Rahul Gandhi ED case : 10గంటల పాటు విచారణ.. నేడు కూడా..!
Rahul Gandhi ED case : రాహుల్ గాంధీని సోమవారం.. 10గంటల పాటు విచారించింది ఈడీ. నేషనల్ హెరాల్డ్ కేసులో మంగళవారం కూడా విచారణకు హాజరుకావాలని ఈడీ చెప్పినట్టు తెలుస్తోంది.
Rahul Gandhi ED case : నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని.. సోమవారం 10గంటలకుపైగా విచారించింది ఈడీ. మంగళవారం కూడా విచారణహకు హాజరు కావాలని ఈడీ అధికారులు.. రాహుల్కు చెప్పినట్టు సమాచారం.
దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టిన కాంగ్రెస్.. రాహుల్కు మద్దతుగా నిలిచింది. సోమవారం ఉదయం.. భారీ ర్యాలీతో రాహుల్ గాంధీ.. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. సీనియర్ నేతలతో పాటు పార్టీ కార్యకర్తలు.. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, రాహుల్కు అండగా నిలిచారు. కాగా.. కాంగ్రెస్ నిరసనలకు ఢిల్లీ పోలీసులు అనుమతివ్వలేదు. ఈ క్రమంలోనే పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. పోలీసుల చర్యలతో పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలకు గాయాలైనట్టు సమాచారం.
ఇక ఉదయం 11గంటలకు ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లిన రాహుల్ గాంధీ.. బయటకు వచ్చేసరికి రాత్రి 11గంటలు దాటింది! మధ్యలో 80 నిమిషాల లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఈ సమయంలో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని రాహుల్ కలిసినట్టు తెలుస్తోంది.
రాహుల్ గాంధీపై ఈడీ విచారణ నేపథ్యంలో కేంద్రంపై మండిపడింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ విద్వేష రాజకీయాల్లో ఇదొక భాగమని విరుచుకుపడింది. కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. చట్టానికి ఎవరూ అతీతం కాదని, విచారణ జరగాలని తేల్చిచెప్పింది.
ఇదీ కేసు..
National Herald case : నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ఏజేఎల్(అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్) అనే సంస్థ పబ్లీష్ చేసేది. కాగా.. నేషనల్ హెరాల్డ్ మాతృసంస్థగా యంగ్ ఇండియా వ్యవహరించింది. ఈ యంగ్ ఇండియాకు సోనియా, రాహుల్ గాంధీలు ప్రమోటర్లుగా ఉన్నారు. యంగ్ ఇండియాలో వీరికి 76శాతం వాటా ఉన్నట్టు తెలుస్తోంది.
యంగ్ ఇండియాలో భారీ ఆర్థిక అవకతవకలు జరిగినట్టు, ఇందులో సోనియా, రాహుల్ పాత్రలు ఉన్నట్టు ఈడీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీని విచారించింది.
కాంగ్రెస్ అధ్యక్షురాలిని కూడా ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని పిలుపునిచ్చింది ఈడీ.
సంబంధిత కథనం