CONGRESS | రాహుల్‌కు మద్దతుగా భారీ బల ప్రదర్శన
08 June 2022, 19:49 IST
కాంగ్రెస్ పార్టీ భారీ బల ప్రదర్శనకు సిద్దమవుతోంది. ఈ నెల 13న ఢిల్లీలో పెద్ద ఎత్తున బల ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించింది. ఆ రోజు ఉదయమే ఢిల్లీ చేరుకోవాలని ముఖ్య కాంగ్రెస్ నేతలకు ఆదేశాలు వెళ్లాయి.
రాహుల్ గాంధీ(ఫైల్ ఫొటో)
`నేషనల్ హెరాల్డ్` కేసులో ఈ సోమవారం,జూన్ 13న, కాంగ్రెస్ మాజీ చీఫ్, పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరుకానున్నారు. `నేషనల్ హెరాల్డ్`కు సంబంధించిన అక్రమ ఆర్థిక లావాదేవీలపై ఈడీ రాహుల్‌ను ప్రశ్నించనుంది. ఇదే కేసులో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి కూడా ఈడీ నోటీసులు పంపించింది. కానీ ఆమెకు కరోనా సోకడంతో ఈడీ ముందు హాజరయ్యేందుకు సమయం కోరారు.
భారీ బల ప్రదర్శన
పార్టీ సీనియర్ నేతలు సోనియా, రాహుల్‌లకు ఈడీ నోటీసులు పంపించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది. కేంద్రం కక్ష సాధింపు చర్యల్లో భాగమే ఈ నోటీసులని ఆరోపిస్తోంది. `ఈడీ ఆఫీస్ కాదు.. అది బీజేపీ ఆఫీస్` అని వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తోంది. కాగా, ఈ 13న రాహుల్ ఈడీ ముందు హాజరయ్యే రోజు ఢిల్లీలో ఈడీ తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. సోమవారం ఉదయం అక్బర్ రోడ్‌లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం నుంచి ఏపీజే అబ్దుల్ కలాం రోడ్ లోని ఈడీ ఆఫీస్ వరకు పార్టీ ఎంపీలు, సీనియర్ నేతలు పాదయాత్ర చేపట్టి, నిరసన తెలపనున్నారు. జూన్ రెండవ తేదీననే రాహుల్ ఈడీ ముందు హాజరు కావాల్సి ఉండగా, తాను విదేశాల్లో ఉన్నానని, సమయం కావాలని రాహుల్ కోరడంతో ఆ తేదీని జూన్ 13కి ఈడీ వాయిదా వేసింది.
ఎంపీలు, సీనియర్లు
పార్టీ ఎంపీలు, సీనియర్ నేతలు, ఢిల్లీలోని కార్యకర్తలు ఈ భారీ బల ప్రదర్శనలో పాల్గొంటారని కాంగ్రెస్ వెల్లడించింది. ఈ మేరకు పార్టీ లోక్‌సభ, రాజ్య సభ సభ్యులకు, సీనియర్ నాయకులకు ఇప్పటికే సమాచారం ఇచ్చామని తెలిపింది. సోమవారం ఉదయం 9 గంటల వరకు అంతా పార్టీ ప్రధాన కార్యాలయం వద్దకు చేరకోవాలని కాంగ్రెస్ వారిని ఆదేశించింది. అలాగే, గురువారం సాయంత్రం పార్టీ ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల ఇన్‌చార్జ్‌లు, పీసీసీ అధ్యక్షులు వర్చువల్‌గా సమావేశమై, రాహుల్, సోనియాలకు ఈడీ నోటీసులపై నిరసన తెలిపే ప్రణాళికపై చర్చిస్తారు. ఢిల్లీలోనే కాకుండా, రాష్ట్రాల రాజధానుల్లో, ప్రధాన నగరాలు, పట్టణాల్లో కూడా ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా నిరసన దీక్షలు చేపట్టాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటారు.