తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Japan Earthquake Tsunami : వరుసగా 21 భూకంపాలు.. ఆ తర్వాత సునామీ- అల్లకల్లోలంగా జపాన్​!

Japan earthquake Tsunami : వరుసగా 21 భూకంపాలు.. ఆ తర్వాత సునామీ- అల్లకల్లోలంగా జపాన్​!

Sharath Chitturi HT Telugu

01 January 2024, 17:16 IST

google News
    • Japan earthquake today : వరుస భూకంపాలతో జపాన్​ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఆ వెంటనే.. సునామీ తీర ప్రాంతాలను తాకింది. అక్కడి పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది.
వరుసగా 21 భూకంపాలు.. ఆ తర్వాత సునామీ!
వరుసగా 21 భూకంపాలు.. ఆ తర్వాత సునామీ! (AFP)

వరుసగా 21 భూకంపాలు.. ఆ తర్వాత సునామీ!

Japan earthquake today : 2024 నూతన ఏడాది తొలి రోజు జపాన్​కు ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోనుంది. ఆ దేశ నార్త్​ సెంట్రల్​ ప్రాంతంలో సోమవారం.. 21 భూకంపాలు సంభవించాయి. ఇవన్నీ 90 నిమిషాల వ్యవధిలో నమోదవ్వడం గమనార్హం. అనంతరం.. అనేక తీర ప్రాంతాలను సునామీ ఢీకొట్టింది.

జపాన్​లో భూకంపం.. ఆ తర్వాత సునామీ!

జపాన్​లో సోమవారం మధ్యాహ్నం వరకు అంతా సాధారణంగానే ఉంది. కానీ ఆ తర్వాత.. పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. జపాన్​లోని షికావా, నైగట, టయోమా, నోటో రాష్ట్రాల్లో వరుసగా భూకంపాలు భయపెట్టాయి. నోటోలో స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4 గంటల 6 నిమిషాలకు 5.7 తీవ్రతతో భూమి కంపించింది. ఆ వెంటనే ఇతర ప్రాంతాల్లో వరుసగా 7.6, 6.1, 4.5, 4.6, 4.8 తీవ్రతతో భూమి కంపించింది. ఆ వెంటనే వచ్చిన భూకంపం తీవ్రత.. రిక్టార్​ స్కల్​పై 6.2గా నమోదైంది.

Japan Tsunami live updates : వరుస భూకంపాలతో జపాన్​ ఉలిక్కిపడింది. వాతావరణశాఖ అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు జారి చేశారు. కొంతసేపటికే.. 1.2మీటర్ల ఎత్తుగల అలలు వజిమ నగరాన్ని ఢీకొట్టాయి. మరోవైపు నోటోలోని తీర ప్రాంతంవైపు 5 మీటర్ల ఎత్తు ఉండే అలలు దూసుకెళుతున్నట్టు తెలుస్తోంది. ఇషికావాలోని నాటో తీర ప్రాంతంలో 5 మీటర్ల ఎత్తుగల అలలు దూసుకెళ్లినట్టు తెలుస్తోంది. సాధారణంగా.. 30-40 సెంటీమీటర్ల అలలను తట్టుకోవడమే చాలా కష్టం. ఇక 1 మీటర్​ కన్నా ఎక్కువ ఎత్తులో అలలు వస్తే.. పరిస్థితులు ఘోరంగా ఉంటాయని అంటారు.

జపాన్​లో భూకంపం కారణంగా అనేక భవనాలు షేక్​ అయ్యిపోయాయి. మెట్రో రైళ్లు, హోర్డింగ్​లు, వీధి లైట్లు, బోర్డులు.. అన్ని విపరీతంగా కదిలిపోయాయి. ప్రజలు.. ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. అనేక రోడ్లు చీలిపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

Tsunami in Japan latest news : మరోవైపు జపాన్​లో సునామీకి చెందిన దృశ్యాలు కూడా ఆన్​లైన్​లో దర్శనమిచ్చాయి. అలల తీవ్రత నిమిష-నిమిషానికి పెరుగుతుండటం అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.

భూకంపాల నేపథ్యంలో అక్కడి మీడియా సంస్థలు.. ప్రజలను అప్రమత్తం చేసే పనిలో పడ్డాయి. "మీరు ఇంట్లో ఉండొచ్చు. లేదా ఆఫీస్​లో ఉండొచ్చు. మీ వస్తువులు మీకు ఎంతో విలువైనవి అయ్యుండొచ్చు. కానీ అవేవీ మీ ప్రాణాల కన్నా ఎక్కువ కాదు! సునామీ ముంచుకొస్తోంది. వెంటనే మీ ఇళ్లను విడిచి ఎత్తైన ప్రాంతాలకు వెళ్లిపోండి," అని జపాన్​ మీడియా సంస్థలు ప్రజలకు విజ్ఞప్తి చేశాయి.

Japan earthquake live news : జపాన్​లో సునామీ, భూకంపం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. సునామీ ముప్పు ప్రాంతాల ప్రజలను సురక్షిత, ఎత్తైన ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ప్రకృతి విపత్తు కారణంగా జపాన్​లోని దాదాపు 37వేల కుటుంబాలకు విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా అనేక ప్రాంతాలు ఇప్పుడు అంధకారంలోకి కూరుకుపోయాయి. సెంట్రల్​, తూర్పు జపాన్​లో బుల్లెట్​ రైలు సేవలు నిలిచిపోయాయి.

తాజా భూకంపం కారణంగా ప్రాణ, ఆస్థి నష్టం జరిగాయా? అన్నది తెలియాల్సి ఉంది. కాగా.. సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్న దృశ్యాలను చూస్తుంటే.. అనేక చోట్ల వీది స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయని, మౌలిక వసతులు ధ్వంసమయ్యాయని స్పష్టమవుతోంది.

రష్యా.. నార్త్​ కొరియాలో కూడా..!

Japan Tsunami alert 2024 : జపాన్​లో సునామీ కారణంగా రష్యా, నార్త్​ కొరియా, దక్షిణ కొరియా దేశాలు కూడా అప్రమత్తం అయ్యాయి. రష్యా తూర్పు భాగానికి అలర్ట్​ ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. తూర్పు తీర పట్టణాల్లో వచ్చే మార్పును గమనించాలని, అవసరమైన సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ప్రజలకు ఆదేశాలిచ్చింది దక్షిణ కొరియా.

జపాన్​లో భూకంపం, సునామీ నేపథ్యంలో అక్కడి భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. ముప్పు ప్రాంతాల్లోని భారతీయుల కోసం ఎమర్జెన్సీ కాంటాక్ట్​ నెంబర్​ని విడుదల చేసింది. ఒక కంట్రోల్​ రూమ్​ని సైతం ఏర్పాటు చేసింది.

ఆ చీకటి రోజును ఇంకా మర్చిపోని జపాన్​..

Earthquake and Tsunami in Japan : జపాన్​లో భూకంపాలు సాధారణమైన విషయం. కానీ ఒక్కోసారి వాటి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా భారీ ప్రాణ, ఆస్థి నష్టం జరుగుతుంది. 2011 మార్చ్​లో ఇదే జరిగింది. మార్చ్​ 11న ఈశాన్య జపాన్​కు సమీపంలోని సముద్రంలో 9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ వెంటనే.. సునామీ దూసుకొచ్చింది. నాటి ఘటనలో మరణించిన, గల్లంతైన వారి సంఖ్య 19వేలు దాటిపోయింది. ఆ తర్వాత 2022 మార్చ్​లో 7.4 తీవ్రతతో సంభవించిన భూంకపం.. ఫుకుషిమాను గడగడలాడించింది.

తదుపరి వ్యాసం