Rajya Sabha: తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లోని 12 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల తేదీలను ప్రకటించిన ఈసీ
07 August 2024, 16:28 IST
- Rajya Sabha elections: ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాలకు సెప్టెంబర్ 3న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. వాటిలో తెలంగాణలోని ఒక స్థానం కూడా ఉంది. పలువురు సభ్యులు ఇటీవల జరిగిన ఎన్నికల్లో లోక్ సభకు ఎన్నిక కావడంతో పలు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి.
12 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు (PTI)
12 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
Rajya Sabha elections: రాజ్యసభలో ఖాళీగా ఉన్న 12 స్థానాలకు సెప్టెంబర్ 3న ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) బుధవారం ప్రకటించింది. కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా సహా పలువురు సిట్టింగ్ సభ్యులు లోక్ సభకు ఎన్నిక కావడంతో పది రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి.
ఆగస్ట్ 14న నోటిఫికేషన్
రాజ్యసభ ఎన్నికలకు ఆగస్టు 14న నోటిఫికేషన్ జారీ చేస్తామని, ఎన్నికల నామినేషన్ల దాఖలుకు ఆగస్టు 21 చివరి తేదీ అని ఎన్నికల సంఘం తెలిపింది. ప్రతి రాజ్యసభ స్థానానికి సెప్టెంబర్ 3న వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తామని ఈసీఐ ప్రకటించింది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 26 వ తేదీ వరకు గడువు ఉంది.