ACB Raid : ఇంటి నివాస ధ్రువపత్రం కోసం రూ. 5 వేలు లంచం, ఏసీబీకి చిక్కిన కొండాపూర్ పంచాయతీ కార్యదర్శి-kondapur acb raids panchayat secretary arrested taking bribe for residence certificate ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Acb Raid : ఇంటి నివాస ధ్రువపత్రం కోసం రూ. 5 వేలు లంచం, ఏసీబీకి చిక్కిన కొండాపూర్ పంచాయతీ కార్యదర్శి

ACB Raid : ఇంటి నివాస ధ్రువపత్రం కోసం రూ. 5 వేలు లంచం, ఏసీబీకి చిక్కిన కొండాపూర్ పంచాయతీ కార్యదర్శి

HT Telugu Desk HT Telugu
Sep 28, 2024 05:58 PM IST

ACB Raid : సంగారెడ్డి జిల్లా కొండాపూర్ లో ఇంటి నివాస ధ్రువపత్రం కోసం రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఇంటి నివాస ధ్రువపత్రం కోసం రూ. 5 వేలు లంచం, ఏసీబీకి చిక్కిన కొండాపూర్ పంచాయతీ కార్యదర్శి
ఇంటి నివాస ధ్రువపత్రం కోసం రూ. 5 వేలు లంచం, ఏసీబీకి చిక్కిన కొండాపూర్ పంచాయతీ కార్యదర్శి

ACB Raid : ఇంటి నివాస ధ్రువపత్రం కోసం రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ లో చోటుచేసుకుంది. పంచాయతీ కార్యదర్శి ఆ సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ. 25 వేలు లంచం డిమాండ్ చేయగా...చివరకు రూ. 7 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

రూ. 7 వేలకు ఒప్పందం

ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కొండాపూర్ గ్రామానికి చెందిన మాచేపల్లి అప్సర్ కు తన సోదరుడి పేరు మీద ఉన్న ఇల్లు వచ్చింది. దీంతో అప్సర్ ఆ ఇంటికి సంబంధించిన ఓనర్ షిప్ సర్టిఫికెట్ కోసం ఆగష్టు 24న కొండాపూర్ పంచాయతీ కార్యదర్శి షకీల్ ను కలిసి దరఖాస్తు చేసుకున్నారు. ఆ ఇంటిని తన పేరు మీద మార్పు చేయడానికి రూ. 25 వేలు లంచం డిమాండ్ చేశారు. కాగా చివరకు రూ. 7 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అనంతరం బాధితుడు అప్సర్ పంచాయితీ కార్యదర్శి షకీల్ కు ఎంఈవో కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం రూ. 5 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విచారణ అనంతరం పంచాయతీ కార్యదర్శి షకీల్ ను నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ప్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయాలనీ, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ కోరారు.

మెదక్ లో మరో ఘటన

మెదక్ జిల్లా కౌడిపల్లిలో గత వారం రోజుల క్రితం ఆర్టీసీ బస్సులో మాయమైన రూ. 4. 50 లక్షల నగదును పోలీసులు వారం రోజుల్లోనే స్వాధీనం చేసుకున్నారు. సమాచారం మేరకు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం గోపాల్ పేటకు చెందిన మహ్మద్ రఫీ, రెహానా బేగం దంపతులు ఈ నెల 19 న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా షాపూర్ నుంచి కామారెడ్డి డిపోకు చెందిన బస్సులో ప్రయాణిస్తున్నారు. కాగా కౌడిపల్లిలో చూసుకునేసరికి వారి వద్ద ఉన్న డబ్బు సంచి కనపడలేదు.

దీంతో ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కౌడిపల్లి ఎస్ఐ రంజిత్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాడు. అనంతరం సీసీ కెమెరాలు, ఇతర మార్గాల్లో ఆ రోజు బ్యాగ్ తో సహా బస్సులో నుంచి దిగిన మహిళను గుర్తించారు. ఆ తర్వాత వారం రోజులు శ్రమించి ఆ మహిళను పట్టుకొని ఆమె వద్ద నుంచి రూ. 4. 50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత కథనం