Peddapalli Accident : గోడ పైకి దూసుకెళ్లిన రైల్వే ట్రాక్ మిషన్, ఆపరేటర్ కు తప్పిన ప్రమాదం!
Peddapalli Accident : పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద గూడ్స్ రైలు బోగీల లింక్ ఊడిపోయి యూటీ మిషన్ ను ఢీకొట్టాయి. దీంతో యూటీ మిషన్ ట్రాక్ చివరిలోని గోడ పైకి దూసుకెళ్లింది.
Peddapalli Accident : పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే అండర్ బ్రిడ్జ్ సమీపంలో క్యారేజ్ వాగన్ ట్రాక్‌పై తృటిలో ప్రమాదం తప్పింది. లూప్ లైన్‌లో ఆగి ఉన్న మిషన్‌ను గూడ్స్ రైలు బోగీలు ఢీకొట్టడంతో.... గూడ్స్ రైలు లింకు ఊడిపోవడంతో 8 బోగీలు విడిపోయి వేగంగా దూసుకెళ్లాయి. విడిపోయిన బోగీలు వేగంగా వెళ్లి యూటీ మిషన్‌ను ఢీకొట్టాయి. దీంతో యూటీ మిషన్ ట్రాక్ చివరిలోని గోడపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద సమయంలో యూటీ మిషన్ లో ఆపరేటర్ నిద్రపోతున్నాడు. అదృష్టవశాత్తు ఆపరేటర్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.
టీస్టాల్ లోకి దూసుకెళ్లిన డీసీఎం
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఓ టీ స్టాల్ లోకి దూసుకెళ్లింది. కరీంనగర్ నుంచి మంచిర్యాల వెళ్తోన్న డీసీఎం వ్యాన్ గోదావరిఖని బస్టాండ్ వద్ద రోడ్డు పక్కన ఉన్న ఓ టీ స్టాల్‌లోకి దూసుకెళ్లింది.డీసీఎం వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అతి వేగంతో వచ్చిన డీసీఎం ముందు మున్సిపల్ వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం పక్కనే ఉన్న టీ షాప్‌లోకి దూసుకెళ్లింది. రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పక్కనే ఈ ప్రమాదం జరిగింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. నిత్యం రద్దీగా ఉండే గోదావరిఖని బస్టాండ్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ప్రమాదస్థలిని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాసన్ సింగ్ పరిశీలించారు. బాధితులను పరామర్శించిన ఆయన... ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపిన వ్యక్తిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. బాధితులకు అన్నివిధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
బస్సు బోల్తా- మహిళ సజీవ దహనం
జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై అదుపుతప్పి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనమైంది. మంటల్లో చిక్కుకుని మరో పది మంది గాయపడ్డారు. బస్సు బోల్తా పడటానికి గల కారణం అతి వేగమే అని తెలుస్తోంది. బోల్తా పడిన తరువాత నిమిషాల వ్యవధిలోనే బస్ మొత్తం మంటలు వ్యాపించాయి. అయితే ఈ సమయంలోనే… అద్దాలు పగలకొట్టుకొని చాలా మంది ప్రయాణికులు బయపడ్డారు. ఈ క్రమంలోనే ఓ మహిళ బస్సులో ఇరుక్కుపోవటంతో బయటికి రాలేకపోయింది. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ లోపు మంటలు తీవ్రం కావడంతో బస్సులోనే మహిళ సజీవ దహనమైంది.