TVK flag launch : ‘కులం, మతం భేదాలను తొలగిస్తా’- పార్టీ జెండాను ఆవిష్కరించిన విజయ్
22 August 2024, 10:25 IST
- TVK flag launch : ప్రముఖ నటుడు విజయ్ తన తమిళగ వెట్రి కళగం పార్టీకి చెందిన జెండా, చిహ్నాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కులం, మతం, లింగం అనే భేదాలను తొలగించి ప్రజల్లో చైతన్యం తీసుకువస్తానని అన్నారు.
టీవీకే జెండాని ఆవిష్కరించిన విజయ్..
2026లో జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్న ప్రముఖ నటుడు విజయ్.. గురువారం చెన్నైలోని తన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ జెండా, చిహ్నాన్ని ఆవిష్కరించారు. ఈ ఈవెంట్లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
"దేశ విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన యోధులను, తమిళ నేల నుంచి మన ప్రజల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన అసంఖ్యాక సైనికులను ఎప్పటికీ విలువనిస్తాము. కులం, మతం, లింగం, జన్మస్థలం అనే భేదాలను తొలగించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి అందరికీ సమాన అవకాశాలు, సమాన హక్కుల కోసం కృషి చేస్తాను. సమస్త జీవరాశులకు సమానత్వం అనే సూత్రాన్ని నేను నిలబెట్టుకుంటానని బలంగా చెబుతున్నాను,' అని విజయ్ తన ప్రతిజ్ఞలో పేర్కొన్నారు.
తాజాగా ఆవిష్కరించిన టీవీకే జెండా రెండు రంగుల్లో(మెరూన్, పసుపు) ఉంది. జెండాకు ఇరువైపులా ఏనుగులు, మధ్యలో నక్షత్రాలతో కూడిన నెమలి ఉన్నాయి.
"పార్టీ తొలి రాష్ట్ర మహాసభల కోసం మీరంతా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. అందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలోనే మరిన్ని వివరాలను ప్రకటిస్తాను. ఈ రోజు మా పార్టీ జెండాను ఆవిష్కరించాను. నాకు చాలా గర్వంగా ఉంది. తమిళనాడు అభివృద్ధికి పనిచేస్తాను," అని విజయ్ అన్నారు.
తమిళంలో బుధవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో, “ప్రతిరోజూ ఒక కొత్త దిశ, చరిత్రలో ఒక కొత్త శక్తి ఉంటే అది గొప్ప ఆశీర్వాదంగా ఉంటుంది. 22 ఆగష్టు 2024న భగవంతుడు, ప్రకృతి మనకు అలాంటి ఆశీర్వాదాన్ని ఇస్తున్న రోజు. మా తమిళనాడు విక్టరీ క్లబ్ ప్రధాన చిహ్నమైన జెండాను ప్రవేశపెట్టే రోజు ఇది,” అని విజయ్ చెప్పుకొచ్చారు.
తమిళనాడు సంక్షేమం కోసం పనిచేస్తున్నామని, మన రాష్ట్రానికి చిహ్నంగా నిలిచే విజయ పతాకాన్ని గురువారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రవేశపెట్టి అసోసియేషన్ జెండా గీతాన్ని విడుదల చేస్తామన్నారు విజయ్. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.థమన్ ఈ పతాక గీతాన్ని స్వరపరచగా, వి.వివేక్ సాహిత్యం అందించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఇక గురువారం జరిగిన కార్యక్రమానికి టీవీకేకు చెందిన 300 మంది కార్యకర్తలతో పాటు విజయ్ అభిమాన సంఘాల సభ్యులకు ఆహ్వానాలు అందాయి.
నటుడు విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి ఈ ఏడాది ఫిబ్రవరిలో తన పార్టీ - తమిళగ వెట్రి కళం పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన 2024 లోక్సభ ఎన్నికల్లో ఆయన ఏ రాజకీయ కూటమితోనూ పొత్తు పెట్టుకోలేదు.