తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  National Herald Case : ఏంటి ఈ నేషనల్​ హెరాల్డ్​ కేసు? గాంధీలను అరెస్ట్​ చేస్తారా?

National Herald case : ఏంటి ఈ నేషనల్​ హెరాల్డ్​ కేసు? గాంధీలను అరెస్ట్​ చేస్తారా?

Sharath Chitturi HT Telugu

14 June 2022, 8:51 IST

google News
    • National Herald case : నెహ్రూ స్థాపించిన నేషనల్​ హెరాల్డ్​ వార్తాపత్రికలో స్కామ్​ జరిగిందా? ఈ స్కామ్​లో సోనియా, రాహుల్​ గాంధీ పాత్ర ఉందా? యంగ్​ ఇండియా ఎలా వచ్చింది? అసలు ఈ నేషనల్​ హెరాల్డ్​ కేసు ఏంటి?
ఏంటి ఈ నేషనల్​ హెరాల్డ్​ కేసు?
ఏంటి ఈ నేషనల్​ హెరాల్డ్​ కేసు? (HT_PRINT)

ఏంటి ఈ నేషనల్​ హెరాల్డ్​ కేసు?

National Herald case : దేశంలో ఇప్పుడు చర్చ అంతా 'నేషనల్​ హెరాల్డ్​ కేసు'పైనే! కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీని ఈడీ దాదాపు 10గంటలు విచారించడం ఈ కేసు తీవ్రతను స్పష్టం చేస్తోంది. త్వరలో.. కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ సైతం.. ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. 

అసలు ఏంటి ఈ నేషనల్​ హెరాల్డ్​ కేసు? గాంధీలకు ఈ కేసుతో సంబంధం ఏంటి?

నేషనల్​ హెరాల్డ్​ అంటే ఏంటి?

బ్రిటీష్​ రాజ్యంపై యుద్ధం కోసం 1938లో స్థాపించిన వార్తాపత్రికే ఈ నేషనల్​ హెరాల్డ్​. నాటి కాంగ్రెస్​ అధ్యక్షుడు జవహర్​లాల్​ నెహ్రూ.. ఈ పత్రికను ప్రారంభించారు. ఏజేఎల్​(అసోసియేటెడ్​ జర్నల్స్​ లిమిటెడ్​).. నేషనల్​ హెరాల్డ్​ పత్రికలను ప్రచురించేది.

ఈ నేషనల్​ హెరాల్డ్​ వార్తాపత్రికలో 5వేల మంది స్వాతంత్ర్య సమరయోధులు షేరుహోల్డర్లుగా ఉండేవారు.

స్వాతంత్ర్యం తర్వాత.. ఈ నేషనల్​ హెరాల్డ్​ను కాంగ్రెస్​ అన్ని విధాలుగా ఉపయోగించుకునేది. అనంతరం.. ఉర్దూ(కౌమి అవాజ్​), హిందీ(నవ్​జీవన్​)లోనూ నేషనల్​ హెరాల్డ్​ ఎదిగింది.

దేశానికి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. నేషనల్​ హెరాల్డ్​ ఛైర్మన్​ పదవి నుంచి నెహ్రూ తప్పుకున్నారు.

క్రమంగా.. దేశంలో నేషనల్​ హెరాల్డ్​ ఉనికి కోల్పోతూ వచ్చింది. చివరికి 2008లో.. ఈ వార్తాపత్రిక మూతపడింది. అప్పటికే ఆ సంస్థకు రూ. 90.25కోట్ల అప్పులు ఉన్నాయి. అయితే.. అప్పులను తొలగించేందుకు.. కాంగ్రెస్​ పార్టీ.. నేషనల్​ హెరాల్డ్​కు రూ. 90.25కోట్లు ఇచ్చింది. అది కూడా రుణ రహిత అప్పులు ఇచ్చింది.

యంగ్​ ఇండియా లిమిటెడ్​ ఏంటి?

Rahul Gandhi ED case : 2009లో యూపీఏ మరోమారు అధికారంలోకి వచ్చింది. 2010లో.. యంగ్​ ఇండియా పేరుతో దేశంలో ఓ ఎన్​జీఓ ఆవిర్భవించింది.

ఈ యంగ్​ ఇండియాకు.. కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ డైరక్టర్​గా ఉండేవారు. ఆయనతో పాటు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఇతర నేతలు మోతీలాల్​ వోరా, ఆస్కర్​ ఫెర్నాండేజ్​లు షేర్​హోల్డర్ బాధ్యతలు తీసుకున్నారు.

2010లో ఏజేఎల్​కు 1,057మంది షేర్​హోల్డర్లు ఉండేవారు. 2011లో ఒక్కసారిగా.. ఏజేఎల్​కు చెందిన అన్ని హోల్డింగ్స్​ను యంగ్​ ఇండియాకు బదిలీ చేసేశారు.

ఏజేఎల్​.. యంగ్​ ఇండియాలో చేరింది. రూ. 90,25కోట్ల రుణం బదులు.. రూ. 50లక్షలను యంగ్​ ఇండియాకు చెల్లించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్​ హెరాల్డ్​ ఆస్తులన్నీ యంగ్​ ఇండియా వశమయ్యాయి.

నేషనల్​ హెరాల్డ్​ స్కామ్​..!

నేషనల్​ హెరాల్డ్​ వ్యవహారంపై 2012లో ఢిల్లీ ట్రయల్​ కోర్టులో పిటిషన్​ వేశారు న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి. ఆ తర్వాత.. ఆయన 2013లో బీజేపీలో చేరారు.

నేషనల్​ హెరాల్డ్​ విషయంలో పెద్ద స్కామ్​ జరిగిందని, దీనితో సోనియా గాంధీ, రాహుల్​ గాంధీలకు సంబంధం ఉందని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు.

ఆరోపణలు ఇవే..

యంగ్​ ఇండియా షేర్​ క్యాపిటల్​ రూ. 5లక్షలుగా ఉండేది. కానీ కోల్​కతాకు చెందిన షెల్​ కంపెనీ డోటెక్స్​ మెర్చెండైజ్​ నుంచి రూ. 1కోటి అప్పు తీసుకుంది. అందులో నుంచి రూ. 50లక్షలు తీసి.. కాంగ్రెస్​కు ఇచ్చింది.

National Herald scandal : ఆ తర్వాత.. ఏజేఎల్​ను యంగ్​ ఇండియా తన సొంతం చేసుకుంది. ఢిల్లీలోని కీలక రియల్​ ఎస్టేట్​ ఆస్తుల సహా మరిన్ని నగరాల్లోని నేషనల్​ హెరాల్డ్​ అస్తులు యంగ్​ ఇండియా చేతికి వెళ్లాయి. వీటి విలువ రూ. 2వేల కోట్లు పైమాటే!

కొంత కాలం తర్వాత.. నేషనల్​ హెరాల్డ్​కు ఇచ్చిన రూ. 90.25కోట్ల అప్పును కాంగ్రెస్​ మాఫీ చేసింది. అప్పటికే కాంగ్రెస్​ చేతిలో యంగ్​ ఇండియా ఇచ్చిన రూ. 50లక్షలు ఉన్నాయి.

ఎలాంటి వాణిజ్యపరమైన కార్యకలాపాలు లేని యంగ్​ ఇండియాకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా రూ. 800కోట్లు ఆస్తులు ఉన్నాయి. అప్పుల రూపంలో కాంగ్రెస్​కు రూ. 90.25కోట్లు రావాల్సి ఉండగా.. కేవలం రూ. 50లక్షలే తీసుకుంది.

కాంగ్రెస్​ ఇచ్చిన రూ. 90.25కోట్లు అప్పులు కూడా అక్రమమే అని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. పార్టీ ఫండ్​లో నుంచి డబ్బులు తీసి నేషనల్​ హెరాల్డ్​కు ఇచ్చినట్టు చెప్పారు. ఇది ఐటీ చట్టాలకు వ్యతిరేకమని అన్నారు.

కాంగ్రెస్​ వాదన..

Congress protest against ED : ఈ పూర్తి వ్యవహారంలో తాము ఎలాంటి తప్పు చేయలేదని కాంగ్రెస్​ చెబుతోంది. రుణాలు తీసుకోకుండా అప్పులు ఇవ్వడంతో రూ. 90.25కోట్లు న్యాయపరమైనదేనని అంటోంది. ఏజేఎల్​.. కాంగ్రెస్​కు చెందినదేనని, ఆ సంస్థను ఆదుకోవడం తమ పార్టీ బాధ్యతని స్పష్టం చేసింది. యంగ్​ ఇండియాను చారిటీ కోసం ఏర్పాటు చేసినట్టు, లాభాల కోసం కాదని తేల్చిచెప్పింది.

గాంధీల పరిస్థితేంటి?

నేషనల్​ హెరాల్డ్​ వ్యవహారంలో మనీలాండరింగ్​, స్కామ్​ జరిగాయా? అన్నది కోర్టులు తేల్చుతాయి. కానీ.. ఈలోపు కాంగ్రెస్​ పార్టీ ప్రతిష్ఠ మరింత దెబ్బతినే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్​ ఓ అవినీతి పార్టీ అని బీజేపీ ముద్రవేసి.. ప్రజల్లోకి వెళుతోందని గుర్తుచేస్తున్నారు. ఈ సమయంలో నేషనల్​ హెరాల్డ్​ వ్యవహారంతో కాంగ్రెస్​కు తలనొప్పి తప్పదని అంటున్నారు.

గతకొన్నేళ్లుగా కాంగ్రెస్​ పార్టీ డీలా పడింది. ఎన్నికల్లో వరుస ఓటములను చవిచూస్తోంది. పార్టీ పునరుద్ధరణ కోసం ఇటీవలే భారీ ప్రణాళికలు రచించింది. వాటిని అమలు చేసేందుకు సిద్ధపడుతోంది. ఈ పరిణామాల మధ్యే.. నేషనల్​ హెరాల్డ్​ కేసు మళ్లీ తెరపైకి రావడం గమనార్హం.

తదుపరి వ్యాసం