EC Orders On DBT: ఇప్పుడే నిధుల విడుదల ఎందుకు,ఆ తీర్పులో స్పష్టత లేదు, మధ్యాహ్నంలోగా లెక్కలు తేల్చాలన్న ఎన్నికల సంఘం
EC Orders On DBT: ఏపీలో ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల విషయంలో ప్రతిష్టాంభన కొనసాగుతోంది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఈసీ నుంచి స్పష్టత కోరిన రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. నిధుల విడుదలకు తొందరెందుకని ప్రశ్నించి, మధ్యాహ్నం మూడు గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
EC Orders On DBT: నగదు బదిలీ పథకాలపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల్లోగా ఏపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
సంక్షేమ పథకాల్లో భాగంగా లబ్దిదారులకు నగదు బదిలీ చేయడాన్ని మే 13వ తేదీ తర్వాత చేపట్టాలని ఎన్నికల సంఘం మే 3వ తేదీన ఆదేశించిందని, గురువారం ఏపీ హైకోర్టు ఈసీ జారీ చేసిన ఆదేశాలను అబయన్స్‌లో పెడుతూ ఆదేశించిన నేపథ్యంలో స్పష్టత కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం.. ఎన్నికల సంఘానికి ఈసీ లేఖ రాసింది.
రాష్ట్ర ప్రభుత్వ లేఖపై ఏపీ ప్రభుత్వం నుంచి పలు అంశాలపై వివరణ కోరింది. ఈసీ ఆదేశాలను కోర్టు అబయన్స్‌లో పెట్టిన నేపథ్యంలో, హైకోర్టు ఉత్తర్వుల ఆధారంగా ప్రభుత్వానికి లబ్దిదారులకు నిధుల పంపిణీకి ఎన్వోసి లభించినట్టు పరిగణించలేమని ఈసీ పేర్కొంది.
డిబిటి పథకాలకు నిధులు విడుదల చేయాల్సిందిగా కూడా హైకోర్టు ఉత్తర్వుల్లో స్పష్టత లేదని, చీఫ్ సెక్రటరీ ఈసీకి రాసిన మే10వ తేదీ లేఖలో కూడా స్పష్టత లేదని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. దీనిపై మరింత మెరుగైన సమాచారం ఎన్నికల సంఘానికి ఇవ్వాలని సూచించారు.
ఆ లెక్కలు తేల్చండి…
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేసే విషయంలో ఎదురవుతున్న అటంకాల వల్ల లబ్దిదారులకు కలుగుతున్న అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మరింత సమాచారం ఇవ్వాలని ఈసీ కోరింది. ఈసీ నుంచి డిబిటి పథకాలకు నిధుల విడుదల కోసం ఎన్వోసి జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మరింత సమాచారం ఇవ్వాలని ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ లేఖలో పేర్కొన్నారు.
మే 10వ తేదీన రాసిన లేఖలో సీఎస్ సంక్షేమ పథకాలకు నిధులను చెల్లించడానికి తగినన్ని నిధులు ఖజానాలో ఉన్నాయని పేర్కొన్నారని, 2024 జనవరి నుంచి మార్చి వరకు ఉన్న ఆర్ధిక పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని ఈసీ కోరింది. అప్పుడు నిధులు ఎందుకు విడుదల చేయలేదో చెప్పాలని, అప్పట్లో నిధులు ఎందుకు విడుదల చేయలేకపోయారో చెప్పడంతో పాటు ఖజానాలో ఇప్పుడెలా నిధులు వచ్చాయో చెప్పాలని, పోలింగ్ తేదీ సమీపిస్తున్న సమయంలో నిధులు ఎందుకు విడుదల చేస్తున్నారో వివరించాలని ఈసీ కోరింది.
గతంలో బహిరంగ సభల్లో బటన్ నొక్కడం ద్వారా డిబిటి లబ్దిదారులకు నిధులు చెల్లించనప్పటి నుంచి వారి ఖాతాలకు వాస్తవంగా నగదు చేరడానికి పట్టిన సమయం ఎంతో కూడా వివరించాలని ఈసీ కోరింది. గత ఐదేళ్లలో నగదు బదిలీ పథకాలను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు బటన్ నొక్కారో, ఎప్పుడు ఖాతాలకు చెల్లించారో తేదీలతో సహా చెప్పాలని, తద్వారా పోలింగ్ కు ముందు నిధుల విడుదల విషయంలో స్పష్టత ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.
ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన పిటిషనర్లు రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారుల జాబితాలో ఉన్నారో లేదో కూడా స్పష్టం చేయాలని ఈసీ కోరింది. నేడు నిధుల పంపిణీ జరగకపోతే వచ్చే నష్టమేమిటో చెప్పాలని, నగదు బదిలీ ప్రకటించి చాలా వారాలు గడిచినందున ఒక్క రోజులో వచ్చే నష్టం ఏమిటో ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్నారు.
ఏప్రిల్-మే నెలలో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని తెలిసి కూడా పోలింగ్ ముందు నగదు బదిలీ చేయాలని ఎందుకు భావిస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరింది. సదరు తేదీల్లో నగదు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందే నిర్ణయిస్తే వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను శుక్రవారం మధ్యాహ్నం 3గంటల్లోగా సమర్పించాలని ఈసీ ఆదేశించింది.
సంబంధిత కథనం