Karnataka news: రైలు పట్టాలపై మందు పార్టీ; మత్తులో పట్టాలపైనే నిద్ర; ఉదయానికి నుజ్జునుజ్జైన శరీరాలు
20 July 2024, 22:03 IST
Karnataka news: మద్యం అలవాటు, నిర్లక్ష్య పూరిత వైఖరి ముగ్గురు యువకుల ప్రాణాలు తీసింది. రైలు పట్టాలపై మందు పార్టీ చేసుకుని, ఆ పట్టాలపైనే నిద్రపోయిన ముగ్గురు యువకులు ఆ పట్టాలపైననే, ఆ నిద్రలోనే రైలు చక్రాల కింద నలిగి చనిపోయారు.
కర్నాటక క్రైమ్ న్యూస్
Karnataka news: మద్యం మత్తులో రైలు పట్టాలపై నిద్ర పోయిన ముగ్గురు యువకులు రైలు పట్టాల కింద నలిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కర్నాటక లోని కొప్పాల్ లో జరిగింది. రాత్రి 9.30 గంటల సమయంలో హుబ్బళ్లి-సింధనూర్ ఎక్స్ ప్రెస్ రైలు గంగావతి నగర్ కు చెందిన మౌనేష్ పత్తారా (23), సునీల్ (23), వెంకట్ భీమనాయక (20) అనే ముగ్గురిపైకి దూసుకెళ్లిందని రైల్వే పోలీసు సూపరింటెండెంట్ ఎస్ కే సౌమ్యలత తెలిపారు.
మందు పార్టీ చేసుకుని..
రాత్రి 9:30 గంటల సమయంలో హుబ్బళ్లి-సింధనూర్ ఎక్స్ప్రెస్ రైలు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం రాత్రి 7 గంటల నుంచి ఆ ముగ్గురు యువకులు రైల్వే ట్రాక్ పై పార్టీ చేసుకుంటున్నారు. అనంతరం మద్యం మత్తులో పట్టాలపైననే నిద్రపోయారు. వారి ఇళ్లు ఆ ట్రాక్ కు సమీపంలోనే ఉంటాయి. ఆ పట్టాలపై రైళ్లు ప్రయాణిస్తాయని వారికి తెలుసని, అయితే, మద్యం మత్తులో వారికి అలాగే ట్రాక్ పై నిద్రపోయారని రైల్వే పోలీసులు తెలిపారు.
పోలీసు కేసు నమోదు
రాత్రి 11 గంటల సమయంలో కర్నాటకలోని గంగావతి రైల్వే స్టేషన్ మాస్టర్ నుంచి ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న గదగ్ కు చెందిన పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కొప్పల్ లో రైల్వే పోలీస్ స్టేషన్ లేనందున, ఈ ప్రాంతం 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న గదగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. బీఎన్ఎస్ సెక్షన్ 194 (అసహజ మరణం) కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.