Arvind Kejriwal: బెయిల్ పొడగింపు అభ్యర్థనపై అరవింద్ కేజ్రీవాల్ కు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు
29 May 2024, 12:02 IST
Delhi excise policy case: ఆరోగ్య కారణాల దృష్ట్యా మధ్యంతర బెయిల్ ను ఏడు రోజుల పాటు పొడిగించాలన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థనను అత్యవసరంగా లిస్ట్ చేయడానికి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నిరాకరించింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal: కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉన్నందున తనకు మధ్యంతర బెయిల్ ను మరో ఏడు రోజులు పొడిగించాలని కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నిరాకరించింది. జూన్ 2న అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోనున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలపై కేజ్రీవాల్ ను ఈడీ (enforcement directorate) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ట్రయల్ కోర్టుకు వెళ్లండి..
రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ అరవింద్ కేజ్రీవాల్ కు ఇచ్చినందున, ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించలేమని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఈ దరఖాస్తును స్వీకరించడానికి నిరాకరించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ మే 28న తీర్పును రిజర్వ్ చేసినందున మధ్యంతర పిటిషన్ లిస్టింగ్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది.
వైద్య పరీక్షల కోసం..
మూత్రపిండాలు, తీవ్రమైన గుండె జబ్బులు, కేన్సర్, తదితర వ్యాధులను నిర్ధారించడానికి ఉద్దేశించిన వివిధ వైద్య పరీక్షలు చేయించుకోవడానికి వీలుగా తనకు మధ్యంతర బెయిల్ ను మరో ఏడు రోజులు పొడిగించాలని అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును కోరారు. తాను తిరిగి జైలుకు వెళ్లడానికి షెడ్యూల్ తేదీ అయిన జూన్ 2కు బదులుగా జూన్ 9న జైలు అధికారుల ముందు లొంగిపోతానని కేజ్రీవాల్ (Arvind Kejriwal) మే 26న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
లిక్కర్ స్కామ్
లిక్కర్ స్కామ్ (Liquor scam) తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు లోక్ సభ ఎన్నికల ప్రచారానికి వీలుగా సుప్రీంకోర్టు మే 10న 21 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఏడు దశల పోలింగ్ చివరి దశ జూన్ 1వ తేదీన ముగుస్తుంది. ఆ మరుసటి రోజు జూన్ 2న అరవింద్ కేజ్రీవాల్ లొంగిపోవాలని ఆదేశించింది.