తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rajasthan Crime News : బావిలో దళిత యువతి మృతదేహం.. గ్యాంగ్​ రేప్​ చేసి చంపేశారా?

Rajasthan crime news : బావిలో దళిత యువతి మృతదేహం.. గ్యాంగ్​ రేప్​ చేసి చంపేశారా?

Sharath Chitturi HT Telugu

14 July 2023, 13:27 IST

google News
  • Rajasthan crime news : రాజస్థాన్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 19ఏళ్ల యువతి మృతదేహం బావిలో కనిపించింది. కొందరు ఆమెను రేప్​ చేసి, చంపి, బావిలో పడేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

బావిలో యువతి మృతదేహం.. రేప్​ చేసి చంపేశారా?
బావిలో యువతి మృతదేహం.. రేప్​ చేసి చంపేశారా?

బావిలో యువతి మృతదేహం.. రేప్​ చేసి చంపేశారా?

Rajasthan crime news : 19ఏళ్ల దళిత యువతి మృతదేహం బావిలో కనిపించిన ఘటన రాజస్థాన్​లో కలకలం రేగింది. ఈ ఘటనపై రాష్ట్రంలో రాజకీయ దుమారం చెలరేగింది. బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన తర్వాత ఆమెను చంపేసి, బావిలో పడేశారని ఆరోపణలు వస్తున్నాయి.

ఇదీ జరిగింది..

రాజస్థాన్​ కరౌలి జిల్లాలోని హిందౌన్​ నగరంలో ఉన్న బావిలో గురువారం యువతి మృతదేహం కనిపించింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. మృతదేహాన్ని బావిలో నుంచి తీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు.. బాల్ఘట్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతి అని గుర్తించారు. ఆమె కుటుంబసభ్యులకు సమచారం అందించారు.

ఘటన గురించి సమాచారం అందుకున్న బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ కిరోది లాల్​ మీనా.. ఆసుపత్రికి వెళ్లారు. అదే సమయంలో అనేకమంది బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి వెళ్లారు.

Rajasthan rape case : "నదోతి ప్రాంతం నుంచి బాధితురాలు ఇంటికి వెళుతుండగా.. కొందరు దుండగులు ఆమెను అపహరించారు. అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను చంపి, బావిలో పడేశారు," అని ఎంపీ మీనా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత, బాధిత కుటుంబంతో మాట్లాడతామని, వారికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

"యాసిడ్​ దాడులు, రేప్​లపై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సూచనలు చేసింది. కానీ ఇక్కడి ప్రభుత్వం అందుకు తగ్గట్టు చర్యలు చేపట్టడం లేదు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడతాము," అని ఎంపీ మీనా అన్నారు.

'పోలీసుల నిర్లక్షం..!'

మరోవైపు.. ఈ ఘటనకు సంబంధించి, పోలీసుల తీరుపైనా బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

Dalit girl dead in Rajasthan : "బాధితురాలు కనిపించడం లేదని ఆమె కుటుంబసభ్యులు పోలీస్​ స్టేషన్​కు వెళ్లారు. ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు వారి మాటలను, ఫిర్యాదును పట్టించుకోలేదు. సంబంధిత అధికారులపై కఠినమైన చర్యలు చేపట్టాలి," అని బీజేపీ రాజస్థాన్​ కిసాన్​ మోర్చా ఉపాధ్యక్షుడు ధర్మ దాగుర్​ మండిపడ్డారు. ఇంత జరిగినా.. జిల్లా కలెక్టర్​ కానీ, జిల్లా ఎస్​పీ కానీ ఆసుపత్రికి రాలేదని, ఫలితంగా అధికారుల నిర్లక్షం స్పష్టమవుతోందని ఆరోపించారు.

నిందితులను వెంటనే పట్టుకోవాలని సర్వత్రా డిమాండ్​లు వెల్లువెత్తుతున్నాయి. బాధిత కుటుంబానికి రూ. 20లక్షల పరిహారంతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని దాగుర్​ డిమాండ్​ చేశారు.

బీజేపీ నేతలు, కార్యకర్తల నిరసనలతో ఆసుపత్రి వద్ద స్వల్ప ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు.. పరిస్థితిని అదుపుచేశారు. నిందితులను పట్టుకుంటామని హామీనిచ్చారు.

తదుపరి వ్యాసం