Karnataka hijab news : 'హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తాము- మీకు నచ్చిన దుస్తులు వేసుకోండి..'
23 December 2023, 6:18 IST
Karnataka hijab news ban : హిజాబ్‌పై నిషేధం మీద కీలక ప్రకటన చేశారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు.
హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తాము..'
Karnataka hijab news : కర్ణాటకలో హిజాబ్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ప్రజలకు ఉందని ఉద్ఘాటించారు.
'మీకు నచ్చిన దుస్తులు వేసుకోండి..'
కర్ణాటకలో హిజాబ్ చుట్టూ తిరిగిన వివాదం గురించి తెలిసిందే! 2022లో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ వేసుకోవడాన్ని నిషేధిస్తూ.. అప్పటి బీజేపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇది ప్రకంపనలే సృష్టించింది. హిజాబ్‌పై నిషేధానికి వ్యతిరేకంగా కర్ణాటక హైకోర్టులో పిటిషన్లు వెల్లువెత్తాయి. అయితే.. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది హైకోర్టు. కచ్చితంగా హిజాబ్ వేసుకోవాలి, ఇస్లాం మతంలో లేదని.. విద్యాసంస్థలు విద్యార్థుల డ్రెస్ కోడ్‌ని నిర్ణయించుకోవచ్చని పేర్కొంది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరుకూ వెళ్లింది. ద్విసభ్య ధర్మాసనం నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. యూనిఫామ్‌ని నిర్ణయించే హక్కు విద్యాసంస్థలకు ఉందని ఒక జడ్జి అభిప్రాయపడగా.. హిజాబ్ వేసుకోవాలా? వద్దా? అనేది ఛాయిస్ అని మరో న్యాయమూర్తి పేర్కొన్నారు.
Hijab ban lifted in Karnataka : ఏది ఏమైనా.. 2022 నుంచి కర్ణాటకలో హిజాబ్‌పై నిషేధం కొనసాగుతూ వచ్చింది. తాజాగా.. మైసూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సిద్ధరామయ్య హిజాబ్‌పై నిషేధం మీద కీలక ప్రకటన చేశారు.
"మీకు నచ్చిన దుస్తులు వేసుకోండి. మీకు నచ్చిన ఆహారం తినండి. నాకు నచ్చింది నేను తింటాను. నేను ధోతీ వేసుకుంటాను. మీరు ప్యాంటు- షర్టు వేసుకోండి. ఇందులో తప్పేముంది? అందుకే హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తున్నాము. మహిళలు హిజాబ్ వేసుకుని ఎక్కడికైనా వెళ్లొచ్చు. గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని అధికారులకు చెప్పాను. మహిళలు.. వారికి నచ్చిన దస్తులు వేసుకోవచ్చు," అని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
Hijab ban in Karnataka : ఈ హిజాబ్ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఆది నుంచే వ్యతిరేకంగా ఉంది. అవసరమైతే నిషేధాన్ని తొలగిస్తామని.. 2023 మేలో అధికారాన్ని చేపట్టిన తర్వాత వెల్లడించింది.