Visa To Heaven Controversy : స్వర్గానికి వెళ్లాలనుకునేవారు సంస్కృత భాష నేర్చుకోవాలి.. స్వామీజీ కామెంట్స్ వైరల్
02 September 2024, 19:10 IST
- Visa To Heaven Controversy In Udupi : స్వర్గానికి వెళ్లాలనుకునే వారు సంస్కృత భాష నేర్చుకోవాలని కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి శ్రీకృష్ణ మఠానికి చెందిన శ్రీసుగుణేంద్ర తీర్థ స్వామీజీ అన్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. స్వామీజీ ప్రసంగ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ
'స్వర్గానికి వెళ్లాలి అంటే సంస్కృత భాష తెలుసుకోవాలి. లేకపోతే స్వర్గానికి వీసా రాదు. సంస్కృత భాష నేర్చుకోవాలి.' అని కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి శ్రీకృష్ణ మఠం పర్యాయ పీఠాధిపతి శ్రీ పుత్తిగె మఠం శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ అన్నారు. ఆయన చేసిన ఈ ప్రకటన ఇప్పుడు విమర్శల పాలవడంతో పాటు చర్చనీయాంశమైంది.
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉడుపి శ్రీకృష్ణ మఠంలో నెల రోజుల పాటు నిర్వహిస్తున్న శ్రీకృష్ణ మాసోత్సవ ముగింపు కార్యక్రమంలో శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణ మఠంలోని రాజభవనంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా కేరళ గవర్నర్ హాజరయ్యారు.
స్వామీజీ చేసిన వ్యాఖ్యలు ఏంటి?
కార్యక్రమం ముగింపు సందర్భంగా సంస్కృతంలో శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ప్రసంగించారు. అన్ని భాషలకు మూలాధారం సంస్కృతం అన్నారు. సంస్కృతం.. ఆంగ్ల భాష, దాని సంబంధిత భాషలకు మూలమని చెప్పారు. 'కన్నడ కర్ణాటక భాష, హిందీ భారతదేశ భాష. ఇంగ్లీష్ ఒక అంతర్జాతీయ భాష. కమ్యూనికేషన్ కోసం ఇవన్నీ అవసరం. అదేవిధంగా సంస్కృతం దైవ భాష. దివ్యలోకంలో వ్యవహరించాలంటే సంస్కృత భాష కావాలి. అందువల్ల స్వర్గానికి వెళ్లాలనుకునే వారు అక్కడ వ్యవహరించేందుకు సంస్కృత భాష నేర్చుకోవాలి. సంస్కృతం స్వర్గానికి వీసా.' అని స్వామీజీ చెప్పారు.
శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సంస్కృతం తెలిసిన వారు ఇంకా ఈ నరకంలో ఎందుకు ఉండాలి. స్వర్గానికి వెళ్ళగలరా అని సోషల్ మీడియాలో ఒక వ్యక్తి ప్రశ్నించాడు.
'నాకు 67 సంవత్సరాలు, ఇంకా సంస్కృతం నేర్చుకోలేకపోతున్నాను, కాబట్టి నాకు స్వర్గం రాదు, నాకు అది వద్దు, రాంబా, ఊర్వసి, మేనక ఎంతో మందికి సేవ చేశారు? వారు నా నుండి కొంచెం విశ్రాంతి తీసుకోనివ్వండి. చిన్నప్పుడు గేదెను మేపుతూ దాని మీద స్వారీ చేశాను. దాని తోక పట్టుకుని ఈత నేర్చుకుంటే.. నరకంలో యమ కోనేరు వస్తుందా!?' అని మరోవ్యక్తి అడిగాడు.
ఇది చాలా దారుణమైన ప్రకటన.. స్వర్గానికి భాషకు సంబంధం ఏమిటి? అని మరికొందరు అంటున్నారు. స్వర్గం, నరకం ఉనికిని ఎవరు చూశారు? అని ప్రశ్నిస్తున్నారు.
'తుమకూరులోని సిద్ధగంగా మఠంలో సంస్కృతం నేర్చుకున్నందున స్వర్గానికి వెళ్లేందుకు అర్హత సాధించాను. సంస్కృతం నేర్చుకోని నా తల్లిదండ్రులకు, బంధువులకు ఆ స్వర్గం అక్కర్లేదని నేను నిరాకరిస్తున్నాను.' అని మరోవ్యక్తి వ్యాఖ్యానించాడు.
వీసా టు హెవెన్ మీద ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. స్వామీజీ చేసిన కామెంట్స్‌ను కొందరు సమర్థిస్తుంటే.. మరికొందరేమో విమర్శిస్తున్నారు.