తెలుగు న్యూస్  /  బిజినెస్  /  China Investments In India : భారత్​లో చైనా పెట్టుబడులను పెంచేందుకు కేంద్రం కసరత్తు!

China investments in India : భారత్​లో చైనా పెట్టుబడులను పెంచేందుకు కేంద్రం కసరత్తు!

Sharath Chitturi HT Telugu

29 July 2024, 7:22 IST

google News
    • భారత్​లో చైనా పెట్టుబడులను పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. భద్రతాపరమైన ముప్పును కలిగించని కంపెనీలకు అవకాశం ఇవ్వాలని కేంద్రం భావిస్తోందని తెలుస్తోంది.
భారత్​లో చైనా పెట్టుబడులను పెంచేందుకు కేంద్రం కసరత్తు!
భారత్​లో చైనా పెట్టుబడులను పెంచేందుకు కేంద్రం కసరత్తు!

భారత్​లో చైనా పెట్టుబడులను పెంచేందుకు కేంద్రం కసరత్తు!

2020 సరిహద్దు వివాదం అనంతరం భారత్​లో చైనా పెట్టుబడులు గణనీయంగా తగ్గాయి. అయితే మన దేశంలో చైనా పెట్టుబడులను పెంచేందుకు కేంద్రం ప్లాన్​ చేస్తున్నట్టు తాజా సమాచారం. ఈ మేరకు భద్రతాపరమైన ముప్పు కలిగించకుండా పనిచేసే కంపెనీలకు సంబంధించి కేంద్రం ఒక లిస్ట్​ తయారు చేస్తోందని, అది పూర్తైన తర్వాత ఆయా సంస్థలకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పొరుగు దేశాలకు వర్తించే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్​డీఐ) రెగ్యులేషన్​లోని ప్రెస్ నోట్ -3 ప్రకారం అదనపు పరిశీలన లేకుండా ఈ రంగాల్లో పెట్టుబడులను కేంద్రం అనుమతించవచ్చని వివరించాయి.

2020 లో భారత్​- చైనా మధ్య సరిహద్దు వివాదం మొదలైనప్పటి నుంచి ప్రెస్ నోట్ -3 అమల్లో ఉంది. దీని ప్రకారం భారతదేశంతో భూ సరిహద్దులు ఉన్న దేశాల ఇన్​వెస్టర్లు పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వ అనుమతిని పొందడం తప్పనిసరి. ఫలితంగా దిగుమతులు ఊపందుకున్నప్పటికీ ఈ నియంత్రణ తర్వాత చైనా నుంచి పెట్టుబడులు తగ్గిపోయాయి.

''ఈ ఆలోచనపై కసరత్తు జరుగుతోంది. కానీ, ఇప్పటివరకు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు,' అని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

" చైనా నుంచి భద్రతా ముప్పు నిరంతరం ఉంది. అది తొలగిపోలేదు. కానీ భద్రతాపరమైన ముప్పు లేని కొన్ని పరిశ్రమలు / రంగాలు ఉన్నాయి. చైనా నుంచి పెట్టుబడులను స్వీకరించడంతో మన ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది," అని ఆ అధికారి అన్నారు.

చైనాపై అమల్లో ఉన్న నియంత్రణను సమీక్షించడంపై చర్చలు జరపాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ఈ విషయాన్ని పరిశీలిస్తోందని జూలై 25న హిందుస్థానన్ టైమ్స్ నివేదించింది.

సంబంధిత వర్గాల ప్రకారం.. ఒకవేళ ఈ ఆలోచన కార్యరూపం దాల్చితే, కేంద్ర హోంశాఖతో డీపీఐఐటీ కసరత్తులు మెదలుపెడుతుంది. భద్రతాపరమైన ముప్పు కలిగించని కంపెనీల లిస్ట్​ని తయారు చేస్తుంది. ఆటోమెటిక్​ చైనా ఇన్​వెస్ట్​మెంట్స్​కి అనుమతులు వస్తాయి.

కానీ దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మరో అధికారి అన్నారు.

చైనా నుంచి నైపుణ్యం కలిగిన మానవ వనరులకు వీసాలపై ఆంక్షల కారణంగా తాము సాంకేతిక, ఇతర సవాళ్లను ఎదుర్కొంటున్నామని, ఎఫ్ డీఐ విధానాన్ని సడలించాలని దేశీయ పరిశ్రమ, ముఖ్యంగా చైనా ప్లాంట్లు, పరికరాలను ఉపయోగించే వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

చైనా పెట్టుబడులు రాకపోవడం వల్ల దేశ సొంత తయారీ రంగంపై ప్రభావం పడుతోందని కంపెనీలు చెబుతున్నాయి.

గత వారం విడుదల చేసిన తాజా ఆర్థిక సర్వే ఎగుమతులను పెంచడానికి భారతదేశం తన ఉత్తరాన ఉన్న పొరుగు దేశం నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.

ఈ వ్యవహారంపై ఆర్థిక, వాణిజ్య మంత్రిత్వ శాఖల ప్రతినిధులు ఈమెయిల్ ప్రశ్నలకు స్పందించలేదు.

కానీ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటే దేశీయ సంస్థలకు నష్టం కలగొచ్చు అన్న వాదనలు కూడా ఉన్నాయి. 'మేకిన్ ఇండియా'కు చైనా కంపెనీలను అనుమతించడం వల్ల దేశీయ పరిశ్రమలు దెబ్బతినే ప్రమాదం ఉందని, కీలకమైన సరఫరాలు, ఆర్థిక వృద్ధి కోసం దేశీయ సంస్థలు చైనా కంపెనీలపై ఆధారపడాల్సి వస్తుందని కొందరు నిపుణులు పేర్కొన్నారు.

“చైనా కంపెనీలు భారత్​లో పెట్టుబడులు పెట్టడం, పాశ్చాత్య మార్కెట్లకు ఎగుమతి చేయడం స్వల్పకాలంలో ప్రయోజనకరంగా అనిపించినప్పటికీ, ఇది భారతదేశ దీర్ఘకాలిక ఆర్థిక భద్రత, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని దెబ్బతీసే ప్రమాదం ఉంది. కీలక ఉత్పాదక సామర్థ్యాల కోసం చైనా సంస్థలపై ఆధారపడటం వల్ల సరఫరా గొలుసు బలహీనతలు, భౌగోళిక భౌగోళిక ప్రమాదాలకు భారత్ గురవుతుంది,” అని గ్లోబల్​ ట్రేడ్​ రసెర్చ్​ ఇనీషియేటివ్​ ఫౌండర్​ అజయ్​ శ్రీవాస్తవ అన్నారు.

తదుపరి వ్యాసం