Australia Visa : ఆస్ట్రేలియాలో చదువు, ఉద్యోగానికి ప్లాన్ చేస్తున్న భారతీయులకు గుడ్ న్యూస్!
30 September 2024, 12:11 IST
Australia working holiday visa : అక్టోబర్ 1 నుంచి భారత పౌరులకు ఏటా 1,000 వర్క్- హాలిడే వీసాలను ఆస్ట్రేలియా జారీ చేయనుంది. అర్హులైన వారు ఆస్ట్రేలియాలో 12 నెలల పాటు పనిచేయవచ్చు, చదువుకోవచ్చు, ట్రావెల్ చేయవచ్చు. అవసరమైనప్పుడుల్లా దేశం బయటకు వెళ్లి తిరిగి రావొచ్చు. పూర్తి వివరాలు..
ఆస్ట్రేలియా వర్క్ అండ్ హాలీడే వీసా వివరాలు..
ఆస్ట్రేలియాలో చదువుకోవాలని లేదా ఉద్యోగం చేయాలని ప్లాన్ చేస్తున్న భారతీయులకు గుడ్ న్యూస్! ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడానికి ఉద్దేశించిన ఆస్ట్రేలియా-ఇండియా ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ (ఏఐ-ఈసీటీఏ) ప్రకారం అక్టోబర్ 1 నుంచి భారత పౌరులకు ఏటా 1000 వర్క్, హాలిడే వీసాలను ఆస్ట్రేలియా అందించనుంది.
“భారత్-ఆస్ట్రేలియా ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ కింద కీలకమైన వర్క్ అండ్ హాలిడే వీసా 2024 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఇది మొబిలిటీని సులభతరం చేస్తుంది. ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది,” అని సందర్భంగా భారత దేశ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.
అస్ట్రేలియా వర్క్ అండ్ హాలిడే వీసా అంటే ఏమిటి?
వర్క్ అండ్ హాలిడే వీసా ద్వారా 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న భారతీయులు 12 నెలల పాటు ఆస్ట్రేలియాలో నివసించవచ్చు! ఈ ఆస్ట్రేలియా వీసా గ్రహీతలు నాలుగు నెలల వరకు చదువుకోవడానికి, వారు ఉన్న సమయంలో అనేకసార్లు దేశం విడిచి తిరిగి వెళ్లడానికి అనుమతిస్తుంది. ఉద్యోగం కూడా చేసుకోవచ్చు. ట్రావెలింగ్ కూడా చేయవచ్చు. దీని ధర 650 డాలర్లు. అంటే సుమారు రూ.36,748.
ఇదీ చూడండి:- DA hike news : డీఏ పెంపుపై కేంద్రం ఎప్పుడు ప్రకటన చేస్తుంది? ఈసారి ఎంత హైక్ ఉంటుంది?
ఈ ఆస్ట్రేలియా వీసాకు ఎవరు అర్హులు?
వీసాకు అర్హత సాధించడానికి, భారతీయ పౌరులు ఈ కింది ప్రమాణాలను కలిగి ఉండాలి..
1. చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్. జాతీయ గుర్తింపు కార్డులో 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలి.
2. అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానున్న వీసా బ్యాలెట్లకు 25 డాలర్ల (రూ.1,500) రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.
ఆస్ట్రేలియా వర్క్ అండ్ హాలిడే వీసాకు బ్యాలెట్ ప్రక్రియ ఏంటి?
వర్క్ అండ్ హాలిడే వీసా బ్యాలెట్ విధానంలో పనిచేస్తుంది. ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ మాట్లాడుతూ.. ప్రతి ఏడాది పాల్గొనే ప్రతి దేశానికి వార్షిక బ్యాలెట్ ప్రక్రియను నిర్వహిస్తామని తెలిపింది. బ్యాలెట్లలో పాల్గొనే ప్రతి దేశానికి వేర్వేరు రిజిస్ట్రేషన్, సెలెక్షన్ ఓపెన్ పీరియడ్లు ఉండవచ్చని స్పష్టం చేసింది.
అర్హత కలిగిన భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లు తమ ఇమ్మిఅకౌంట్లో 'న్యూ అప్లికేషన్' కింద 'వీసా ప్రీ-అప్లికేషన్ రిజిస్ట్రేషన్' ఫారాన్ని పూర్తి చేయడం ద్వారా నమోదు చేసుకోవచ్చు.
బ్యాలెట్ ప్రక్రియ ద్వారా ఎంపిక అయితే ఏమవుతుంది?
మీ రిజిస్ట్రేషన్ ఎంపికైతే, ఇమ్మియాక్కౌంట్ ద్వారా వీసా కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయమని ఆహ్వానిస్తూ మీకు ఇమెయిల్ ద్వారా 'నోటిఫికేషన్ ఆఫ్ సెలక్షన్' లెటర్ వస్తుంది. మీరు ఎంపికైతే, వర్క్ అండ్ హాలిడే వీసా కోసం దరఖాస్తు చేయడానికి మీకు 28 క్యాలెండర్ రోజుల సమయం ఉంటుంది.
ఆస్ట్రేలియాలో చదువుకోవడానికి లేదా వర్క్ చేయడానికి వెళుతున్న భారతీయుల సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త వర్క్ అండ్ హాలీడే వీసాను ఆస్ట్రేలియా ప్రవేశపెట్టడంతో భారతీయులకు లబ్ధిచేకూరే అవకాశం ఉంది.