Kalki 2898 AD Bujji: ప్రభాస్ బుజ్జిని అలా తయారు చేశాం.. ఇంట్రెస్టింగ్ స్టోరీ షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
Kalki 2898 AD Bujji: కల్కి 2898 ఏడీ మూవీ నుంచి ప్రభాస్ వాడే స్పెషల్ వెహికిల్ బుజ్జిని మేకర్స్ లాంచ్ చేసిన విషయం తెలుసు కదా. ఈ బుజ్జి తయారీలో పాలుపంచుకున్న మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
Kalki 2898 AD Bujji: ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీ మూవీ మేకర్స్ తొలిసారి హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో బుధవారం (మే 22) ఓ మెగా ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలుసు కదా. ఇందులో బుజ్జి అనే ఓ రొబోటిక్ కారును లాంచ్ చేశారు. అయితే ఈ వెహికిల్ కు ఈ రూపం తీసుకురావడంలో విజయవంతమైన డైరెక్టర్ నాగ్ అశ్విన్ అండ్ టీమ్ ను కొనియాడుతూ ఆనంద్ మహీంద్రా గురువారం (మే 23) ఓ ట్వీట్ చేశారు.
బుజ్జి తయారీలో మహీంద్రా పాత్ర
బుజ్జి అనే ఈ వెహికిల్ ను కల్కి 2898 ఏడీ మూవీలో ప్రభాస్ వాడాడు. అయితే దీని తయారీ కోసం డైరెక్టర్ నాగ్ అశ్విన్.. మహీంద్రా సాయం తీసుకున్నాడు. గతంలో తనకు అతడు చేసిన ట్వీట్ స్క్రీన్ షాట్, తాజాగా మూవీ టీమ్ రిలీజ్ చేసిన వీడియో పోస్ట్ చేస్తూ ఆనంద్ మహీంద్రా గురువారం తన ఎక్స్ అకౌంట్లో ఓ పోస్ట్ చేశారు. అందులో నాగ్ అశ్విన్ పై ప్రశంసలు కురిపించారు.
"సరదా విషయాలు ఎక్స్ లోనే జరుగుతుంటాయి. గొప్పగా.. నిజానికి ఎంతో గొప్పగా ఆలోచించే నాగ్ అశ్విన్, అతనిలాంటి డైరెక్టర్లను చూసి మేము చాలా గర్విస్తున్నాం. కల్కి టీమ్ ఈ ఫ్యూచరిస్టిక్ వెహికిల్ తయారీలో చెన్నైలో ఉన్న మా మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ సాయం చేసింది. పవర్‌ట్రెయిన్ కాన్ఫిగరేషన్, ఆర్కిటెక్చర్, పర్ఫార్మెన్స్ విషయాల్లో మా టీమ్ సాయం చేసింది" అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
అంతేకాదు ఈ వెహికిల్ రెండు మహీంద్రా ఈ-మోటార్స్ ఆధారంగా నడుస్తుందని కూడా వెల్లడించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఆనంద్ మహీంద్రాకు థ్యాంక్స్ చెబుతూ రిప్లై ఇచ్చాడు. "థ్యాంక్యూ సర్.. అసాధ్యాన్ని కలగనేలా చేసినందుకు.. మా బుజ్జికి తన రెక్కలు (టైర్లు..) ఇచ్చినందుకు.." అని నాగ్ అశ్విన్ ఆ ట్వీట్ లో అన్నాడు.
కల్కి 2898 ఏడీ బుజ్జి
ఏడాది కాలంగా కల్కి టీమ్ ఈ బుజ్జి గురించి టీజ్ చేస్తూ వస్తోంది. ఇంతకుముందు ఈ బుజ్జి మేకింగ్ కు సంబంధించి మూడు వీడియోలు కూడా రిలీజ్ చేశారు. ఫైనల్ గా ఆ బుజ్జి అనే రొబోటిక్ కారును ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాసే ఈ వెహికిల్ నడుపుతూ రావడం విశేషం. బుజ్జి పేరు చిన్నదే అయినా.. తమకు చాలా ప్రత్యేకమని, కల్కి 2898 ఏడీలాంటి మూవీ చేయడం చాలా కష్టమని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అన్నాడు.
"నేను ఇంజినీరింగ్ చేయలేదు. సాయం చేయాలని ఆనంద్ మహీంద్రాకు ట్వీట్ చేశాను. ఆయన తన టీమ్ కు పని అప్పగించారు. వాళ్లు మమ్మల్ని కోయంబత్తూర్ లోని జయం మోటార్స్ కు పంపించారు. అదొక రేసింగ్ కార్ నిర్మించే కంపెనీ. ఇలాంటి ఫీచర్లతో ఉన్న కారును తయారు చేయాలంటే చాలా రీసెర్చ్ అవసరం. అదే మేము ఇక్కడ చేసి చూపించాం. ఈ కారును మెల్లమెల్లగా నిర్మిస్తూ వెళ్లాం. కల్కి, భైరవ కోసమే ఇది. మహీంద్ర, జయం మోటార్స్, టీమ్ కల్కికి నా థ్యాంక్స్" అని నాగ్ అశ్విన్ అన్నాడు.