తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rahul Gandhi At Ed : ఈడీ కార్యాలయానికి రాహుల్ గాంధీ

Rahul Gandhi at ED : ఈడీ కార్యాలయానికి రాహుల్ గాంధీ

HT Telugu Desk HT Telugu

13 June 2022, 12:17 IST

google News
    •  నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆయన వెంట తన సోదరి, పార్టీ అధినేత్రి ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు.
చుట్టూ కార్యకర్తలు వెంటరాగా ఈడీ కార్యాలయానికి వెళుతున్న రాహుల్ గాంధీ
చుట్టూ కార్యకర్తలు వెంటరాగా ఈడీ కార్యాలయానికి వెళుతున్న రాహుల్ గాంధీ (HT_PRINT)

చుట్టూ కార్యకర్తలు వెంటరాగా ఈడీ కార్యాలయానికి వెళుతున్న రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ, జూన్ 13: పార్టీ ప్రధాన కార్యాలయం నుండి వందలాది మంది పార్టీ కార్యకర్తలు వెంట రాగా రాహుల్ గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరు కావడానికి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. కాగా కాంగ్రెస్ ర్యాలీకి ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ర్యాలీకి అనుమతి నిరాకరించడం వెనుక శాంతిభద్రతలను ఢిల్లీ పోలీసులు ఉదహరించారు.

రాహుల్ గాంధీ నివాసం వెలుపల పోలీసులు మోహరించారు. దేశ రాజధానిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం వెలుపల కూడా అదనపు భద్రతా బలగాలను మోహరించారు.

సోమవారం తెల్లవారుజామున కాంగ్రెస్ కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకుని రాహుల్ గాంధీకి మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో 'రాహుల్ గాంధీ జిందాబాద్, జిందాబాద్' అంటూ నినదించారు.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు పార్టీ ప్రధాన కార్యాలయం దగ్గరే నిర్బంధించారు.

కాంగ్రెస్ పార్టీ నిరసనలకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ పార్టీ 'సత్యాగ్రహ' మార్చ్ కొనసాగుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా తెలిపారు. దేశ రాజధానిలో కాంగ్రెస్ తన ‘సత్యాగ్రహ మార్చ్’ నిర్వహించడానికి అనుమతి నిరాకరించినందుకు కేంద్రాన్ని తప్పుపట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మొత్తం సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో అప్రకటిత ఎమర్జెన్సీ విధించిందని అన్నారు. 

‘రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈడీ కార్యాలయం వరకు శాంతియుతంగా నిరసన కవాతు నిర్వహిస్తాం. మేం రాజ్యాంగ పరిరక్షకులం.. తలవంచబోం.. భయపడబోం.. కేంద్రం భారీ పోలీసు బలగాలను మోహరించింది. మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ వల్ల షేక్ అయ్యిందని నిరూపితమైంది..’ అని సూర్జేవాలా అన్నారు.

కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఏఎన్ఐతో మాట్లాడుతూ తమ పార్టీ నాయకత్వానికి సంఘీభావం తెలిపేందుకు, ఈడీ అధికారన దుర్వినియోగాన్ని దేశానికి చూపించడానికి భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి పార్టీ నేతలు దేశ రాజధానికి ఇక్కడకు వచ్చారని అన్నారు.

‘ఈడీ అధికార దుర్వినియోగాన్ని దేశానికి చూపించడానికి మేం భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చాం. ఈడీ అన్ని కేసులు బూటకమైనవి. ఈడీ నుంచి నాకు చాలా నోటీసులు వచ్చాయి..’ అని చిదంబరం అన్నారు.

శాంతియుత నిరసనలను కాంగ్రెస్ విశ్వసిస్తుందని, బీజేపీ తరహా అల్లర్లను ప్రేరేపించదని అధిర్ రంజన్ చౌదరి అన్నారు.

‘మేం కలిసి వెళ్లాలనుకుంటున్నాం. ఇది నేరం కాదు. వారు ఉద్దేశపూర్వకంగా మాకు అనుమతి ఇవ్వడం లేదు. మమ్మల్ని అనుమతించమని మేం అమిత్ షాను కోరాం. కానీ ప్రయోజనం లేదు. మేం శాంతియుత నిరసనను విశ్వసిస్తాం. బీజేపీ తరహాలో అల్లర్లను ప్రేరేపించడం లేదు’ అని ఆయన అన్నారు.

ఢిల్లీలో ఉన్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా మాట్లాడుతూ.. ‘కేంద్ర సంస్థల దుర్వినియోగానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహించడంలో తప్పు ఏమిటి?’ అని అన్నారు.

కాగా, జూన్ 13న విచారణలో పాల్గొనాల్సిందిగా రాహుల్ గాంధీకి సమన్లు ​​అందాయి. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి జూన్ 23న విచారణకు హాజరు కావాలని సోనియా గాంధీకి ఈడీ శుక్రవారం తాజాగా సమన్లు ​​జారీ చేసింది.

ఇది ‘రాజకీయ ప్రతీకారం’ అని, ఈ కేసు దర్యాప్తుకు ఎటువంటి ఆధారాలు లేవని కాంగ్రెస్ ఆరోపించింది.

నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ విచారణకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ కోశాధికారి పవన్ బన్సాల్‌లను ఈ ఏడాది ఏప్రిల్‌లో న్యూఢిల్లీలో ఈడీ ప్రశ్నించింది.

మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కాంగ్రెస్ నేతలిద్దరి వాంగ్మూలాలను ఏజెన్సీ నమోదు చేసింది. నేషనల్ హెరాల్డ్‌ను అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) ప్రచురించింది. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ (వైఐఎల్) యాజమాన్యంలో ఉంది. ఖర్గే వైఐఎల్ సీఈఓగా ఉండగా, బన్సాల్ ఏజేఎల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు.

ప్రస్తుతం వాటాల విధానం, ఆర్థిక లావాదేవీలతో పాటు ఏజేఎల్, వైఐఎల్ కార్యకలాపాల్లో పార్టీ నేతల పాత్రను పరిశీలిస్తోంది.

వైఐఎల్ ప్రమోటర్లలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉన్నారు.

తదుపరి వ్యాసం