split verdict on hijab ban: హిజాబ్ నిషేధంపై సుప్రీం సంచలన తీర్పు
13 October 2022, 11:09 IST
- split verdict on hijab ban: విద్యా సంస్థల్లో హిజాబ్ నిషేధంపై సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైన తీర్పులు వెలువరించారు. సీనియర్ న్యాయమూర్తితో మరో న్యాయమూర్తి విభేదించారు.
సుప్రీం కోర్టు
split verdict on hijab ban: కర్ణాటకలోని విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధించడంపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం గురువారం భిన్నమైన తీర్పును వెలువరించింది. పాఠశాలల్లో యూనిఫాం అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని ఒక న్యాయమూర్తి తీర్పు ఇవ్వగా, హిజాబ్‌ను నిషేధించలేని ఎంపికగా మరొక న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.
ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదని, యూనిఫాం ఆదేశాన్ని అమలు చేసే అధికారం కర్ణాటక ప్రభుత్వానికి ఉందని మార్చిలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన అన్ని అప్పీళ్లను జస్టిస్ హేమంత్ గుప్తా తన తీర్పులో తోసిపుచ్చారు.
అయితే, జస్టిస్ సుధాన్షు ధులియా ధర్మాసనంలోని సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ గుప్తా తీర్పుతో విభేదించారు. అన్ని అప్పీళ్లను విచారణకు అనుమతించారు. తన తీర్పులోని కార్యాచరణ భాగాన్ని చదివిన జస్టిస్ ధులియా.. హిజాబ్ ధరించడం ఒక ముస్లిం యువతి ఎంపిక విషయమని, దానిపై ఎలాంటి పరిమితి ఉండదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిషేధ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆడపిల్లల విద్యకు సంబంధించిన ఆందోళనలు తన మనస్సును ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయని, హిజాబ్‌పై నిషేధం ఖచ్చితంగా ఆమె జీవితాన్ని మెరుగుపరిచే మార్గంలో అడ్డు వస్తుందని అన్నారు.
భిన్నాభిప్రాయాల దృష్ట్యా విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయడం కోసం ఈ అంశాన్ని భారత ప్రధాన న్యాయమూర్తికి ధర్మాసనం రెఫర్ చేసింది.
ఈ కేసులో గత నెలలో జరిగిన విస్తృత విచారణలో బాలిక విద్యార్థులు, ఇస్లామిక్ సంస్థలు, హక్కుల సంఘాలు, న్యాయవాదులు, కార్యకర్తల తరపున దాదాపు రెండు డజన్ల మంది న్యాయవాదులు పలు అంశాలపై వాదించారు.
హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషనర్లు తమ వాదనల్లో మతాన్ని ఆచరించే హక్కు, భావవ్యక్తీకరణ, దుస్తులు ధరించే స్వేచ్ఛ, విద్యను పొందే హక్కుల గురించి వాదిస్తూ రాష్ట్ర ఆదేశం అసమంజసమైనదని ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వం తమ వాదనలను వినిపిస్తూ యూనిఫాంను అమలు చేయడానికి జారీ చేసిన సర్క్యులర్ ఏకరూపత, క్రమశిక్షణను ప్రోత్సహించడానికి మాత్రమేనని స్పష్టం చేసింది.
విద్యార్థినులు, మహిళా హక్కుల సంఘాలు, ఇస్లామిక్ సంస్థలు, న్యాయవాదుల బ్యాచ్ తరపున సీనియర్ న్యాయవాదులు రాజీవ్ ధావన్, కపిల్ సిబల్, దుష్యంత్ దవే, సల్మాన్ ఖుర్షీద్, హుజేఫా అహ్మదీ, కోలిన్ గోన్సాల్వేస్, మీనాక్షి అరోరా, సంజయ్ హెగ్డే, ఏఎం దార్, దేవదత్ కామత్, జయనా కొఠారీలు వాదించారు.
ఫిబ్రవరి 2022లో కర్నాటక ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వును ప్రాథమిక హక్కులు, ప్రత్యేకించి మతం, సంస్కృతి, గోప్యత, విద్యకు సంబంధించిన హక్కులను ఉల్లంఘించిందని పిటిషనర్లు విన్నవించారు..