Mahindra XUV 3XO: మహీంద్రా ఎక్స్ యూ వీ 3ఎక్స్ఓ డెలివరీలు నేటి నుంచి ప్రారంభం
మహీంద్రా ఎక్స్ యూ వీ 3ఎక్స్ఓ ఎస్ యూ వీలకు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభించింది. బుకింగ్ ల్లో ఈ ఎస్యూవీ రికార్డులు సృష్టించింది. కాగా, ఈ కార్ల డెలివరీని మే 26వ తేదీ నుంచి మహింద్ర ప్రారంభించింది. మహీంద్రా ఎక్స్ యూ వీ 3ఎక్స్ఓ తొమ్మిది వేరియంట్లలో లభిస్తుంది. మొదట 4 వేరియంట్లను డెలివరీ చేస్తున్నారు.
Mahindra XUV 3XO: మహీంద్రా ఎక్స్ యూ వీ 3ఎక్స్ఓ డెలివరీలు ఈ రోజు (మే 26, 2024) ప్రారంభం అయ్యాయి. మే 15న ప్రారంభమైన గంటలోనే ఈ సబ్ కాంపాక్ట్ ఎస్ యూవీకి 50,000 బుకింగ్స్ వచ్చాయని కంపెనీ గతంలో ప్రకటించింది. మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ తొమ్మిది వేరియంట్లలో లభిస్తుంది. బేస్ మోడల్ ధర రూ .7.49 లక్షలుగా నిర్ణయించారు.
తొమ్మిది వేరియంట్లలో మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ
మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3XO) తొమ్మిది వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎం1, ఎం2, ఎం2 ప్రో, ఎం3, ఎం3 ప్రో, ఏఎక్స్5, ఏఎక్స్5 లగ్జరీ, ఏఎక్స్7, ఏఎక్స్7 లగ్జరీ. అయితే, మొదట నాలుగు వేరియంట్లనే డెలివరీ చేస్తున్నారు. అవి ఏఎక్స్ 5, ఏఎక్స్ 5ఎల్, ఎంఎక్స్ 3, ఎంఎక్స్ 3 ప్రో. ఏఎక్స్5 వేరియంట్ ప్రారంభ ధర రూ.10.69 లక్షలు కాగా, ఏఎక్స్5 ఎల్ వేరియంట్ ధర రూ.11.99 లక్షలు. ఎంఎక్స్3, ఎంఎక్స్3 ప్రో వేరియంట్ల ధరలు వరుసగా రూ.9.49 లక్షలు, రూ.9.99 లక్షలుగా ఉన్నాయి.
పెట్రోల్ వేరియంట్లకే డిమాండ్
మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ బుకింగ్స్ సమయంలో వినియోగదారులకు సంబంధించి ఒక కీలక అంశాన్ని మహీంద్ర సంస్థ వెల్లడించింది. మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ బుకింగ్ లలో సుమారు 70 శాతం పెట్రోల్ వేరియంట్లే ఉన్నాయని వెల్లడించింది. మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ ఎస్యూవీని బుక్ చేసుకున్నవారికి సకాలంలో డెలివరీ ఇస్తామని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటో అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ రాజేష్ జెజురికర్ చెప్పారు. సకాలంలో డెలివరీ చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్ ను తీర్చడానికి, మహీంద్రా ఇప్పటికే 10,000 యూనిట్లకు పైగా ఎక్స్ యువి 3ఎక్స్ఓ లను ఉత్పత్తి చేసింది. ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 9,000 యూనిట్లకు పెంచింది.