Highest number of weekly COVID cases: ఈ దేశాల్లోనే అత్యధికంగా కోవిడ్ కేసులు
24 December 2022, 21:10 IST
Highest number of weekly COVID cases: గత వారం రోజుల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న దేశాల వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసింది. వీటిలో ఈ జాబితాలో టాప్ లో నిలవాల్సిన చైనా లేకపోవడం గమనార్హం.
ప్రతీకాత్మక చిత్రం
Highest number of weekly COVID cases: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతన్నాయి. దాంతో, మరో ప్రాణాంతక కరోనా వేవ్ తప్పదా? అన్న భయాందోళనలు అంతటా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసుల సంఖ్య భారీగా ఉన్న దేశాల వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ(World Health Organisation WHO) వెల్లడించింది.
Highest number of weekly COVID cases: జపాన్ లో అత్యధికం..
WHO తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాలో గత వారం రోజుల్లో 4 లక్షలకు(4,45,424) పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే, గత వారం అత్యధికంగా జపాన్ లో కరోనా కేసులు నమోదయ్యాయి. జపాన్ లో గత వారం 10, 46,650 కేసులు నమోదయ్యాయి. అలాగే, దక్షిణ కొరియాలో 4,59,811 కేసులు, ఫ్రాన్స్ లో 3,41,136 కేసులు, బ్రెజిల్ లో 3,37,810 కేసులు నమోదయ్యాయి. మరణాల విషయానికి వస్తే.. గత వారం రోజుల్లో కోవిడ్ 19 కారణంగా అమెరికాలో 2,658 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, జపాన్ లో1,671, బ్రెజిల్ లో 1,133 మంది, ఫ్రాన్స్ లో 686 మంది, ఇటలీలో 519 మంది చనిపోయారు. ఒక అంచనా ప్రకారం డిసెంబర్ 18 నాటికి, ప్రపంచవ్యాప్తంగా 64.9 కోట్ల కరోనా కేసులు నమోదవగా, 66 లక్షల కరోనా మరణాలు సంభవించాయి.
Highest number of weekly COVID cases: ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా చూస్తే, గతవారం 37 లక్షల కరోనా కేసులు, 10,400 కరోనా మరణాలు నమోదయ్యాయి. అయితే, ఈ గణాంకాల్లో చైనా కు సంబంధించిన వివరాలు లేవు. ప్రస్తుతం చైనా లో కరోనా తీవ్ర స్థాయిలో ఉంది. రోజువారీగా కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య 20 లక్షలకు పైగానే ఉంది. అయితే, కరోనా కేసుల వివరాలను కానీ, మరణాల సంఖ్య ను కానీ చైనా వెల్లడించడం లేదు. కరోనా మరణాలను నిర్ధారించే పేరామీటర్లను కూడా చైనా మార్చింది. తద్వారా కరోనా మరణాల సంఖ్యను తగ్గించాలనుకుంటోంది. వచ్చే 3 నెలల్లో చైనా జనాభాలో కనీసం 60% మందికి కరోనా సోకుతుందని, లక్షల సంఖ్యలో మరణాలుంటాయని ఒక అధ్యయనం వెల్లడించింది.