IMD alert : భారీ వర్షాల కారణంగా స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం- ఐఎండీ రెడ్ అలర్ట్..
08 July 2024, 8:10 IST
Rain alert today : దేశంలోని అనేక రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్, ఇంకొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఐఎండీ రెయిన్ అలర్ట్!
దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా పగటిపూట భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని గోవాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ (ఐఎండీ). రాష్ట్రంలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు అన్ని పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రజలు సైతం జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మరోవైపు పశ్చిమ బెంగాల్, సిక్కిం, అసోం, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. ఇంకొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది.
ఉత్తరాఖండ్‌లోని కొండలు, మైదాన ప్రాంతాల్లో జూలై 8/9 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. జూలై 10న తెహ్రీ, పౌరి, బాగేశ్వర్, అల్మోరా, నైనిటాల్, చంపావత్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ బులెటిన్‌లో పేర్కొంది.
వాయువ్య, మధ్య భారతంలో ఇలా..
వాయువ్య, మధ్య భారతదేశంలో ఉరుములు, మెరుపులతో కూడిన విస్తృతమైన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షపాం నమోదవుతుంది ఐఎండీ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్, హరియాణా, దిల్లీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లో జూలై 12 వరకు ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి.
జూలై 8న బీహార్, ఒడిశా, జూలై 11న అరుణాచల్ ప్రదేశ్, జూలై 10, 11 తేదీల్లో అస్సాం, మేఘాలయలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జూలై 11 వరకు నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
జూలై 7 నాటి వాతావరణ బులెటిన్ ప్రకారం, "జూలై 9-జూలై 11 మధ్య కొంకణ్ - గోవా, మధ్య మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూలై 9న గుజరాత్ రీజియన్, కేరళ & మాహేలో జూలై 8; జూలై 8,9 తేదీల్లో తెలంగాణ, జూలై 9న కోస్తా కర్ణాటక, జూలై 10 వరకు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక జూలై 8 నుంచి 10 వరకు వర్షాలు కురుస్తాయి.
“అక్కడక్కడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది... మధ్య మహారాష్ట్రలోని ఘాట్ ప్రాంతాలు.. జూలై 8; జూలై 8న కొంకణ్, గోవా; కోస్తా కర్ణాటకలో.. జూలై 8, 10, 11 తేదీల్లో వర్షాలు కురుస్తాయి,” అని ఐఎండీ తెలిపింది.
అసోంలో వరదలు..
మరోవైపు భారీ వర్షాలకు అసోం అల్లాడిపోతోంది. వరద కారణంగా అనేక గ్రామాలు నీటమునిగాయి. 3వేలకుపైగా గ్రామాలకు రవాణా వ్యవస్థ దెబ్బతింది. అసోం వరదలకు ఇప్పటికే 58మంది మరణించారు. 23లక్షల మందిపై వరదల ప్రభావం పడింది. లక్షలాది పంట పొలాలు నీటిలో మునిగిపోయాయి. పలు నదులు ప్రమాదస్థాయి కన్నా ఎక్కువగా ప్రవహిస్తూ భయపెడుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.