Nipah virus : నిపా వైరస్ అంటే ఏంటి? వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? కొవిడ్ కన్నా ప్రమాదకరమా?
16 September 2023, 9:20 IST
What is Nipah virus : నిపా వైరస్ లక్షణాలు ఏంటి? ఈ వ్యాధికి చికిత్స ఉందా? కొవిడ్ కన్నా ఈ వ్యాధి ప్రమాదకరమా? వంటి విషయాలను ఇక్కడ తెలుసుకుందాము..
నిపా వైరస్ అంటే ఏంటి? ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి?
What is Nipah virus : కేరళ రాష్ట్రాన్ని నిపా వైరస్ వణికిస్తోంది. ఇప్పటివరకు ఆరు కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యాధి సోకి, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అధికారులు హై అలర్ట్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో.. అసలు ఈ నిపా వైరస్ అంటే ఏంటి? ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? అన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
నిపా వైరస్ అంటే ఏంటి..?
గబ్బిలాలు, పందుల నుంచి మనిషికి వ్యాపించేదే ఈ నిపా వైరస్. కొన్నేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించిన కొవిడ్ తరహాలోనే ఇదీ ఉంటుంది. తొలుత జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. ఆ తర్వాత.. ఈ వ్యాధి మనిషి నుంచి మనిషికి కూడా వ్యాపిస్తుంది.
ఈ నిపా వైరస్‌కు ఇప్పటికీ సరైన చికిత్స లేకపోవడం, వ్యాక్సిన్ సైతం అందుబాటులో లేకపోవడం ఆందోళనకర విషయం.
నిపా వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి..?
Nipah virus symptoms : నిపా వైరస్ లక్షణాలు స్వల్పంగా ఉండొచ్చు. లేదా ప్రాణాంతకంగా కూడా ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెబుతోంది. ఉపిరితిత్తుల్లో స్వల్పంగా సమస్యల నుంచి ప్రమాదకరమైన ఎన్సిఫిలైటిస్ వరకు ఈ వ్యాధి లక్షణాలు ఉన్నాయి. కానీ వ్యాధి ముదిరితే మాత్రం.. ఊపిరి పీల్చుకోవడం కూడా చాలా కష్టమవుతుంది. వ్యాధి తీవ్రత పెరిగిన 24 గంటలు నుంచి 48 గంటల్లో సంబంధిత మనిషి కోమాలోకి జారుకునే ప్రమాదం కూడా ఉందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.
నిపా వైరస్ సోకిన 14 రోజులు- 45 రోజుల మధ్యలో వ్యాధి నయమవుతుంది. ఈ వ్యాధి నుంచి కోలుకున్న వారిలో చాలా మంది ఆరోగ్యంగా ఉంటారు. కానీ 20శాతం మందిలో నరాలకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయని డబ్ల్యూహెచ్ తెలిపింది.
నిపా వైరస్‌కు చికిత్స ఉందా..?
Kerala Nipah virus : ప్రస్తుతానికైతే.. నిపా వైరస్‌కు ప్రత్యేకించి ఎలాంటి చికిత్స లేదు. వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేదు. ఐసీయూలో పెట్టి చికిత్స మాత్రమే అందిస్తారు.
అయితే ఈ వైరస్ తీవ్రత తగ్గించేందుకు మోనోక్లోనల్ యాంటీబాడీ డోసులను వాడుతారు. కేరళలో కేసుల పెరుగుదల నేపథ్యంలో.. ఆస్ట్రేలియా నుంచి వీటిని రప్పించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది.
కొవిడ్ అంత ప్రమాదమా?
కొవిడ్‌తో పోల్చుకుంటే.. నిపా వైరస్ సోకిన వారిలో మరణాల రేటు చాలా ఎక్కువ అని ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికిల్ రీసెర్చ్) చీఫ్ డా. రాజివ్ బల్ తెలిపారు. నిపా వైరస్ మోర్టాలిటీ రేటు 40-70శాతం మధ్యలో ఉంటుందని వెల్లడించారు. కొవిడ్ విషయానికొస్తే అది కేవలం 2-3శాతమని స్పష్టం చేశారు.
కేరళలో తాజా పరిస్థితులు ఇలా..
Nipah virus death toll in Kerala : కేరళలో 2018లో తొలిసారిగా నిపా వైరస్ కలకలం సృష్టించింది. నాడు 21మందిని బలి తీసుకుంది. 2019, 2021లోనూ ఈ ప్రాణాంతక వ్యాధి.. కేరళను ఇబ్బంది పెట్టింది. మళ్లీ ఇప్పుడు.. రాష్ట్రాన్ని వణికిస్తోంది. మరీ ముఖ్యంగా.. కొజికోడ్ జిల్లాలో పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా మారాయి.
ఈ నేపథ్యంలో కొజికోడ్ యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 24 వరకు సెలవును ప్రకటించింది. ఆన్లైన్ క్లాసులు నిర్వహణకు అనుమతులిచ్చింది.
మరోవైపు ఆరుగురు రోగులు కలిసిన, సన్నిహితంగా ఉన్న వారిని ట్రేస్ చేస్తోంది ఆరోగ్య యంత్రాంగం. ఇప్పటివరకు 1080 మందిని గుర్తించినట్టు వెల్లడించింది. వీరిలో 327మంది ఆరోగ్య కార్యకర్తలు ఉన్నట్టు స్పష్టం చేసింది.
నిపా వైరస్ కారణంగా ఆగస్ట్ 30న కేరళలో తొలి మరణం సంభవించింది. సంబంధిత వ్యక్తి అంత్యక్రియల్లో 17మంది పాల్గొన్నారు. వీరందరు ప్రస్తుతం ఐసొలేషన్‌లో ఉన్నారు.
కేరళలో నిపా వ్యాప్తి నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకు కూడా అప్రమత్తమైంది. అత్యవసరమైతేనే.. కేరళకు వెళ్లాలని సూచించింది.