా మార్చారు.
ప్రస్తుతం ఇందులోని 39 అంతస్తుల్లో 20 వేల మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు.
ఈ భవనం "స్వీయ-నియంత్రిత కమ్యూనిటీ" అని చెబుతారు. దీనిలో అనేక సౌకర్యాలు, వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఇందులో భారీ ఫుడ్ కోర్టు, స్విమ్మింగ్ పూల్స్, కిరాణా దుకాణాలు, బార్బర్ షాపులు, నెయిల్ సెలూన్లు, కేఫ్‌లు.. ఒక్కటేంటి బతకడానికి కావాల్సిన అన్ని వసతులు ఉన్నాయి.
నివాసితులు భవనం లోపల తమకు అవసరమైన ప్రతిదాన్ని కనుగొనవచ్చు కాబట్టి, వారు బయటకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు!
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోని ఇక్కడ చూడండి..
ఒక భవనంలో 20వేల మంది నివాసం ఉండటం అంటేనే పెద్ద విషయం. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద నివాస భవనమైన రీజెంట్ ఇంటర్నేషనల్ అసలు సామర్థ్యం 30వేలు! అంటే ఇంకో 10వేల మంది ఇందులోకి వెళ్లొచ్చు!
ఈ భారీ భవనానికి సంబంధించిన వీడియో ఎక్స్‌లో దాదాపు 60,000 వ్యూస్‌ని పొందింది. చాలా మంది వినియోగదారులు భవనం పరిమాణానికి ముగ్ధులయ్యారు. కొందరు 'వావ్' అంటుంటే.. ఇంకొందరు అనేక రకాల సమస్యలను లేవనెత్తుతున్నారు.
నెటిజన్ల కామెంట్స్..
“ఇది వెర్రితనం. నీటి సరఫరా, మురుగునీటిని వారు ఎలా కంట్రోల్?” అని ఒక వినియోగదారుడు ఆశ్చర్యపోయాడు.
"ఒక్క బిల్డింగ్‌లో మొత్తం సిటీ ఉన్నట్టు ఉంది," అని రెండవ యూజర్ కామెంట్ చేశాడు.
"నమ్మశక్యం కానిది. ఆధునిక ఆర్కిటెక్చర్ ఇంత మందిని ఒకే భవవనంలోకి తీసుకురాగలదు. ఒక ప్రత్యేకమైన కమ్యూనిటీ భావనను ఎలా సృష్టిస్తుందో చూడాలని ఉంది," అని మరొక యూజర్ రాశారు.
“ఇంత పెద్ద భవనంలో డెలివరీలు ఎలా చేస్తారో?” అని మరొకరు ఆసక్తికరమైన ప్రశ్నను లేవనెత్తారు.
అయితే, చాలా మంది వినియోగదారులు భద్రతా లోపాలు, నివాసితులు ఎదుర్కొనే ఇతర సవాళ్లను ఎత్తి చూపారు.
భూకంపం వస్తే 20 వేల మందికి పైగా చనిపోతారని కొందరు అభిప్రాయపడ్డారు. ఇది చాలా రిస్క్‌తో కూడుకున్నదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
"కాంపౌండ్ లోపల ఎలివేటర్లు, ఓపెన్ స్పేస్ వంటి భాగస్వామ్య సౌకర్యాలపై ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. అలాగే అగ్నిప్రమాదం, భూకంపం మొదలైన సందర్భాల్లో, ఎర్లీ రెస్పాన్స్ చాలా సవాలుతో కూడిన పని," అని మరో యూజర్ పేర్కొన్నారు.